08 December 2011

నోట్

ఏమీ చేయొద్దనుకున్నాను ఈ రోజు

ఉదయం పుష్పించిన రాత్రి పూవుపై
నిన్న రాలిన స్నేహితుని అశ్రువులని చూసాను

పిల్లల వదనాలలో ఎగిరే సీతాకోకచిలుకలని
కళ్ళల్లో ఉదయపు సూర్యరశ్మినీ చూసాను

అద్దంలో ముఖాన్ని చూసుకున్నాను: ప్రతి
బింబంలో బింబమై తల్లితండ్రులు కనపడగా
గూళ్ళల్లో చిక్కి చిక్కనౌతున్న మృత్యువునీ
మూగ ముసలితనాన్నీ వొణుకుతో విన్నాను

ఓరిమి నిండిన చేతులతో కాలాన్ని నింపే
తన తనువునీ తన తపననీ ఒరిమిగా కన్నాను
కొంత చూసాను కొంత వొదిలివేసాను
కొంత సాగాను కొంత ఆగిపోయాను: ఇక
ఏమీ చేయొద్దనుకుని ఈ/ఆ రోజు
నీడలు తాకిన నేలని వేళ్ళతో మీటాను

కొన్ని చినుకులు రాలాయి మట్టిలోంచి నింగివైపు
కొన్ని పూలు పుష్పించాయి నింగిలోంచి నేలవైపు
అపరిచితులు ఎవరో నవ్వగా
అపరిచితులు ఎవరో వినగా,

ఇదిగో ఇలా చేయొద్దనుకున్న రోజు
ఇదిగో ఇలా చేస్తూనే మొదలుపెట్టాను

(<< ఆ తరువాత, ఆ వెనుకాల
ఇద్దరు ఇద్దరితో ముగ్గురయ్యారు
కానీ అది వేరే సంగతి.>>)

1 comment: