31 October 2012

డెజావు

నా గొంతు మీద
నీ  వెన్నెల కత్తి
మరి నీ నోట నా మాట రాదే

మంచు మ్రోగే మౌనం నీది
తడిచి వీగిపోయే
చిరు గానం నాది

నేరాలు గురించి ఎందుకు
చెరో కారాగారమే యిక్కడ

గదిలో నీడలు. నీడలలో
పొసగిన నెత్తురు పూలు

పూలల్లో, ఎగిరిపోయే
పక్షుల రెక్కల శబ్ధం
శరీరమంతా కలకలం.

చూడు, వెలుగుతోంది
నువ్వు వెలిగించిన
ఒక  ప్రమిదె
నా తల వద్ద.  

30 October 2012

దిగులు చెందకు

చల్లని చీకట్లో, ఈ అశోకా వృక్షాలపై మెరుస్తాయి కాంతి చుక్కలు
     నారింజ రంగు వెలుతురులో: పైనేమో ఒక వెన్నెల తుఫాను
     పచ్చికలో కూర్చున్న యువ జంటలో
     నువ్వేమైనా ఉన్నావేమో, తిరుగుతూ
     తిరుగుతూ నీవైపు వచ్చి నిన్ను తాకే
     ఆ పసి నవ్వూ ఆ పసి స్పర్శా

ఇక అవే నువ్వు ఈ పూటకి చేసుకున్న అదృష్టం. తాకిన వాళ్ళని
     వొదలలేక అలా నిలబడిపొతావు నిశ్చలమైన ఉద్యానవనంలో
     చల్లటి చీకటిలో, ఆ అశోకా వృక్షాలతో వొంటరిగా మిగిలిపోయిన
     యువకుడితో, అతని చేతుల మధ్య ఆరిపోయిన తన స్పర్సతో:

దిగులు చెందకు. చివారఖరికి మిగిలే ఉంది నీతో
నీ తడపడే  అడుగులకు తోడుగా
మంచుకి తడిచిన ఒక చిన్న కప్ప.

స్థ. బ్ధ. త.

.స్థబ్దమయ్యింది. లోపల. నలుపు. అంతటా. చూడు.   

చిమ్మచీకటి వీచే వేళయ్యింది
పూలు రాలే కాలమయ్యింది
అరుగు మీది ప్రమిదె కాంతిలో నీ చూపులు 
ధగ్దమయ్యే క్షణమయ్యింది.
మరి 

అరచేతులు అల్లాడే వేళయ్యింది
కళ్ళు రాళ్లయ్యే  కాలమయ్యింది
రాళ్లు  వానయ్యే క్షణమయ్యింది
మరి 

శరీరం మంచుపొగయ్యే కాలం ఆసన్నమయ్యింది. 
దీపపు మంట వొణికి వొణికి, తనని తాను 
వొదిలి వెళ్ళే వేళయ్యింది. సరిగా అప్పుడే 
ఇక ఏమీ చేయలేక  

తటాలున కదిలి, ఒక పాత్ర నిండా 
మట్టికూజాలోంచి నీళ్ళు వంచుకుని 
నింపాదిగా తాగుతూ కూర్చుంటావు 

నువ్వు.             

29 October 2012

నువ్వు లేక

నీ పాదాలు నడయాడిన చోట తిరుగుతాను
     నీ శరీరపు సువాసన ఏదైనా దొరుకుతుందేమోనని
నువ్వు సర్దిన గదులన్నీ వెదుకుతాను
     నీ చేతులు తాకిన వస్తువులను  మెత్తగా ముట్టుకుంటాను 
     నీ స్పర్శ ఏమైనా నా వేళ్ళ అంచులకు తాకుతుందేమోనని
నువ్వు నీళ్ళు చిలుకరించిన కుండీల వద్ద కూర్చుంటాను
వికసించిన పూలలో నీ మోము
ఏమైనా కనపడుతుందేమోనని    
నువ్వు వండి పెట్టిన అన్నం పాత్ర వద్ద తచ్చాట్లాడతాను
     మెతుకులు అంటిన నా పెదాలకు నీ పెదాలు
     ఏమైనా అంటుకుంటాయేమోనని.
నువ్వు వేసిన పక్క వద్దా, దిండు వద్దా కూర్చుంటాను
     నీ శిరోజాలు ఏమైనా గాలిలా వీస్తాయేమోనని
కిటికీ తలుపులు కొంత తెరిచే ఉంచుతాను. నువ్వు
     చూసే నక్షత్రాలు చినుకులై ఇక్కడ రాలతాయేమోనని
గడ్డి పరకలు వీచే రాత్రి గూటిలోకి చూస్తాను
     నీ కళ్ళ వంటి పావురాళ్ళు తిరిగి వచ్చాయో లేదో అని
కొంత నవ్వుకుంటాను, కొంత నొచ్చుకుంటాను
     పూల వంటి రాళ్ళ వంటి నీ మాటలు గుర్తుకువచ్చి
కొంత దిగులు పడతాను కొంత కంగారుపడతాను
     నువ్వు లేక రేపు ఎలా బ్రతకాలో తెలియక బెంగే పడతాను
అస్థిమితం అవుతాను అస్థవ్యస్థం అవుతాను. చూడు

నువ్వు లేక ఒక ప్రాణి ఎలా గిల గిలా కొట్టుకుంటుందో.                                 

