28 November 2011

vignette

ఇక్కడ ఏమీ లేదు: వస్తావు లిల్లీ పూవులతో

నీరెండని గాలిలో పుచ్చుకుని అద్దంలోంచి
అర్థంలోంచి తొంగి చూసి పలుకరిద్దామని:

ఆ పిచ్చుకలు ఎప్పుడూ మాట్లాడవు. పగిలిన
మట్టిపాత్రలో నీళ్ళతో నీళ్ళలో ఆడే పిచ్చుకలు
నీవైపు చూసి రెక్కలని విదిల్చి
తుర్రున ఎగిరిపోయే పిచ్చుకలు

ఏమని పిలిచావ్ వాటిని? ఎందుకు రమ్మని
పిలిచావ్ వాటిని ఇంటి ముంగిటిలోకి?

పిలుపు ఏదో సాగుతుంది నీది గదిలో మెరుపై
అలజడి ఏదో రేగుతోంది నీది మదిలో కలవరమై
సవ్వడి ఏదో మెసులుతోంది నీది
పిల్లి పాదాల మెత్తటి పద సన్నిధై

కదలిపోతోంది మధ్యాన్నం ఆకాశమై
నేలపై కదిలిపోయే మబ్బుల నీడలై:

పరిసరాల్లో పరిమళపు పసిడి కాంతి
శరీరాల్లో రాలే చినుకుల తడి. తడబడి
అల్లుకుంటుంది ఇంధ్రధనుస్సు కళ్ళల్లో
విచ్చుకుంటుంది జ్వాల వేళ్ళ చివర్లలో

ఇక్కడేమీ లేదు: ఊరికే వస్తాను నేను
కొలనులో చీకటిలో రాలే చుక్కలతో=

ఇటొక మెరుపు, అటొక మెరుపు

కొంత శాంతి కొంత బ్రాంతి
కొంత ఇష్టం కొంత అయిష్టం
కొంత దయ కొంత విలాపం
కొంత వరం కొంత శాపం
కోలుకోలేనంత పయనం:

ఎలా వచ్చావో తెలియదు, ఎలా వెళ్లి
పోయావో తెలియదు. అరచేతుల్లో
గాయమయ్యి ఊరే వదనమెవరిదో
చూపుల్లో పరావర్తనం చెందే రూపం
ఎవరిదో అనువాదం కాదు

నింగికి ఎగిరిన పిచ్చుకలు వస్తాయి నీ వద్దకు
సంధ్యవేళకి ఛాతిలో చోటు చేసుకునేందుకు
చేరతాయి అర్థరాత్రిలో వికసించిన లిల్లీ పూలు
నీ వద్దకు నీ పెదాలపై నిదురించేందుకు
చేరుతుంది నిన్ను హిమవనపు శ్వేత గాలి
నీ బాహువులలో ఊయలలూగేందుకు:

నిన్ను పిలవాలేదు, నిన్ను రమ్మనీ అనలేదు

ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన మనిషిలో
పూలదర్పణ సమాధిని నిర్మించి
రమ్మనకుండా వచ్చి పొమ్మనకుండా పోయి

రాకుండా రమ్మనకుండా హృదయంలో దూరమై
రణరంగమై మిగిలిపోయింది ఎవరు?

26 November 2011

ఏమని

నివ్వెరపోయిన నీ చేతులని
ఏమని పిలువను?

కొమ్మని వీడి నింగిని తాకే
విహంగపు రెక్కలనా లేక
పూవులల్లో పిలుపులలో
దాగిన రహస్య నామమనా

నివ్వెరపోయిన నీ చేతులను
నివ్వెరపోయిన నీ కనులను

ఏమని పిలువను?
ఏమని రచించను?

రమ్మనే

రమ్మనే చోటకు రమ్మనకు
రారాననే చోటకు పిలువకు

నింగిలోని కలువలు
నేలలోని మబ్బులు

పిలవకు రమ్మనకు వెళ్ళిపోకు

చేతిలో పూలతో
పూల చేతులతో

నిన్ను నిండైన బాకుతో
పొడిచినది ఎవరు?
నిన్ను కనుల నిండుగా
చంపింది ఎవరు?

