03 November 2011

అస్పృస్యత

ఒక చిన్ని సంతోషం. అంతలోనే ఊపిరాడనంత దుక్ఖం

గోడల మీద రాసిన నినాదాలు ఎప్పుడో గీసిన చిత్రాలు
వెలిసిపోయిన వదనాలు ఎవరివి?
దారుల వెంట నీడల వెంట వెళ్ళే సంచారిని
నడిమార్గంలో కనులు మూసి కత్తి దింపినది ఎవరు?
పూలు అల్లుకునే కళ్ళలో సప్తరంగుల కన్నీళ్ళయీ
దూరాన ఉండే ఇళ్లయీ రాలేదీ రాలేనిదీ ఎవరు?

ఒక చిన్న ఆనందం. అంతలోనే గొంతు నులిమివేసే విషాదం

వెళ్తున్నాను. వస్తున్నాను

సూర్యుడి వెంటా చంద్రుడి వెంటా ఇరు కాలాలకీ మధ్య దాగిన
మృత్యు మోహం వెంటా స్త్రీ వెంటా
చిటికెన వేలు పుచ్చుకునే అరచేయి ఏదీ లేక దిశ చూపించే
చూపుడు వేలు ఏదీ లేక

వస్తున్నాను. వెళ్తున్నాను.

నువ్వూ వెళ్ళావా ఇలాగే?
నువ్వూ వచ్చావా ఇలాగే
రాకుండా మిగిలిపోకుండా?

దుర్ఘందపు నదుల పక్కన లోహపు ధ్వనుల మధ్యన
తిరిగివెళ్ళే తిరిగిరాని మనుషులను చూస్తూ
వెదురు బుట్టలను అల్లుకుంటూ ఇలాగే గడిపావా
నీ కాలమంతా నీలోని అత్తరు పరిమళంతో?

ఇలాగే స్వప్నించావా నీ భాషనంతా

అల్లికలలో అల్లుతూ దివారాత్రులను నింగినీ నేలనూ
మట్టిని తాకిన వానను శరీరంలోకీ
సగం పదాలలోకీ జోడిస్తూ ఇలాగే రచించావా
నీ రాతనంతా రాతి రాత్రులతో రాళ్ళతో?

నువ్వు చెక్కిన శిల్పాలను లిఖించఋ
ఎవరూ మళ్ళా మళ్ళా.
విదేహ చిత్రాలలో నువ్వు కన్నీళ్ళతో
ముంచిన లోకాలను కొనగోటితో మీటరు
ఎవరు మళ్ళా మళ్ళా.

గొంతు తెగుతోంది ఎవరిదో అర్థరాత్రిలో
ఎలుగెత్తి పాడుతోన్న శోకంతో
కడుపు చీలుతుంది ఎవరిదో ఆకలితో
అరుస్తోన్న మానం చిరిగిన రతిలో

బిడ్డా సౌఖ్యం ఏదీ లేదు ఈ నిర్ధయ క్షణంలో
అన్నా శాంతి ఏదీ లేదు ఈ జుగుప్స లోకంలో
తల్లీ ఎలుగెత్తి ప్రార్ధించినా వచ్చే దివ్యవాయువు
ఏదీ లేదు ఈ యంత్రఖచిత కర్మాగారంలో

ఉద్యానవనాలు లేవు నాలికలలో
లేతచివుళ్ళు లేవు ఎదురు/చూపులలో
నలుపు వలయం సూర్యబింబమై
వ్యాపించిన గ్రహంలో ఇతరులు లేరు
మనలో మనమూ లేము ఇతరులలో:

ఎవరి లోకం వాళ్ళదిగా ఎవరి శోకం వాళ్ళదిగా

ప్రియు/రాళ్ళకి ప్రియులు లేరిక్కడ
భార్యలకి భర్తలు లేరిక్కడ. తల్లులకి
తనయులు తనయులకి తండ్రులూ
తండ్రులకి తనువులూ లేవిక్కడ:

చుట్టుకుంటోంది చుట్టూ అల్లుకుంటోంది
అస్పృస్యత ఒక మహా అజగరమై
ఇద్దరి మధ్యా అవినాభావ సంబంధమై:

ఒక చిన్న హర్షం. అంతలోనే అనుకోనంత
తిరిగి కోలుకోనంత విలాపం= లే లేచిపో
లేచి వెళ్ళు ఈ ప్రతిబింబంలేని తెరనుండి:

శైశవంలో నువ్వు మరిచిన మౌనగానం
బాల్యంలో నువ్వు పారవేసుకున్న
పలకా బలపం ఎక్కడో ఉండే ఉండాలి.

No comments:

Post a Comment