చీకటి

ఒక అరచేత్తో నుదురు పట్టుకుని తల వంచుకుని 
మరో అరచేతిలో నెమ్మదిగా పేరుకుంటున్న 
చీకటిని చూసే నీ కళ్ళే గుర్తుకు వస్తున్నాయి 

ఆకస్మికంగా ఈ దినానంతాన:

తల ఎత్తలేవు, పాదం మోపలేవు. నిన్ను తాకలేక 
ఈ గాలి నిశ్శబ్దాన్ని నింపుకున్న చెట్లలోనే 
ఆగిపోతుంది.  ఎక్కడో ఏదో విరిగిపోతుంది. 
అలజడిగా ఒక పిట్ట  ఎగిరేపోతుంది. సరేలే 

తలను ఆసరాగా ఆన్చుకునే భుజమే ఉండుంటే 
ఎందుకు ఇదంతా? మోమును పొందికగా 
పొదివి పుచ్చుకునే నీ రెండు అరచేతులే 
ఉండుంటే ఎందుకు ఈ శోకమంతా? చూడు

అరచేతిలో చిట్లిన నుదురు ఎలా నిన్ను 
తలచుకుని చీకటితో కంపించిపోతుందో!   

28 October 2012

ఏకాకి

ఏదో పోగొట్టుకునే వచ్చాను, ఈ జీవితంలోకి:

వెదికీ వెదికీ, చివరికిలా
నీ ముంగిట్లో ఈ చీకట్లో
కాళ్ళు తడుపుకుంటూ కూర్చున్నాను

నీడల వలయాలలో, ఖాళీ అరచేతులతో
ఖాళీ హృదయంతో కనిపించని కనులతో

ఒక కబోధి శ్వేత పుష్ప స్వప్నాన్ని
మంచు వెన్నెల్లో, పొగమంచులో కలగంటూ:

పురాజన్మల స్మృతి ముద్రికను
నుదిటిపై శిక్షా స్మృతిలా ముద్రించుకుని
హృదయాన్ని ఒక బిక్షపాత్రగా మార్చుకుని
లోకమంతా ఏకాకిగా తిరిగేవాడిని

ఏమని పిలుస్తావు నువ్వు?  

21 October 2012

నత్తలు


వంకీలు తిరిగిన ఆకుల కింద నత్తలు
     నీడలు గాలులతో వీచే వేళ్ళల్లో- ఎలా అంటే

ఎవరో అతి నింపాదిగా మట్టికుండలోంచి
     మంచి నీళ్ళు ముంచి, నెమ్మదిగా
     నీ అరచేతుల్లోకి కరుణతో వొంపితే
 
     సూర్యకాంతి తాకిన ఆ నీళ్ళను
     నీ పెదాలు తాకి,  ఆత్మ చలించి

తొలిసారిగా నీకు ఎవరో ఒక శబ్ధంలోంచి
     నిశబ్దాన్ని బహుకరించినట్టూ
     మూగవాడికి ఒక పిల్లన గ్రోవి
     దొరికినట్టూ, ఒక మౌన సంగీతం వీస్తుంది

ఆకులు రాలిన నీ దగ్ధ శరీరంలోంచీ
     ఆ లేత నత్త పాదాల కింది భూమిలోంచీ
     నిన్ను హత్తుకునే  రెండు చేతులలోంచీ:

కదలకు ఇక: ఎందుకంటే
     మట్టి కుండలోంచి తను, చెమ్మగిల్లిన గాలినీ
     వెన్నెలనీ నక్షత్రాలనీ రాత్రినీ ధూళినీ పూలనీ
 
     ఒక పురాతన ఆకాశాన్నీ ఒక ఆదిమ విశ్వాన్నీ
     నీకు తను తన శరీరంతో నిండుగా ముంచి ఇచ్చే

అనంతమైన చిన్ని ప్రేమ కాలం
ఆసన్నం అయ్యింది. మరవకు.

20 October 2012

ఎలా?