రమ్మనకు రమ్మనే చోటికి
పొమ్మనకు పోలేని చోటికి

23 November 2011

తెలియదు

ఏం చేస్తున్నావో తెలియదు

చూసేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
చల్లటి కాంతి చిక్కటి చీకటిగా
మారుతున్న వేళల్లో నిన్నెవరూ వినరు కనరు

తెల్లటి కాగితంపై ముద్రితమౌతున్న
నీ వదనపు అంచులను తాకుతూ నేను
నీలిగులాబీలను హృదయ సమాధిపై

ఉంచుతాను, తాకుతాను, వింటాను

ఏం చేస్తున్నానో తెలియదు

ఊహించని నవ్వులాగా ఎదురుపడే నువ్వు
ఊహించని వానలాగా రాలిపడే నువ్వు
ఊహించని గాలిలాగా సుతిమెత్తగా తాకి
కనులపై నుంచి కలవలే వెళ్ళిపోయే నువ్వు

ఏం చేస్తున్నావో తెలియదు. వస్తావో రావో తెలియదు
పదమై పలుకరిస్తావో లేదో తెలియదు
అనుకోకుండా ఎదురుపడతావో లేదో తెలియదు:

తెలియని తనం నీ తనువుగా మారిన తరుణంలో
ఇక నువ్వెలా ఉంటావో ఉన్నావో తెలియదు

ఏం చేస్తున్నామో తెలియదు

హత్తుకునేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
తెల్లటి కాంతి నల్లటి నుసిగా మారే వేళల్లో
నిదురను ఇచ్చేందుకు ఎవరూ రారు, రాలేరు:

ఇంతా చేసి బావున్నావా అని అడిగితే
ఎవరైనా ఏం చెబుతారు? ఎవరైనా ఎలా
మామూలుగా ఉండగలుగుతారు?

20 November 2011

వెళ్లిపోదామనే

వెళ్లిపోదామనే అనుకున్నాను నేను

అయితే నీ ముఖమే ఒక ఇంద్రధనుస్సై
లాగింది నన్ను నీ వైపు

ఎవరు ఆపగలరు ఎవరు ఓపగలరు

చీకట్లో వెలిగించిన ప్రమిదెను
ప్రమిదెలో వెలిగిన తనువును
తనువులో రగిలిన మంటను
నీలినీడలలో కదిలే పక్షులను
రెక్కల్లో వొదిగిన వక్షోజాలను
పెదాలపై నెత్తుటి గాటునూ
క్షతాలలో ఊరిన కన్నీళ్లను?

అయితే ఇదంతా వేరే కథ: అందుకే
ఇక నీకు నేను మరొక కథ
ఎన్నడూ చెప్పను: చూడకు

అరవిచ్చిన చంద్రబింబం వంటి
నీ శ్వేతకమల వదనం నుంచి
మరలిపోదామనే అనుకున్నాను నేను=

(
ఏడు రోజుల విలాపం తరువాత
ఏడు రంగులుగా విచ్చిన
తన తనువును తను
అతని దర్పణంలో రచించింది:

పదాలు అద్ధమైన పదాలు
అడ్డుకున్నాయి ఈ పదాలను:

అయితే ముందుగా
మాట్లాడింది ఎవరు?)

19 November 2011

అర్ధంతరం / అంతరం

ఒక మంచుదీపం వెలిగింది హృదయంలో పావురాళ్ళు
గజిబిజిగా మెసిలే ఇనుప రాత్రుళ్ళలో

నువ్వు అనుకోలేదు ఇది ఇలా ఉంటుందని. హృదయం
అంటుకుంటుందని శాపంలా మారుతుందని

తెరిచిన కిటికీలలోంచి వెన్నెలా వెలుతురూ మంచూ
ఏది ఏదో తెలియదు ఏది ఏదో కనపడదు ఏది ఏదో అందదు
ప్రేమించిన స్నేహితులలాగే ద్వేషించలేని స్త్రీలలాగే

నీ కోరికల్లా ఇంత వెన్నెల వేళను
నీ ఆశ అంతా ఇంత రాత్రి కళను
నక్షత్రాలతో నవ్వులతో ఇళ్ళకు
నలుగు పెట్టి వాళ్ళకు అందిద్దామనే
నీ కోరికల్లా గాలి నీడలు నడయాడే
సంధ్య కాంతి సరస్సులను
వాళ్లకు చూపిద్దామనే చూద్దామనే:

ఎపుడైనా చూసావా నువ్వు మంచుదీపం వెలిగిన
హృదయంలో రాత్రి ఎలా ఉంటుందో
రాత్రిలో హృదయం ఎలా ఉంటుందో

