ఒక మంచుదీపం వెలిగింది హృదయంలో పావురాళ్ళు
గజిబిజిగా మెసిలే ఇనుప రాత్రుళ్ళలో
నువ్వు అనుకోలేదు ఇది ఇలా ఉంటుందని. హృదయం
అంటుకుంటుందని శాపంలా మారుతుందని
తెరిచిన కిటికీలలోంచి వెన్నెలా వెలుతురూ మంచూ
ఏది ఏదో తెలియదు ఏది ఏదో కనపడదు ఏది ఏదో అందదు
ప్రేమించిన స్నేహితులలాగే ద్వేషించలేని స్త్రీలలాగే
నీ కోరికల్లా ఇంత వెన్నెల వేళను
నీ ఆశ అంతా ఇంత రాత్రి కళను
నక్షత్రాలతో నవ్వులతో ఇళ్ళకు
నలుగు పెట్టి వాళ్ళకు అందిద్దామనే
నీ కోరికల్లా గాలి నీడలు నడయాడే
సంధ్య కాంతి సరస్సులను
వాళ్లకు చూపిద్దామనే చూద్దామనే:
ఎపుడైనా చూసావా నువ్వు మంచుదీపం వెలిగిన
హృదయంలో రాత్రి ఎలా ఉంటుందో
రాత్రిలో హృదయం ఎలా ఉంటుందో
అనుకోలేదా నువ్వు ఇది ఇలా ఉంటుందని హృదయం
దహించుకుపోతుందని దగ్ధం అవుతుందనీ
అరచేతిలో చేయి వేసి ఏడు లోకాలు తిరిగి వచ్చింది ఇక్కడే
పెదాలపై పెదాలని ఆన్చి ఏడు కాలలని కలలని చూసింది ఇక్కడే
తన ముఖాన్ని గుండెలో హత్తుకుని ఎడారులని దాటిందీ ఇక్కడే
బెదిరిన తెల్ల పావురాళ్ళ రెక్కలని నిమిరి
వాటి కళ్ళల్లో పిల్లల చూపుల్ని చూసిందీ ఇక్కడే
కోరిక కాని కోరికలో రాత్రి. రాత్రి కాని రాత్రిలో ధాత్రి: ధాత్రిలో గాలిలో
విశ్వలోకపు సందడిలో శిశువుల నిదురలోకి
మల్లెపూలనూ ఆకుపచ్చ సీతాకోకచిలుకలనూ
పంపిద్దామనే నీ తపన అంతా: అంతం అంతాన
ఇక నువ్వు ప్రేమ అంటే ఏమిటని అడిగితే నేనేమి చెప్పేది?
No comments:
Post a Comment