1
నిన్ను ఒకసారి చూడాలని ఉంది
     వొదులుకున్న వాళ్ళని, తిరిగి
     ఒకసారి చూడటం ఎలా?
2
స్వప్నానంతాన దిగ్గున లేచి
     గుండె ఉగ్గ పట్టుకుని, వొళ్ళంతా
     వణికితే, కళ్ళలోకి కటిక చీకటి-
3
దాహం వేసిన పెదాలకి ఇంత తడీ
     రాత్రిలో వెదుక్కునే చేతులకి
     ఒక నీటి పాత్రా దొరకదు. ఎందుకంటే
4
కత్తి అంచుతో చీరిన నాలికపై నీ రుచి.
     రెండు వేళ్ళ మధ్య శ్వాసను చిదిమి
     ఆరిన దీపపు ధూపం చూసే
     మహా వేడుక ఇది. చెప్పానా నీకు
5
అరచేతులలో అల్లుకున్న గూడు
     ఆఖరి గడ్డి పరక దొరకక అసంపూర్ణంగా
     మిగిలేపోతుందనీ
     అది నువ్వేననీ? ఇక
6.
నువ్వు ఎక్కడో నీ నిద్రలో, నీ మెలుకువలో
     తప్పక కదులుతావు
     నీ కలలో రాలిపడిన
     ఒక అశ్రువు తడికి. ఆది నా
     వాసన వేస్తుంది- చూడు
7
నన్ను ఒకే ఒక్కసారి
     చూసుకోవాలని ఉంది
     వదిలేసుకున్నవాళ్ళని
     తిరిగి ఒకసారి
     చూడటం ఎలా?            

18 October 2012

దారి

ఆగకుండా ఒక నాదం వినిపిస్తుంది నీలో
     లేత గాలిలో దూరంగా తళతళలాడుతూ ఎగిరే
     సీతాకోకచిలుకల రెక్కల సవ్వడీ నీటి కలకలం
     ఒక మెత్తని శబ్దం నీలో. కనిపించని ఒక సూక్ష్మ

బిందువు వద్ద నుండి ఒక కాంతి జల మొదలయ్యి
     నింపాదిగా శరీరమంతా వ్యాపిస్తోన్న ఒక మహా
     ప్రేమ: అరచేతులతో నీ ముఖాన్ని ఎవరో మహా
     రహస్యంగా పుచ్చుకుని నీ కళ్ళలోకి తీరుబడిగా
     కరుణగా చూసే ఒక మహా కాలం. ఇక

తెలుస్తుంది నీకు నెమ్మది నెమ్మదిగా
     ఈ వేణువుని నీ శ్వాసతో ఊదడం ఎలాగో
     ఈ విశ్వపు వెన్నెల నీ శరీరమై నక్షత్రాలై
     పూలై వానై ధూళై ఎలా ఓ పరవశత్వంతో
     నిన్ను గానం చేస్తుందో: చూడు

సాంధ్యవేళ విరిసిన ఒక చల్లని కాంతిలో నేను.
నేనులో మేను.

ఇక దారి తప్పేది లేదు.   

17 October 2012

అసంపూర్ణం

బిందువునై కూర్చున్నాను ఒక వృత్తంలో. 
     ఎవరిదో శ్వాస నా ఆత్మ చుట్టూ. ఇదే దారో 
     తెలియటం లేదు. నీ శరీరంలో ముఖం 
     కడుక్కుందామనే ఒక కోరిక. తెలుసు 
     చివరికి కన్నీళ్ళతో కడుక్కుంటానని- 

పూలను తాకిన చేయీ, నిన్ను తాకిన కనులూ 
     తిరిగి రావు. శిఖరాగ్రహపు అంచున మెరిసే 
     సీతాకోకచిలుకలూ రాత్రి ఆకాశంలో తడిచిన 
     నక్షత్రాలూ అద్దంపై వాలిన చినుకులూ 
   
నా చుట్టూనూ. 
     రెపరెపలాడే నిశ్శబ్ధాన్ని నిశ్శబ్ధంగా మార్చి 
     మడిచి, ఒక దీపం వెలిగించుకుని, దానిని   
     తలగడలా అమర్చుకుని నిదురించే విద్య 
     ఏదీ లేదు నా వద్ద.
అందుకే చెబుతున్నాను. 

చూడు. ఇటువైపు. నీ వృత్తంలోని
ఈ బిందువు వైపు.

చెదిరిపోయింది గూడు.                    

16 October 2012

రాత్రైతే

రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే అడుగు పెడతావు
     వెదురు వనాలలోకీ: మసక వెన్నెల పరుచుకున్న
     ఆ మట్టి దారులలోకీ మంచు దీపం వెలిగే వేళల్లోకీ

రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే ఆగిపోతావు.
     నక్షత్రాలు నిండిన పూల ఆకాశంలోకీ, నిదుర వాసనలోకీ
     చెమ్మగిల్లిన భూమిలోకీ ఆ శాంతి నిశ్శబ్ధంలోకీ.

రాత్రైతే
ఒక మెలుకువలోకి మేల్కొని, ముఖాన్ని కడుక్కుని
     శరీరాన్ని విడిచి ఒక ప్రయాణం మొదలు పెడతావు
     ఒక కాంతి లోకంలోకి, నీడల వెలుగులోకీ-
     అంతిమంగా నీలోకీ.

రాత్రైతే మరి నేను ఎక్కడ ఉంటాను? 