అనుకోలేదా నువ్వు ఇది ఇలా ఉంటుందని హృదయం
దహించుకుపోతుందని దగ్ధం అవుతుందనీ

అరచేతిలో చేయి వేసి ఏడు లోకాలు తిరిగి వచ్చింది ఇక్కడే
పెదాలపై పెదాలని ఆన్చి ఏడు కాలలని కలలని చూసింది ఇక్కడే
తన ముఖాన్ని గుండెలో హత్తుకుని ఎడారులని దాటిందీ ఇక్కడే
బెదిరిన తెల్ల పావురాళ్ళ రెక్కలని నిమిరి
వాటి కళ్ళల్లో పిల్లల చూపుల్ని చూసిందీ ఇక్కడే

కోరిక కాని కోరికలో రాత్రి. రాత్రి కాని రాత్రిలో ధాత్రి: ధాత్రిలో గాలిలో
విశ్వలోకపు సందడిలో శిశువుల నిదురలోకి
మల్లెపూలనూ ఆకుపచ్చ సీతాకోకచిలుకలనూ
పంపిద్దామనే నీ తపన అంతా: అంతం అంతాన

ఇక నువ్వు ప్రేమ అంటే ఏమిటని అడిగితే నేనేమి చెప్పేది?

18 November 2011

ఈ రోజు/ఆ రాత్రి

.
..
...
....
.....
......
.......
........
.........

.........
........
.......
......
.....
....
...
..
.

=హృదయపు ధ్వని
ధ్వని హృదయం
దయలేని హృదయం

లబ్ డబ్
లబ్ డబ్
లబ్ డబ్
లబ్ డబ్

మీరిక ఆమెనూ (తననే)
తన పాపనూ సమాధిలోంచి
ఇప్పటికీ పొడుచుకువచ్చే తన
గర్భస్రావపు రక్తనాయనాలనూ
చూడలేరు మీరిక ఎప్పటికీ:=

......... ........ ....... ...... .....
.... ... .. .

.
..
...
....
.....
......
.......
........
.........

!!!!!!!!!!! ( నా దేశం ఇది)
??????? ( నా దేహం ఇది)
( " " " " " " (నా స్త్రీ
తన పురుషుడూ ఇది " " )

>< >< ( పిల్లలు ఇవి)
******( గోడమీద గీసిన
వాళ్ళ గీతాలు ఇవి=)

ఇతరునితో % గించబడి
@ ఎవరు నువ్వు
ఈ అ/వాచకంలో?

) స్వప్నించకు
ఎలుక పాదాలలో చిక్కిన గడ్డి
కొద్దిగా అల్లాడుతోంది

పిల్లుల గురించి
స్వప్నించకు(

..................................
వాచకమూ లేదు
వాగ్ధానం లేదు: పోనీ
నువ్వు ఉన్నావా
(?????????????)

..................................

ఒక కల తన పెదాల్ని
ముద్దాడినది ఇక్కడే
.................................

ఎమ్టీ ఎమ్టీనెస్: చూడిది
పాప పద పాపాలు: వెళ్ళు
వెళ్ళకు. ఉండిపో. పో-
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


(సరిగ్గా ఇలాగే: ఇలాగే.
రాత్రి శ్వేత వనంలో
పగటి చీకటి చరిత్రలో

ఇలాగే రాయబడ్డాను
ఇలాగే చదవబడ్డాను
ఇక ఏముంది చూచేందుకు
ఇక ఏముంది వినేందుకు?

నన్ను నన్ను అనబడే
అతడిని అలా వొంటరిగా
ఈ రోజులోకీ ఆ రాత్రిలోకీ

వొదిలివేయండి దయతో
దయచేసి దయకలిగిన
మీ మెత్తటి క్రూరత్వంతో)

17 November 2011

పూర్వ వాచకం

అడగటం మరచిపోయావు నువ్వు
క్షమించమనీ కరుణించమనీ:

నీ ఇళ్ళకు రావు యిక పక్షులు
నీ గాలిలో తిరగవు యిక
నీ పిల్లలవంటి సీతాకోకచిలుకలు
నీ ఇంటి ముంగిట నిలబడదు
నీ వైపు చూస్తో ఒక తెల్లటి ఆవు
నీ పెరట్లో తిరగవు పిల్లులు
నీ పాదాల చుట్టూ సాగవు
మచ్చల కుక్కపిల్లలు:

ఏం చేసావు నువ్వు? రాదు

నీ అరచేతులలోకి తన వర్షం
వానలోకి తన తనువు
భూమినంతా కుదిపివేసే
తన నక్షత్రాల పిలుపు.
ఏం చేసావు నువ్వు? రాదు

ఇకెప్పటికీ: మొలకెత్తవు
ఇకెప్పటికీ చివుర్లు
అలసిన నీ ఎరుపు కనులలో:

క్షమించమనీ కరుణించమనీ
ప్రార్ధించటం నిజంగానే
మరిచిపోయావు నువ్వు

యిక ఎవరు కాపాడగలరు నిన్ను?

