ఇక్కడ ఏమీ లేదు: వస్తావు లిల్లీ పూవులతో
నీరెండని గాలిలో పుచ్చుకుని అద్దంలోంచి
అర్థంలోంచి తొంగి చూసి పలుకరిద్దామని:
ఆ పిచ్చుకలు ఎప్పుడూ మాట్లాడవు. పగిలిన
మట్టిపాత్రలో నీళ్ళతో నీళ్ళలో ఆడే పిచ్చుకలు
నీవైపు చూసి రెక్కలని విదిల్చి
తుర్రున ఎగిరిపోయే పిచ్చుకలు
ఏమని పిలిచావ్ వాటిని? ఎందుకు రమ్మని
పిలిచావ్ వాటిని ఇంటి ముంగిటిలోకి?
పిలుపు ఏదో సాగుతుంది నీది గదిలో మెరుపై
అలజడి ఏదో రేగుతోంది నీది మదిలో కలవరమై
సవ్వడి ఏదో మెసులుతోంది నీది
పిల్లి పాదాల మెత్తటి పద సన్నిధై
కదలిపోతోంది మధ్యాన్నం ఆకాశమై
నేలపై కదిలిపోయే మబ్బుల నీడలై:
పరిసరాల్లో పరిమళపు పసిడి కాంతి
శరీరాల్లో రాలే చినుకుల తడి. తడబడి
అల్లుకుంటుంది ఇంధ్రధనుస్సు కళ్ళల్లో
విచ్చుకుంటుంది జ్వాల వేళ్ళ చివర్లలో
ఇక్కడేమీ లేదు: ఊరికే వస్తాను నేను
కొలనులో చీకటిలో రాలే చుక్కలతో=
ఇటొక మెరుపు, అటొక మెరుపు
కొంత శాంతి కొంత బ్రాంతి
కొంత ఇష్టం కొంత అయిష్టం
కొంత దయ కొంత విలాపం
కొంత వరం కొంత శాపం
కోలుకోలేనంత పయనం:
ఎలా వచ్చావో తెలియదు, ఎలా వెళ్లి
పోయావో తెలియదు. అరచేతుల్లో
గాయమయ్యి ఊరే వదనమెవరిదో
చూపుల్లో పరావర్తనం చెందే రూపం
ఎవరిదో అనువాదం కాదు
నింగికి ఎగిరిన పిచ్చుకలు వస్తాయి నీ వద్దకు
సంధ్యవేళకి ఛాతిలో చోటు చేసుకునేందుకు
చేరతాయి అర్థరాత్రిలో వికసించిన లిల్లీ పూలు
నీ వద్దకు నీ పెదాలపై నిదురించేందుకు
చేరుతుంది నిన్ను హిమవనపు శ్వేత గాలి
నీ బాహువులలో ఊయలలూగేందుకు:
నిన్ను పిలవాలేదు, నిన్ను రమ్మనీ అనలేదు
ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన మనిషిలో
పూలదర్పణ సమాధిని నిర్మించి
రమ్మనకుండా వచ్చి పొమ్మనకుండా పోయి
రాకుండా రమ్మనకుండా హృదయంలో దూరమై
రణరంగమై మిగిలిపోయింది ఎవరు?
No comments:
Post a Comment