15 October 2012

.

కూర్చున్నాం ఇద్దరం, ఎదురెదురుగా ఖాళీగా
     ఉదయపు ఎండలో గాలికి కొద్దిగా కదిలే 
     తోటలోంచి తెంపుకు వచ్చి పూలపాత్రలో ఉంచిన  
     రెండు తెల్లని గులాబీ పూవుల్లా:  

తనకీ నాకూ తెలియనిదల్లా మమ్మల్ని 
     ఎవరు తెంపుకు వచ్చారన్నదే: అందుకే 
     కూర్చున్నాం అక్కడే ఇద్దరం 
     సాయంత్రం వడలిపోయి రాత్రిలోకి 
     రాలిపోయేదాకా! 

చూడూ 
ఇక రాత్రంతా ఒక్కటే మంచులో    
     పూలు లేని కుండీలలో ఒంటరిగా ఒక చందమామ 
     ఎలా కూర్చుండి పోయిందో.   

14 October 2012

ఈ సాధారణ దినం


వీపు మీద ఎక్కి కూర్చుని|| ఊడలు పట్టుకుని తిరిగే అడవి బాలుడిలా అంటాడు||  'పోనీ నాన్నా, పోనీ గాట్టిగా ఊపు-' అని. ||ఇక అందుకని

ఊగుతాం మేం|| చెట్టు పైనుంచి చెట్టుపైకి|| అడవులలో|| తళతళలాడే సూర్యరశ్మిలో|| వానలలో. ||కాసేపు గడుపుతాం|| కోతులతో|| సింహాలతో|| ఏనుగులతో|| కలకలం చేసే పిట్టలతో|| జలపాతాలతో|| ఆకులపై నుంచి|| చుక్కలుగా జారే రాత్రితో|| వెన్నెలతో|| చల్లటి మంచుతో.|| చెప్పుకుంటాం|| కొన్ని కధలని|| ఇంతకు మునుపు

అనేకసార్లు|| చెప్పుకున్న కధలని|| మరొకసారి కొత్తగా|| నూతన ఉత్సాహంతో:|| ఎగిరే చేపలూ|| మనుషులుగా మారే మృగాలూ|| కొంత మిస్టర్ బీన్|| మరికొంత టాం అండ్ జెర్రీనూ.||

ఇక అలా ఊగీ ఊగీ ఊగీ|| అలా వినీ వినీ వినీ

కలలోంచి కలలోకి జారిపోతూ|| నా వీపుపై నుంచి జారిపోయి|| చల్లగా రెక్కలు ముడుచుకుని|| నిదురిస్తుంది|| నా శ్వేత సీతాకోకచిలుక|| ఒక కాంతి లోకపు|| కమ్మనైన ||పూల ఉద్యానవనాల సువాసనతో:||

ఇక చేసేదేమీ లేక|| నేను లేచి|| అలసిపోయిన|| నా శరీరాన్నీ లేపి|| గదంతా రాలిన ఆకులనీ|| చినుకులనీ|| ధూళినీ||ఊడ్చి|| ఇల్లంతా||తిరుగాడిన|| జంతువులనూ|| పిట్టలనూ ||అడవులకు|| తిరిగి పంపించి|| పిల్లవాడి|| గుప్పిట్లో చిక్కి|| మిగిలిపోయిన||ఒక రంగు రంగుల|| ఏనుగును|| జాగ్రత్తగా విప్పి|| వొదులుతూ|| ఇలా ఇక్కడ|| కూర్చుంటాను|| బయటకు వెళ్ళిన|| నా భార్య కోసం|| ఎదురు చూసుకుంటూ|| ఈ పదాలు రాసుకుంటూ- అంతే!||

మరే పెద్ద|| విషయమూ లేదు || ఈ వేళ!||  (ఇంతకూ ||నేనేం మాట్లాడుతున్నానో|| అర్థం అవుతుందా|| నీకు-?)||     

13 October 2012

ఈ సాధారణ దినం

వీపు మీద ఎక్కి కూర్చుని|| ఊడలు పట్టుకుని తిరిగే అడవి బాలుడిలా అంటాడు||  'పోనీ నాన్నా, పోనీ గాట్టిగా ఊపు-' అని. ||ఇక అందుకని

ఊగుతాం మేం|| చెట్టు పైనుంచి చెట్టుపైకి|| అడవులలో|| తళతళలాడే సూర్యరశ్మిలో|| వానలలో. ||కాసేపు గడుపుతాం|| కోతులతో|| సింహాలతో|| ఏనుగులతో|| కలకలం చేసే పిట్టలతో|| జలపాతాలతో|| ఆకులపై నుంచి|| చుక్కలుగా జారే రాత్రితో|| వెన్నెలతో|| చల్లటి మంచుతో.|| చెప్పుకుంటాం|| కొన్ని కధలని|| ఇంతకు మునుపు