16 November 2011

ఎవరు?/క్షుద్ర...

నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ

చీకట్లో మర్రిచెట్లల్లో దాగున్నదీ
రాత్రుళ్ళలో స్మశానాలల్లో
సమాధుల పక్కన చింతించేదీ
నువ్వే అని వేరే చెప్పాలా?

నరుడా భాస్కరుడా హంతకుడా
కపాల చరిత్రలను కప్పుకోకుండా
విప్పెదీ చెప్పేదీ కప్పెదీ నువ్వే అని
విరివిగా వేరేగా చెప్పాలా?

తోడేళ్ళు తిరుగాడే దారులలో
నక్కలు ఎదురుచూసే వేళల్లో
నిప్పులతో నింగికి భూమిని చూపించేది నువ్వే
చితాభస్మాలలో అరకాలిన ఎముకలతో
వృక్షాలలో దాగిన వానకు ఆహ్వానం పలికేదీ నువ్వే
కలలతో తిరిగిరాని జాడలతో, నువ్వు కాని పదాలతో
ఆదిమ ఆర్తనాదాలతో శవాన్ని చేసేదీ నువ్వే
శవమయ్యేదీ శవాన్ని మోసుకుపోయేదీ నువ్వే

ఆహారమయ్యావా నువ్వు
నలుదిక్కులకూ పంచభూతాలకూ?
దాహార్తిని తీర్చావా నువ్వు
నిండైన గ్రహంకూ నిండు జాబిలికూ?

నువ్వు దహించివేసిన నువ్వు
యంత్రలిఖితం చేసిన నువ్వు
లోహపూరితం చేసిన నువ్వు
విషతుల్యం చేసిన సరస్సులలో
నీ ముఖాన్ని చూసుకున్నావా
తొలిసారిగా నువ్వు? తొలకరి కాలేని
తొడిమలను తెంపివేసిన నువ్వు?

నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ

శరీర వాహక పాపాలను
వాహకం లేని దోషాలను:

నువ్వు జన్మించావు నువ్వు మరణించావు

ఈ మధ్యలో కొంతమందిని చెరిచావు
ఈ మధ్యలో కొంతమందిని వలచావు
ఈ మధ్యలో కొంతమందిని
హింసించావు వొదిలివేసావు. ఈ మధ్యలో
నీ జననం మరణం అయిన స్త్రీలను
పరిపరి వాచకాలలో ప్రతిష్టించావు
పారిపోయావు ఓడిపోయావు పోయావు
నిలువెత్తు కట్టడాలను నిలువునా నిర్మించి
అంతర్ముఖ ఇతరునికి ఇతరుడివి

ఆయ్యావు నువ్వు. పోయావు నువ్వు

నవ్వలేదు ఎన్నడూ చూడలేదు ఎన్నడూ
నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ:

లోహహస్తాలతో లోహపు చూపులతో
భూమిని తవ్వుకుని లోహ భాషతో
భూస్థాపితం భూద్రోహం అయ్యినది ఎవరు?

14 November 2011

ఈ ఉదయం

ఈ ఉదయం ఒక మంచుపూల వృక్షం

ఛాతిపై వెచ్చగా చేయి ఒకటి ఉండాలి
ఇక్కడే ఎక్కడో మెడ చుట్టూ సాగుతూ

ఈ ఉదయం ఒక మంచుపూల పాలవాన

ఇల్లంతా ఎగురుతూ కువకువలాడుతూ
వానలో మంచువనాలలో సవ్వడి చేసే
రెండు పిచ్చుకలు ఉండి ఉండాలి
ఇక్కడే ఎక్కడో ఈ పూట తోటన:

ఈ ఉదయహృదయం ఎవరూ తాకని
మంచు మొక్కలు చిగుర్చిన మట్టిదారి

గదిలోకీ మదిలోకీ సూర్యస్వప్నం
మదిలోకీ గదిలోకీ కాంతి పవనం
గదిలోకీ మదిలోకీ శాంతి సదనం

తనువులోకీ తనలోకీ కాల జలం
తనువులోకీ నాలోకీ ఇంద్రజాలం

ఈ ఉదయం ఈ హృదయం ఈ నయనం
మంచువృక్షాలలో మంచుకోయిల పాడే
పచ్చని మంచుపాట ఈ పూట: చూడు

నువ్వు చదువుకునే పుస్తకం వద్ద
మంచు చినుకులు నిండిన
మంచుకాంతితో మెరుస్తోన్న

ఎర్రని రోజు రోజాపూవుని
ఉంచి వెళ్ళినది ఎవరు=?

