13 November 2011

ఇక ఎన్నడూ

కన్నా దూరం నుంచి దూరం జరుగుదామని
తెచ్చావు ఒక వెన్నెల పూవును నువ్వు నాకోసం

ఓదార్పు లేని దారులలో
కంట కన్నీరు నింపుకుని
దగ్గరితనం కాని కాలేని
దరి చేరలేని దూరమై

కన్నా నీ నాన్న: కన్నా నిను కన్న

నిను దీవించిన అరచేతులు లేవిక్కడ
నేను జీవించిన గురుతులు లేవిక్కడ

హాయిగా నవ్వులని హత్తుకున్న
నిర్మల బాహువులు లేవిక్కడ
చుబుకం ఎత్తి నుదుటిని నిమిరి

కంట నీరు తుడిచిన ముని వేళ్ళు లేవిక్కడ

అమావాస్య రాత్రి అమావాస్య ధాత్రి
నల్లని అలలు మేఘాలై నింగిని తాకి
నిను వీడి నిను కాంచి నిన్ను
బెంగగా బెదురుగా తీసుకువెళ్ళే వేళ

ఎదురుచూసావా నువ్వు కన్నా నువ్వు
నా కోసం? దూరం నుంచి దూరం
జరుగుదామని దూరంగా వెళ్ళిపోదామని
ఒక రాత్రిరోజాతో రోజంతా వేచి చూసావా
కన్నా నువ్వు నా కోసం? నాన్న కోసం?

రాత్రి రాయితో ఆగిపోయింది. రాయి
హృదయమై నిను విస్మరించింది
హృదయం తిరిగి ఒక కలలకొలనై
ఒక కలువను నీకై రాత్రిని రాత్రిగా
ఒక బహుమతిగా తెచ్చిఇచ్చింది.

ఎదురుచూసీ చూసీ నిదురలోకి జారిన
నీ కనులవనాలలోకి నేను నీకొక
పచ్చని గొంగళిపురుగును పంపాను:

ప్రతిగా నువ్వు ఇలలోంచి కలలోంచి
నింగిలోంచి నేలలోంచి
నాన్నలు నివ్వెరపోయే
ఒక సప్తరంగుల సీతాకోకచిలుకను పంపించు

నీకు తెలిసిన ఇంద్రజాలంతో
పసివదనపు మంత్రజాలంతో
బిరబిరా పరుగిడే పదాలతో:

ఇక నీకై నేను కొంతకాలం బ్రతికే ఉంటాను
ఇక నీకై నేను కొంతకాలం
నీ కలలకావలగా దాగునే ఉంటాను

దూరం నుంచి దూరం జరుగుదామని
నువ్వు తెచ్చిన వెన్నెల పూవుతో
నీ నిదుర సరస్సుని అంటిస్తో ప్రేమిస్తో:

(ఇక నేను ప్రేమ గురించి
ఎన్నడూ మాట్లాడను=)

No comments:

Post a Comment