అనేకసార్లు|| చెప్పుకున్న కధలని|| మరొకసారి కొత్తగా|| నూతన ఉత్సాహంతో:|| ఎగిరే చేపలూ|| మనుషులుగా మారే మృగాలూ|| కొంత మిస్టర్ బీన్|| మరికొంత టాం అండ్ జెర్రీనూ.||

ఇక అలా ఊగీ ఊగీ ఊగీ|| అలా వినీ వినీ వినీ

కలలోంచి కలలోకి జారిపోతూ|| నా వీపుపై నుంచి జారిపోయి|| చల్లగా రెక్కలు ముడుచుకుని|| నిదురిస్తుంది|| నా శ్వేత సీతాకోకచిలుక|| ఒక కాంతి లోకపు|| కమ్మనైన ||పూల ఉద్యానవనాల సువాసనతో:||

ఇక చేసేదేమీ లేక|| నేను లేచి|| అలసిపోయిన|| నా శరీరాన్నీ లేపి|| గదంతా రాలిన ఆకులనీ|| చినుకులనీ|| ధూళినీ||ఊడ్చి|| ఇల్లంతా||తిరుగాడిన|| జంతువులనూ|| పిట్టలనూ ||అడవులకు|| తిరిగి పంపించి|| పిల్లవాడి|| గుప్పిట్లో చిక్కి|| మిగిలిపోయిన||ఒక రంగు రంగుల|| ఏనుగును|| జాగ్రత్తగా విప్పి|| వొదులుతూ|| ఇలా ఇక్కడ|| కూర్చుంటాను|| బయటకు వెళ్ళిన|| నా భార్య కోసం|| ఎదురు చూసుకుంటూ|| ఈ పదాలు రాసుకుంటూ- అంతే!||

మరే పెద్ద|| విషయమూ లేదు || ఈ వేళ!||  (ఇంతకూ ||నేనేం మాట్లాడుతున్నానో|| అర్థం అవుతుందా|| నీకు-?)||         

11 October 2012

వంట చేసిన ఆ అరచేతులు

ఏ రహదారుల్లోనో తప్పిపోయి
    గుండెను చించుకుని, మధుశాలల్లోంచి ఇంటికి
         వస్తావు కదా నువ్వు, చీకటి గుమ్మానికి అనుకుని
                   ఎదురుచూస్తూ కూర్చుని ఉంటుంది నీ తల్లి

ఖాళీ కళ్ళతో నక్షత్రాలని లెక్కిస్తూ:
     సంజాయిషీ చెప్పుకోవాలనుకుంటావు నువ్వు
          నీ ఖాళీ చేతులని చూపిస్తో: నిను వారిస్తో

గడప వద్దనుంచి గుమ్మాన్ని పుచ్చుకుని
    అతి కష్టంగా లేచి, వొణుకుతున్న చేతులతో కదులుతూ
         తను అంటుంది కదా నీతో: 'పొద్దుపోయింది
వెళ్లు.  వెళ్లి  ఇంత అన్నం తిను.
ఖాళీ కడుపుతో పడుకోకు' అని

ఇక మొదలవుతుంది అప్పుడు

అప్పుటి దాకా ఆగిన గాలి
రాత్రితో రాళ్ళతో నీ కళ్ళలో:

దూరాన నుంచి
     ఇక వినపడుతుంది ఎక్కడో వేల ఆకులు రాలే సవ్వడి.
           నీళ్ళు పారే ఒరవడి. లోపల కొంత చిత్తడి. ఇక ఆ రాత్రి

తొలిసారిగా ఏడుస్తావు నువ్వు వెక్కి వెక్కి
అన్నం వండిన తన వొంటరి అరచేతులు
నీ నిదురలో వొణుకుతూ, తెల్లబడిపోతూ
కనుమరుగవ్వుతుండగా, కన్నీళ్లయ్యి నీ
అరచేతులూ చల్లబడి కంపిస్తుండగా

ఆకస్మికంగా తెలుస్తుంది నీకు

వంట చేసీ చేసీ వడలిపోయిన పగిలిపోయిన తన
      వృద్ధాప్యపు అరచేతులని ఇంతకు మునుపు
       నువ్వెప్పుడూ చూడలేదనీ, కనీసం
       ఓరిమిగానైనా తాకలేదనీ-

మరి
చూసారా మీరైనా ఎన్నడైనా ఎప్పుడైనా
కమిలిన తన అరచేతులనీ, ఎవరూ లేని
అన్నం మెతుకులనీ?      

08 October 2012

ఆరిపోనివ్వకు

1.
ఈ రాత్రి ఒక పూవూ కాదు
     అలా అని ఒక ఇల్లూ కాదు. నీడల పొదలలోంచి
             సరసరా నీ వైపుకు పాకే సర్పంతో పోల్చనా దీనిని?

2.
ఉద్యానవనంలో రాలిన చందమామకి
      చీకటి ఆనవాలు తెలియలేదు. వెన్నెల నీళ్ళల్లో
               పాదం ఆడిస్తూ కూర్చున్న నీకు, పరిసరాల్లో దాగిన
సర్ప నాలిక కదలికలు తెలియలేదు.

తొలి అడుగులు వేసే పసిపాప ఈ గాలి
       కొద్దిగా జాగ్రత్తగా పుచ్చుకో తన వేలిని-
                 నిన్ను వొదిలి ఏ వానో లాక్కు వెళ్లిపోగలదు తనని.

3.
సరే. తెలిసింది కదా నీకు.

ఈ రాత్రి ఒక పూవూ కాదు, పసి నవ్వూ కాదు.
     గాడాంధకారం నింపుకున్న మబ్బులు తీవ్రతతో
           భూమి పైకి ఒంగి నిన్ను పరిహసించే కాళ రాత్రి.

బాటసారీ, దేహధారీ

4.
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-

5.
ఇక
ఆరిపోనివ్వకు.
నీ హృదయాన్ని.      
        

06 October 2012

అయోమయం


రంగులు మారే చక్రాల్లాగా ఉంటాయి తన కళ్ళు. గుండ్రంగా తిప్పిందా వాటిని, ఇక మరి
        తిరిగి గిరగిరా నీ తల నిలువలేవు ఒక చోట .ఇక తన తనువంటావా, మరి
                 చిలికి తీసుకోనేవచ్చు తన వొంటిలోంచి వెన్నముద్దలనీ తెల్లని మబ్బులనీ.

అయితే ఉంచలేవు
తన శరీరంపై కుదుటుగా నీ వేలిని ఒక చోట. సర్రున జారే పోతుంది. అది
                సరే కానీ, తన జుత్తులోంచి  కుంకుడు వాసన. అది కాకపోతే                
                 చల్లటి నీళ్ళు ప్రవహిస్తూన్న పొలాల పక్కన వీచే
                 కొబ్బరి తోటల పరిమళం తన తలలో నుంచి - (కేరళా కుట్టి కదా మరి తను)
                     
మరే, ఉన్నపళంగా
స్పృహ తప్పటమంటే ఏమిటో తెలుస్తుంది
     తను నిన్ను ఆమాంతం కావలించుకుని ముద్దుపెట్టుకున్నప్పుడు
              తెగిన నీ పెదాలకి తెలుస్తుంది, ఒక వసంతం తన దంత క్షతాలతో
               నీకు ఒక మండు వేసవి గాలిని ఎలా పరిచయం చేయవచ్చో.

ఇక తను మోహంతో నిను గాట్టిగా చుట్టుకుని
       వదలకుండా నిను పెనవేసుకున్న సంగతి అంటావా
                కొండచిలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక

ఆ తరువాత ఏమిటంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు
                  బ్రతికుండగానే నిను వీడి నీ ప్రాణం తనతో
                  దైవం వద్దకు మిరుమిట్లు గొలిపే కాంతితో
                  గన్నేరుపూల మత్తుతో వెళ్లిపోవడం తెలుస్తుంది- ఇంతా చేసి

ఆనక తీరికగా అంటుంది కదా తను:
'మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ
      కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా'  అని. మూర్ఖుడిని అందుకే మరి

ఇంతకాలం అందుకే నాస్తికుడని మరి. ఇక      అందుకే                  
మరి ఇదిగో రాస్తున్నానీ నాలుగు పదాలు ఈ ఉదయం
ఈ కాలపు ఆలయపు మండపంలో ఇలా జ్ఞానోదయమై

చిరునవ్వుతో కూర్చుని, మరి అంతలోనే ఏమీ తెలియని అయోమయంతో.  

05 October 2012

అయోమయం

రంగులు మారే చక్రాల్లాగా ఉంటాయి తన కళ్ళు. గుండ్రంగా తిప్పితే
     మరి గిరగిరా తిరిగి నీ తల నిలువలేవు ఒక చోట .ఇక తనువంటావా. మరి
               చిలికి తీసుకోవచ్చు తన వొంటిలోంచి వెన్ననీ తెల్లని మబ్బులనీ. అయితే ఉంచలేవు

తన శరీరంపై కుదురుగా నీ వేలిని ఒక చోట. సర్రున జారే పోతుంది. అది
                సరే కానీ, తన జుత్తులోంచి కుంకుడు వాసన. అది కాకపోతే                  
                         చల్లటి నీళ్ళు ప్రవహిస్తున్న పొలాల పక్కన వీచే
                         కొబ్బరి తోటల పరిమళం తన తలలో నుంచి - (కేరళా కుట్టి తను)
                       
మరే, ఉన్నపళంగా
స్పృహ తప్పటమంటే ఏమిటో తెలుస్తుంది
     తను నిన్ను ఆమాంతం కావలించుకుని ముద్దుపెట్టుకున్నప్పుడు
              తెగిన నీ పెదాలకి తెలుస్తుంది, ఒక వసంతం తన దంత క్షతాలతో
               నీకు ఒక మండు వేసవి గాలిని ఎలా పరిచయం చేయవచ్చో.