13 November 2011

ఇక ఎన్నడూ

కన్నా దూరం నుంచి దూరం జరుగుదామని
తెచ్చావు ఒక వెన్నెల పూవును నువ్వు నాకోసం

ఓదార్పు లేని దారులలో
కంట కన్నీరు నింపుకుని
దగ్గరితనం కాని కాలేని
దరి చేరలేని దూరమై

కన్నా నీ నాన్న: కన్నా నిను కన్న

నిను దీవించిన అరచేతులు లేవిక్కడ
నేను జీవించిన గురుతులు లేవిక్కడ

హాయిగా నవ్వులని హత్తుకున్న
నిర్మల బాహువులు లేవిక్కడ
చుబుకం ఎత్తి నుదుటిని నిమిరి

కంట నీరు తుడిచిన ముని వేళ్ళు లేవిక్కడ

అమావాస్య రాత్రి అమావాస్య ధాత్రి
నల్లని అలలు మేఘాలై నింగిని తాకి
నిను వీడి నిను కాంచి నిన్ను
బెంగగా బెదురుగా తీసుకువెళ్ళే వేళ

ఎదురుచూసావా నువ్వు కన్నా నువ్వు
నా కోసం? దూరం నుంచి దూరం
జరుగుదామని దూరంగా వెళ్ళిపోదామని
ఒక రాత్రిరోజాతో రోజంతా వేచి చూసావా
కన్నా నువ్వు నా కోసం? నాన్న కోసం?

రాత్రి రాయితో ఆగిపోయింది. రాయి
హృదయమై నిను విస్మరించింది
హృదయం తిరిగి ఒక కలలకొలనై
ఒక కలువను నీకై రాత్రిని రాత్రిగా
ఒక బహుమతిగా తెచ్చిఇచ్చింది.

ఎదురుచూసీ చూసీ నిదురలోకి జారిన
నీ కనులవనాలలోకి నేను నీకొక
పచ్చని గొంగళిపురుగును పంపాను:

ప్రతిగా నువ్వు ఇలలోంచి కలలోంచి
నింగిలోంచి నేలలోంచి
నాన్నలు నివ్వెరపోయే
ఒక సప్తరంగుల సీతాకోకచిలుకను పంపించు

నీకు తెలిసిన ఇంద్రజాలంతో
పసివదనపు మంత్రజాలంతో
బిరబిరా పరుగిడే పదాలతో:

ఇక నీకై నేను కొంతకాలం బ్రతికే ఉంటాను
ఇక నీకై నేను కొంతకాలం
నీ కలలకావలగా దాగునే ఉంటాను

దూరం నుంచి దూరం జరుగుదామని
నువ్వు తెచ్చిన వెన్నెల పూవుతో
నీ నిదుర సరస్సుని అంటిస్తో ప్రేమిస్తో:

(ఇక నేను ప్రేమ గురించి
ఎన్నడూ మాట్లాడను=)

11 November 2011

నువ్వే

నీ ముందు మోకరిల్లిన మోము ముందు
నువ్వు నిస్సహాయుడివి

నిన్ను స్వీకరించిన చేతుల ముందు
నువ్వు దారి మరిచిన బాలుడివి

నిన్ను తాకిన కనుల ముందు నిన్ను
రక్షించిన చూపుల ముందు
దారీ తీరం లేని నావికుడివి

ఎంతకాలం పట్టిందీ గూడు అల్లుకోడానికి?

తిరిగి తిరిగే ఆ నల్లటి మట్టి పక్షులని
తిరిగి తిరిగి వచ్చే నదులు నిండిన ఆ
రెక్కల్నీ చూసానా నేను ఎపుడైనా?

ఏమని పిలవాలి? ఎవరిని రమ్మనాలి?

హృదయం పై హృదయం
ఒక వింత కాలకూట విషం
పెదవి పై పెదవి మాట పై మాట
అంతా వింత చితాభస్మం
నువ్వు తాకిన తను తన తనువు
అంతా ఒక వింత వి/స్మృతి మౌనం

ఎవరిని పిలువను?
ఏమని రమ్మనను?

నీ ముందు కన్నీళ్ళతో మోకరిల్లిన
దిగులు మోము ముందు
నువ్వు అనాధవీ నిస్సహాయుడివీ:

చేతులు ముకుళించి తల వంచి
సర్వాన్నీ ప్రేమించి, ఏమీ ఆశించక
నీడల్ని కిరణాలతో అల్లే మనిషికి

ఇక నవ్వడమెలాగో
ఇక ఉండటమెలాగో

నువ్వే చెప్పు. నువ్వే నేర్పించు.

