06 December 2011

చిన్న ప్రశ్న

నిర్ధయగానే వెళ్ళిపోయావు వొదిలి

రాత్రి అనంతమని, పగలు కాటువేసే శ్వేతసర్పమనీ
అప్పటిదాకా తెలీలేదు అతడికి
నువ్వు చెప్పనూ లేదు అతడికి

మధుశాలల్లో కరిగిపోయాడు అతడు
నిన్ను తలంచి తనను తాను మైమరచి:

నీడలతో ఆడే చెట్లు, చెట్లతో ఆడే పిట్టలు
పిట్లల్తో ఆడే మబ్బులు
మబ్బులతో చినుకులు

ఇవేమీ తెలియదు ఇప్పుడు అతడికి
ఒకప్పుడు నీ తనువులో చూసిన
చిత్రాలన్నీ చెందవు ఇప్పుడు అతడికి

అరచేతుల్లో ముఖాన్ని దాచుకుని
నలుగురికీ ముఖాన్ని చూపించలేక
నలుగురు కాలేక ఒక్కడే అతడు:

దయగానే, నిర్ధయగానే
నీ నీడనైనా వదలక
వెళ్ళిపోయావు ఎక్కడికి?

No comments:

Post a Comment