23 December 2011

అమ్మలే

రాత్రినే తీసుకువచ్చాను చీకటిగా మారి ఎదురుచూసే ఇంటిలోకి

ఏమయ్యిందని అడగలేదు కానీ కళ్ళల్లో నీళ్ళతో వెక్కిళ్ళతో తనే
చుట్టుకుంది నన్ను. ఏమయ్యిందో, ఎందుకో నేనూ చెప్పలేదు

పిల్లలే అడిగారు నిద్ర కళ్ళతో శరీరం నిండా ఇంత మసి ఎందుకు ఉందని
ఇంత చీకటినీ, ఇంత ధూళినీ ఎలా అంటించుకు వచ్చానని
అంటూనే శుభ్రం చేసారు వాళ్ళే నన్నుకొంత వెన్నెల వేళ్ళతో
కొన్ని చల్లటి చూపులతో, మాటలతో

లోపలంతా చెట్లు ఊగుతూ విరిపడుతున్న సవ్వడి
లోపలంతా వాన దిగుతూ ఉరుమే మబ్బుల మెరుపుల అలజడి

రోదిస్తున్నారెవరో దూరంగా, ఆ హోరు తాకుతుంది ఇక్కడికీ ఇప్పటికీ
ఏమయ్యిందని అడిగి ఉండరు ఎవరూ అతనిని కూడా=
తాగమని ఎవరూ ఇచ్చి ఉండరు తనకి నీళ్ళు కూడా

ఇక రాత్రంతా ఆ వృద్ధాప్యపు తల్లే అతనికి పైగా దిగులు రెక్కలతో
అల్లాడుతూ, తనలో తాను గొణుక్కుంటూ ఏవో స్మరించుకుంటూ:

ఎన్ని గాయాలు చేసినా అమ్మలే ఎప్పుడూ అపరిచితులు కారు
అమ్మలనే ఎప్పుడూ ఎవరూ ఎలా ఉన్నావని అడగరు: ఎందుకో

మీలో ఎవరికైనా తెలుసా?

4 comments:

  1. ఎన్ని గాయాలు చేసినా అమ్మలే ఎప్పుడూ అపరిచితులు కారు
    అమ్మలనే ఎప్పుడూ ఎవరూ ఎలా ఉన్నావని అడగరు: ఎందుకో
    chaalaa chaalaa bagundi
    at the same time pinched a pain also

    ReplyDelete