08 November 2011

ఎలా చెప్పటం

ఉంచుకునేందుకు నువ్వు గుర్తు
ఉంచుకునేందుకు నువ్వు

సరళంగా సరళత్వంతో సరళమైన దానిని
ఏదైనా ఇవ్వాలనుకున్నాను నీకు ఈ రోజు:

ఏమై ఉండవచ్చు అది? ఎటు వంటి పేరుని
కలిగి ఉండవచ్చు అది? కలిగి ఉన్నదానికి
కలిగిందానికి ఎటువంటి పేరునూ ఎటువంటి
బహుమతినీ బహుమతి కాక ఇవ్వవచ్చు?

పూలను ఇద్దామనుకున్నాను.
పక్షులను ఇద్దామనుకున్నాను
వదనాన్ని పసిపిల్లల చేతులతో

అల్లుకునే సాయంత్రపు గాలినీ
వొంటిని చలిమంటై చుట్టుకునే
చలికాలం నూగు సూర్యరశ్మినీ
గాజులకాంతై తాకే చల్లటి నీటినీ

కొంత వెన్నెలనీ కొంత చీకటినీ
నీకు ఇద్దామనే అనుకున్నాను

కొత్త రంగులనీ కొత్త పదాలనీ నీ పెదాలకి
అందిద్దామనుకున్నాను. నువ్వు చూడని
రాత్రినీ ధాత్రినీ తేలే ఎ/మరుపు మబ్బుల్నీ
ఆకులపై రాలే ఎండిన ఆకుల సవ్వడులనీ

నీకు వినిపిద్దామనే అనుకున్నాను
నీకు చూపిద్దామనే అనుకున్నాను

ఎవరు చూసారు ఇవన్నీ? ఎవరు
చూపించారు ఇవి ఇవన్నీ? అన్నీ

అడగవు నువ్వు చెప్పలేను నేను

సీతాకోకచిలుకలు వాలిన భూమి ఏది?
చినుకులు రాలిన నీ చెంపలని నిమిరిన
చేతులు ఏవి? నీ కన్నీళ్ళని ముద్దాడిన
పెదాలు ఏవి? నీ అరచేతిని పుచ్చుకుని
నిన్ను నడిపించిన చేతులు ఏవి?

అడగవు నువ్వు ఇవన్నీ చెప్పను
చెప్పలేను నేను ఇవన్నీ ఎప్పటికీ

సరళంగా సరళత్వంతో
సరళమైన బహుమతిని
ఇవ్వాలనుకున్నాను నేను ఒక రోజురోజాను
నీకు ఈ బహుమతి రోజు:

కొంత శాంతి కొంత కాంతి
కొంత భద్రత కొంత పవిత్రత
కొంత నిద్ర కొంత మెలుకువ
కొంత కరుణ కొంత నిబద్ధత

ఇవేమీ ఇవ్వలేక ఇవేమీ తీసుకోలేక
సరళత్వం కాలేక సరళంగా నీ వద్దకు
రాలేక సరళత్వాన్నితేలేక తెచ్చాను

వడలిపోయిన రెండు రెమ్మలను
సరస్సులు దాగిన కనురెప్పలను
లోయలు దాగిన కనుబొమ్మలను

తీసుకో: ఉంచుకో: దాచుకో
పూలపాత్రలో అలంకరించుకో
ఊరూ పేరు లేని
రంగూ రుచీ లేని

నీ సహచరుడిని నిశాచరుడిని
నిశ్శబ్ధపాదాచారిని

అరవిచ్చిన నీ లేత ఎరుపు కనులలో
పచ్చటి గడ్డి నీటిలో కదులాడే
నీ గోరువెచ్చని బాహువులలో:

ఆ తరువాత ఎలాగూ నీ పిల్లలు చెబుతారు

తండ్రి కాలేని తనయుడి గురించి
ప్రియురాలు కాలేని భార్య గురించి
శిధిలాలలోంచి శిధిలాలకి మరలే
జననమరణాల రహస్యాల గురించీ

తమ రక్తంతో తమ తనువులతో
మన రక్తంలో మన తనువులలో

సంతకాలు చేస్తో మనకి
స్వసంతర్పణలు ఘటిస్తో

కలలోంచి కలలోకి సాగిపోతో
ఇంకా
కలలై మిగిలి రాలిపోతో:

నువ్వేమైనా చూసావా ఈపూట
గూళ్ళ వద్దకు పాకుతున్న నీలి
కుబుసాల నల్లని సర్పాలని?

