28 December 2011

నీకు.3

ఇల్లాంటి రోజులలోనే గుర్తుకొస్తావు నువ్వు
కానీ ఎలాంటి రోజో చెప్పను నేను ఎన్నడూ!

కాని ఇట్లాంటి పగటినాడే, కాంతి చుక్కలు
నీడలతో పొర్లబడి నవ్వే నువ్వే గుర్తొచ్చే
ఇట్లాంటి పగటినాడే పగబడతావు నువ్వు

చూసావా అరవిచ్చిన ఈ అరచేతిని నువ్వు
నీకు వీడ్కోలు చెప్పి కాలంలో తెగి పడి
రక్తం చిందించిన అయిదు వెళ్ళనీ నువ్వు?

ఆ తరువాత ఇక ఎన్నడూ ఈ అరచేయి
మరో అరచేయిని ముద్దాడలేదు
ఆ తరువాత ఇక ఎవ్వరినీ ఈ అరచేయి
మరో అరచేయికి వీడ్కోలు పలుకలేదు

ఆ అప్పటి తరువాత ఇక ఈ అరచేతులెన్నడూ
మరో ముఖాన్ని పొదివిపుచ్చుకోలేదు
ఆ అప్పటి తరువాత సగంగా తెగిన ఈ నా
అస్పృస్య చేతులెన్నడూ మరో శరీరాన్ని
కౌగలించుకోలేదు, తిరిగి ఇక పలుకలేదు

అందుకే, ఇట్లాంటి ముకుళిత ముఖాల
దిగులు రోజులలోనే గుర్తొస్తావు నువ్వు
శరణు అని ప్రార్ధించిన ఆ నా ముకుళిత
అరచేతులను తెరవగానే

పడగవిప్పిన శ్వేత స్మృతి త్రాచై దిగ్గున లేచి
నా కనులను కాటు వేసినది నీవేనా?

1 comment: