16 December 2011

క్షమ

కోరుకోకు ఎప్పుడూ ఎవరినీ ముఖ్యంగా తనని

నింగి నుంచి జారే నీలిసాయంత్రాలలో
పూవుల్లా చీకటి విచ్చుకునే రోజుల్లో
అక్కడే రాలిపోయావు నువ్వు తనకై
అక్కడే నిలబడిపోయావు తనువుకై

హృదయంలో ఒక బరువు
కనులలో ఒక నిట్టూర్పు: ఇంతకువినా
ఏం మిగిలింది నీకు ఏం మిగిల్చింది
తను నీకు తన తనువు నీకు?

సాగుతున్నాయి నీడలు హస్తాలై నీ వద్దకు
నీ గొంతు నులిమేందుకు, లోపల లోలోపల
గుక్కపట్టి రోదిస్తున్న ఎవరినో కమ్మేందుకు

అంతా ధ్వని. నల్లగా రక్తంలో ప్రతిధ్వనిస్తున్న
నిన్ను కోల్పోయిన ధ్వని. శ్మశానం పక్కగా
నిస్పృహగా తల బాదుకుంటూ
నిశ్శబ్ధంగా ఎవరినో శపిస్తున్న
నిశ్శబ్ధంగా ఎవరినో క్షమిస్తున్న
ఎవరినో కోల్పోయిన ఎవరిదో నిర్ధయ ధ్వని.

ఇక అద్దంలో వదనాన్ని చూసుకోలేను
ఇక అర్థాలలో పదాలని కనుక్కోలేను

బహుశా అక్కడే నిన్ను కోరుకున్న కాలంలోనే
బహుశా అప్పుడే నేను చనిపోయి ఉండవచ్చు:

No comments:

Post a Comment