(ఇక ఇక్కడ ఆగిపోతాను
ఇక ఇక్కడ విరిగిపోతాను

ఇక ఇంకా ఇక్కడ నేను
విశేషణంలేని క్రియనై
ఆగి సాగిపోతాను)

07 November 2011

మధ్య

నోరు తెరిచి ఆడగాలేవు ఏదీ చెప్పాలేవు

కనుల వెంబడి నీళ్ళు
వెళ్ళిన పాదాల వెంట

కన్నీళ్లు. ఎవరిచ్చారు నీకు ఈ శిక్ష?

కలలో కలకూ కలకూ మధ్య
మిగిలిన స్థలంలో
చీకటి కాలంలో అతడొక్కడే:

బావున్నావా అని అడిగితే
ఎవరైనా ఏం చెబుతారు? ఎలా చెబుతారు?

తండ్రి కళ్ళను తుడిచే
లేత చేతులే లేవిక్కడ:

04 November 2011

ఇంటికి ఇద్దరు

ఇంటికొక పూవు
పూవుకోక గూడు

గూడుకోక గాలి
గాలికొక వనమాలి

మాలికొక పదం
పదంకొక పాదం

పాదంకొక వర్షం
వర్షంకొక నృత్యం

కదిలెను వనమంతా ఇక
విరిజల్లయ్యేను
లోకమంతా ఇక:

దరి చేరేను నిన్ను తను
దారి చూపెను
తన చల్లని తనువు:

నిదురించెను ఇద్దరు ఇక

ఒక శీతాకాలపు రాత్రిలో

నక్షత్రాల బయళ్ళలో

వెచ్చటి వెన్నెల
నెగడు కాంతిలో=

చూసావా నువ్విక
అటువంటి రాత్రినీ
అటువంటి పగటినీ

నీలో తిరుగాడుతున్న
అటువంటి ఇద్దరినీ
మరెపుడైనా
మరేకడైనా?

చూసారా

ఎక్కడున్నావు ఇంతకాలం? అడిగింది
తను తన తనువుతో:

తిరుగాడాను ఇంతకాలం
ఆత్మల చిక్కుముడులలో
స్వీయాత్మ స్వధ్వంసంలో

తిరుగాడుతున్నాను బహుశా
ఇప్పుడు కూడా కరుణ లేని కాలంలో
కాలం లేని ద్రోహంలో
ద్రోహమైన వాక్యంలో:

కూడలి లేని అను/బంధాల
బాహువుల రహదారులలో:

మీలో ఎవరైనా ఎక్కడైనా చూసారా

చేతిలో పూలగుత్తులతో
కళ్ళల్లో పూలగుర్తులతో

నుదిటిన ముళ్ళ కిరీటం ధరించి
దాహార్తియై రహదారిని వొదిలిన

ఇతరుడి కోసం వేచి చూసే
మాగ్ధలీనానూ
తన తనువు కన్నీళ్ళనూ?

03 November 2011

అస్పృస్యత

ఒక చిన్ని సంతోషం. అంతలోనే ఊపిరాడనంత దుక్ఖం

గోడల మీద రాసిన నినాదాలు ఎప్పుడో గీసిన చిత్రాలు
వెలిసిపోయిన వదనాలు ఎవరివి?
దారుల వెంట నీడల వెంట వెళ్ళే సంచారిని
నడిమార్గంలో కనులు మూసి కత్తి దింపినది ఎవరు?
పూలు అల్లుకునే కళ్ళలో సప్తరంగుల కన్నీళ్ళయీ
దూరాన ఉండే ఇళ్లయీ రాలేదీ రాలేనిదీ ఎవరు?

ఒక చిన్న ఆనందం. అంతలోనే గొంతు నులిమివేసే విషాదం

వెళ్తున్నాను. వస్తున్నాను

సూర్యుడి వెంటా చంద్రుడి వెంటా ఇరు కాలాలకీ మధ్య దాగిన
మృత్యు మోహం వెంటా స్త్రీ వెంటా
చిటికెన వేలు పుచ్చుకునే అరచేయి ఏదీ లేక దిశ చూపించే
చూపుడు వేలు ఏదీ లేక

వస్తున్నాను. వెళ్తున్నాను.

నువ్వూ వెళ్ళావా ఇలాగే?
నువ్వూ వచ్చావా ఇలాగే
రాకుండా మిగిలిపోకుండా?

