ఎక్కడున్నావు ఇంతకాలం? అడిగింది
తను తన తనువుతో:
తిరుగాడాను ఇంతకాలం
ఆత్మల చిక్కుముడులలో
స్వీయాత్మ స్వధ్వంసంలో
తిరుగాడుతున్నాను బహుశా
ఇప్పుడు కూడా కరుణ లేని కాలంలో
కాలం లేని ద్రోహంలో
ద్రోహమైన వాక్యంలో:
కూడలి లేని అను/బంధాల
బాహువుల రహదారులలో:
మీలో ఎవరైనా ఎక్కడైనా చూసారా
చేతిలో పూలగుత్తులతో
కళ్ళల్లో పూలగుర్తులతో
నుదిటిన ముళ్ళ కిరీటం ధరించి
దాహార్తియై రహదారిని వొదిలిన
ఇతరుడి కోసం వేచి చూసే
మాగ్ధలీనానూ
తన తనువు కన్నీళ్ళనూ?
No comments:
Post a Comment