22 December 2011

కల

రాత్రి ఒక కల మంచై
రహస్యంగా నా చేతుల మధ్యకు నా అనుమతి లేకుండా వచ్చింది

నేను దానికి నువ్వు అని పేరు పెట్టాను. ఆపై కౌగాలించుకున్నాను

ఉప్పు కళ్ళతో, వొణికే చేతులతో నా మెడను చుట్టుకుని
కల ఏడ్చింది. ఏమోమో చెప్పింది

తెలుసు నాకు మాటలు మనం సృష్టించుకున్నవేనని
మన పిల్లలవంటివని అంతకుమించి మరేమీ కావని=

కాని పిల్లలు ముఖ్యంగా నీతో ఆడుకొని వెళ్ళిపోయే పిల్లలు
ఎంతమంది అర్థం అవుతారు నీకు? ఎంతమంది ఉంటారు
ఎంతమంది మిగిలి ఉంటారు చివరికి నీకు?

సమయం గడిచింది అలా, వలయాలుగా తిరుగుతూ
పొగమంచై నింగికి సాగుతూ, జలపాతమై నేలకి రాలుతూ
సమయం గడించింది అలా వలయాలుగా:

ఆ తరువాత ఇరువురికి ఇరువురూ ఎన్నడూ కలవలేదు
ఇక ఎన్నడూ మాట్లాడుకోలేదు

రాత్రి వచ్చి రహస్యంగా నన్ను కమ్మిన నల్లని కల
నన్ను కని, నన్ను వినక ఎక్కడికి వెళ్లిపోయింది?

1 comment:

  1. రహస్యంగా చదవడంతప్ప ఏమి చెప్పగలం

    JohnHyde

    ReplyDelete