ఇక తను మొహంతో నిను చుట్టుకుని
       వదలకుండా నిను గాట్టిగా పెనవేసుకున్న సంగతి అంటావా
                కొండచిలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక

ఆ తరువాత ఏమిటంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు
                  బ్రతికుండగానే నిను వీడి నీ ప్రాణం తనతో
                  దైవం వద్దకు మిరుమిట్లు గొలిపే కాంతితో
                  గన్నేరుపూల మత్తుతో వెళ్లిపోవడం తెలుస్తుంది- ఇంతా చేసి

ఆనక తీరికగా అంటుంది కదా తను:
'మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ
      కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా'  అని. మూర్ఖుడిని అందుకే మరి

ఇంతకాలం అందుకే నాస్తికుడని మరి. ఇక      అందుకే                    
మరి ఇదిగో రాస్తున్నానీ నాలుగు పదాలు ఈ ఉదయం
ఈ కాలపు ఆలయపు మండపంలో ఇలా జ్ఞానోదయమై

చిరునవ్వుతో కూర్చుని, మరి అంతలోనే ఏమీ తెలియని అయోమయంతో.       

04 October 2012

చివరికి.

ఒక పొగమంచుని శ్వాసించాను
      గుండెలోకి గుప్పెడు గులాబీలను హత్తుకున్నాను
                      చీకటి తొలిగి వెలుగు నిన్ను తాకే వేళకి

ఏదీ ఏదీ కాదని తెలుసుకున్నాను
      నీ చేతివేళ్ళ మధ్య నా జీవితాన్ని ఉంచుకున్నాను
                        చిరునవ్వుతో లోకంతో దాగుడుమూతలు

ఆడటం ఎలాగో నేర్చుకున్నాను
      ఒక తేలికైన శ్వాసను లయగా పీల్చడం తెలుసుకున్నాను
      ఇక్కడే ఎక్కడో ఒకచోట, ఉన్నచోట ఉండటం అభ్యసించాను

ఒక పొగమంచునీ, నీ శరీరాన్నీ శ్వాసించాను
నీటి తుంపరలు రాలి నీ కనులు తడిచే వేళల్లో
రెక్కలు మొలుచుకువచ్చి

నీడలతో కడిగిన నేలపైని గూటిలోంచి
తిరిగి నీ వద్దకే ఎగిరిపోయాను!          చివరికి.
              

ఒక రాత్రి (not for decent people)*

నిజం చెబ్తివా తమ్మీ/ తరిమి తరిమి కొడతరు/ కొంత ఒంట బట్టించుకో/ ఒంటిని/ మరీ చూడకు/ దానిని అలా/  దేవుని మీద నమ్మకం లేదనుకో/ అటువైపు తిరగకు/ ప్రవచనాలు వినకు/ ఊరికే ఉడుక్కోకు/ పీకల దాకా  తాగినా/ చివర కంటా లాక్కున్నా/ శరీరంలోంచి పోరు/ ఈ మనుషులు/ గుళ్ళూ గోపురాలూ/ మహాత్ములూ/ స్వామీజీలూ/ పిత్రులూ పుత్రులూ

ఒక్కోనికి ఒక్కో లెక్క/ ఒక్కోనికి ఒక్కో తిక్క/ నిజం చెబ్తివా తమ్మీ/ నీ గుద్ద పగలకొట్టి/ ఎళ్ళ దెంగుతరు/ మనుషులు వొద్దంటే/ మరిక నీ ఇష్టం కానీ/ నీ నోట్లోని మాట/ నాలిక దాటొద్దు/ నాలికపై మాట/ పెదాల్ని నమ్మొద్దు/ అన్నా, నిజం చెబ్తున్నా

అసలే నమ్మొద్దు / కవిత్వం రాసే వాళ్ళని/ కుదిరితే ఉంచుకో/ రెండు రాళ్ళు/ ఎప్పుడూ నీ దగ్గర/ పదాలని పగల/ కొట్టడానికైనా/ నీ నోరు పగల/ గొట్టుకోడానికైనా

చూస్తివా అన్నా/ మనల్ని/ నిన్నసలే నమ్మ/ తాగి మాట్లాడని వాడు/ ఆడదానితో తొంగొని దాచేవాడు/ పక్కా దొంగానాకొడుకు/ నువ్వూ నేనూ/ ఇద్దరమూ అంతే/ ఇంతకూ/ నవ్వినావా అన్నా/ ఏడ్చినావా అన్నా/ ఎన్నడైనా?/ నిజ్జంగా? / కళ్ళల్లో నెత్తురు కారేటట్లు?

