సంధ్యకాంతిలో గుత్తులుగా
దౌడు తీస్తున్నారు పిల్లలు
మైదానాలు లేని పిల్లలు
మరువక మరుపు లేని వీధులలో
ఇకిలింతలై సకిలింతలై మనం
ఎప్పటికీ కాలేని సంగతులై
పొర్లిపోతున్నారు ఒకరి వెనుక
పొర్లిపోతున్నారు ఒకరి వెనుక
ఒకరై మరొకరై అందరై
ఆ ఆనందాన్ని ఏమని పిలవాలో
ఆ సంతోషాన్ని ఏమని రాయాలో
తెలియక, తెరమరుగు కాక
అక్కడే ఉన్నాడు అతడు
కుప్పిగంతులేసే పిల్లల ముందు
మూగవాడై ముసలివాడై:
పూలుపూలుగా సాగిన ఆకాశం
గుత్తులు గుత్తులుగా
చీకటి చెట్టుకు వేలాడపడింది
మగ్గిన చుక్కలు రాత్రి ఆకులు
తెరలుగా వెళ్ళిపోయే గాలితో
గుసగుసల సవ్వడి చేయగా
పాపం పసివాడు, ముసలివాడు
కాలేక కానరాక పసితనం
పాపం ముసలివాడు, పసివాడు
కాలేక కానరాక తన తనం
ఒక్కడే నిదురించాడు హృదయ
రాహిత్య విస్మృతితోటలో:
కదలించకండి అతడినీ
అతడి పదాలనీ ఇప్పుడే
బావుందండి.
ReplyDeleteకవిత బాగుంది.
ReplyDelete