దుర్ఘందపు నదుల పక్కన లోహపు ధ్వనుల మధ్యన
తిరిగివెళ్ళే తిరిగిరాని మనుషులను చూస్తూ
వెదురు బుట్టలను అల్లుకుంటూ ఇలాగే గడిపావా
నీ కాలమంతా నీలోని అత్తరు పరిమళంతో?

ఇలాగే స్వప్నించావా నీ భాషనంతా

అల్లికలలో అల్లుతూ దివారాత్రులను నింగినీ నేలనూ
మట్టిని తాకిన వానను శరీరంలోకీ
సగం పదాలలోకీ జోడిస్తూ ఇలాగే రచించావా
నీ రాతనంతా రాతి రాత్రులతో రాళ్ళతో?

నువ్వు చెక్కిన శిల్పాలను లిఖించఋ
ఎవరూ మళ్ళా మళ్ళా.
విదేహ చిత్రాలలో నువ్వు కన్నీళ్ళతో
ముంచిన లోకాలను కొనగోటితో మీటరు
ఎవరు మళ్ళా మళ్ళా.

గొంతు తెగుతోంది ఎవరిదో అర్థరాత్రిలో
ఎలుగెత్తి పాడుతోన్న శోకంతో
కడుపు చీలుతుంది ఎవరిదో ఆకలితో
అరుస్తోన్న మానం చిరిగిన రతిలో

బిడ్డా సౌఖ్యం ఏదీ లేదు ఈ నిర్ధయ క్షణంలో
అన్నా శాంతి ఏదీ లేదు ఈ జుగుప్స లోకంలో
తల్లీ ఎలుగెత్తి ప్రార్ధించినా వచ్చే దివ్యవాయువు
ఏదీ లేదు ఈ యంత్రఖచిత కర్మాగారంలో

ఉద్యానవనాలు లేవు నాలికలలో
లేతచివుళ్ళు లేవు ఎదురు/చూపులలో
నలుపు వలయం సూర్యబింబమై
వ్యాపించిన గ్రహంలో ఇతరులు లేరు
మనలో మనమూ లేము ఇతరులలో:

ఎవరి లోకం వాళ్ళదిగా ఎవరి శోకం వాళ్ళదిగా

ప్రియు/రాళ్ళకి ప్రియులు లేరిక్కడ
భార్యలకి భర్తలు లేరిక్కడ. తల్లులకి
తనయులు తనయులకి తండ్రులూ
తండ్రులకి తనువులూ లేవిక్కడ:

చుట్టుకుంటోంది చుట్టూ అల్లుకుంటోంది
అస్పృస్యత ఒక మహా అజగరమై
ఇద్దరి మధ్యా అవినాభావ సంబంధమై:

ఒక చిన్న హర్షం. అంతలోనే అనుకోనంత
తిరిగి కోలుకోనంత విలాపం= లే లేచిపో
లేచి వెళ్ళు ఈ ప్రతిబింబంలేని తెరనుండి:

శైశవంలో నువ్వు మరిచిన మౌనగానం
బాల్యంలో నువ్వు పారవేసుకున్న
పలకా బలపం ఎక్కడో ఉండే ఉండాలి.

02 November 2011

వెళ్ళనా ఇక

నా ప్రియ శత్రువా, స్నేహితుడా

మోయలేను నిన్నూ కన్నీళ్లను
కన్నీళ్ళలో నిండిన తననూ తన
తనువునూ: చీకటయ్యింది

పక్షులు గూటికి చేరే వేళయ్యింది

పిల్లలని అక్కున చేర్చుకుని
వాళ్ళ చల్లటి అరచేతుల్లో
ముఖాన్ని దాచుకునే సమయమయ్యింది
హృదయంలో వాలిన నీడలు
పొడుగ్గా ఏటవాలుగా సాగే వేళయ్యింది

ఎవరో ఎక్కడో ఎందుకో
ఎదురుచూస్తూనే ఉంటారు నీ కొరకు
ఎవరో ఎక్కడో ఎందుకో
ఓపిక పట్టే నిలబడి ఉంటారు నా కొరకు

నా ప్రియ మిత్రుడా, సదా వెన్నంటే ఉండే
నా ప్రియ శత్రువా

మోయలేను నన్నూ నా కన్నీళ్లను
మోయలేను తననూ
తనువంతా నిండిన తన తనువునూ:

రాత్రంతా మనతో పదం
విసిగి వేసారిపోయింది:

వెళ్ళనా వెళ్ళవా ఇక ఇంటికి
ఒళ్లంతా నిండిన పదక్షతాలతో
చూపుల దంతాలు మిగిల్చిన
నిన్నటి పెదాల రక్తపు గాట్లతో?