02 December 2011

ఏంటంటే (ఏంటో)

సాయంత్రం చుట్టుకుంటోంది నిన్ను

నువ్వు మరచిపోలేని చేతివేళ్ళలా
తన చేతివేళ్ళలా తన తనువులా=

వెళ్ళాలా ఇంటికి దిగులు అల్లుకున్న కళ్ళతో
తిరిగిరాని పక్షుల గురించి యోచిస్తో
నిన్ను నువ్వు వలయాలుగా చీల్చే
నువ్వు ఎన్నటికీ కాలేని క్షణాలతో?

క్షమాపణలు చెప్పుకోవాలి తలవాల్చిన ఒక పూవుకి
కృతజ్ఞతలు చెప్పుకోవాలి తాకి వెళ్ళిన ఒక తెమ్మరకి
వీడ్కోలు పలకాలి తనలో పొదుపుకున్న శరీరానికి

తల ఎత్తి నిన్ను చూసే తెల్లటి కళ్ళలో
కన్నీరు తుడవాలి నలుపు చేతులతో
నడుము చుట్టూ చుట్టుకున్న చేతులని
భద్రతగా నిమరాలి రేపటి నమ్మకంతో
పసి పాదాలు తిరిగిన నేలపై కూర్చుని
పసి పెదాలకి మెతుకులని అందించాలి

ఉండాలి కొంత కాలం నువ్వు నీకూ తనకీ
మృత్యువును చేరుతున్న తల్లికీ తండ్రికీ
ప్రార్ధించే జోడించే అర్ధించే అరచేతులై:

సాయంత్రం నిన్ను వెనుకనుంచి కనులు
మూసిన అరచేతుల్లా తాకుతున్నప్పుడు

ఉండాలి నీకు నువ్వు
ఉండాలి వాళ్లకి నువ్వు

ఉన్నావా నీకు నువ్వు?

No comments:

Post a Comment