చూడన్నా ఇక్కడ/ ఈ లోకపు మాధర్చోతుగాళ్ళు/ తుంపిన పూలను/ మా యమ్మ పూలను/ నా చెల్లి పూలను/ నా నేల పూలను/ నా నీటి పూలను / థూ ... ఇస్కీ/ మర్యాదస్తులందరూ/ ....గుడిచిపోయే వాళ్ళే/ ఇంతకీ అన్నా/ నా బుగ్గపై/ జారిన నీళ్ళు/ బూతెట్లయ్యింది/ నీకు?/ 

తెచ్చుకున్నావా నువ్వు/ ఉంచుకున్నావా నువ్వు/ రెండు రాళ్ళు/ రెండు రాళ్ళు/ రెండు రాళ్ళు/ ఈ లోకాన్ని నిలువునా/ పగుల కొట్టేందుకు?

ఇక చూడన్నా/ ఈ చీకటిని ఎట్లా/ ఆ రెండు చుక్కలు/ నా గొంతుని ఎట్లా/ ఈ రెండు మందు చినుకులు / వెలిగిస్తున్నాయో/ మండిస్తున్నాయో...

అన్నా/ వెలుగుతున్నావా/ నువ్వు?
_________________________________________________________________________________

a polyphony of voices, not entirely mine. but perhaps, the agony is singular.          

03 October 2012

నిప్పు పూలు

నిప్పులతో అల్లిన పూలు ఇష్టం నీకు
వెన్నెలైనా మరిగిన దీపమై వెలగాలి

ఏదో ఒక చెట్టు కావాలి. ఏదో ఒక నీడ
నీ చుట్టూతా తిరగాలి. గాలిలో
ముఖాన్నీ వానలో శరీరాన్నీ
అద్దుకుని తుడుచుకోవాలి.
ఆపై నీ నుదుటిన ఒక ఎర్రని
తారకని దిద్దుకోవాలి. చూడు

అరచేతిలో ఒక తేనీరు పాత్రతో
కనుల నిండుగా  ప్రశాంతతతో
ఉదయపు కాంతిలో
కూర్చున్నావు కానీ

తిలకాన్ని అద్దుకున్న నీ
   బొటన వేలిని చూసుకో ఒక్కసారి

ఎవరిదో నిండైన శరీరం
చిటికెడంత నెత్తురై నీ వేళ్ళ మధ్య చితికి

మాటలు లేని ఒక నల్లని రాత్రై నిలిచి ఉంటుంది.     

01 October 2012

ఇలా: ఒక్కోసారి


ఒక మహారాత్రి జలపాతన్నీ ఒక చీకటినీ వింటావు నువ్వు
ఒక్కడివే - ఎవరితోనూ ఉండలేక, నీతో ఎవరూ ఇమడలేక

తారు రహదారుల పక్కగా మెరిసే మధుశాలలలో
అలసిన మనుషుల ఉరుముల ధ్వనులతో, ఆ
అరచేతులు ప్రాణప్రదంగా పోదివి పుచ్చుకునే-
వానకు తడిచిన సూర్యరశ్మితో నిండిన- పాత్రలలో.

వెలిగిపోతారు వాళ్ళు, ఆ గరకు గడ్డాల మనుషులూ
నలిగిన స్త్రీలూ, గాలికి అల్లాడే ఆకులతో ఆ కొద్ది
క్షణాలలో దివ్య జ్ఞానంతో, దివ్యకాంతి లోకాలలో

మమేకమై ఉంటారు పూర్తిగా వాళ్ళు పశువులతో
పక్షులతో, పురుగులతో, కుక్కలతో, కప్పలతో
మట్టి అంటుకున్న పవిత్రమైన దుస్తులతో, నేలలో
వెలిగిన చెట్లలో గాలిలో దీపాలలో. సరే సరే ఇదేమీ

పెద్ద విషయం కాదు కానీ, నువ్వొకసారి ఆ చీకటి
పాదాలకి ప్రణమిల్లి అంటావు కదా ఆ జనులతో:
"చుక్కలని పిండి,  వెన్నెలని చిలికి
ఇచ్చిన మధుపాత్ర కదా ఈ జీవితం.

మరి త్రాగడం ఎలా దీనిని?  నేను అనే
నువ్వైన మగ్గిన ఈ ద్రాక్షా సారాయిని-?"
ఇక అంటారు వాళ్ళు తమలపాకులతో
ఎర్రబారిన దంతాలతో, తెల్లని కనులతో-

"...................................................
....................................................
....................................................
....................................................

ఇక ఆలోచించకు, తాగింది చాలు ఇక
వెళ్ళు ఇంటికి. చూస్తుంటారు నీకోసం
నీ తల్లో నీ పిల్లల్లో నీ భార్యో, బంధువో
శత్రువో మిత్రుడో.నిరాశపరచక వెళ్ళు-
వెళ్ళిపోవడమే అంతిమం ధర్మం యిక్కడ-"

మరి
తెలుసా నీకు ఆ రాత్రి నేను
ఆ చీకటి నీళ్ళల్లో కురుస్తూ
     ఎక్కడికి వెళ్ళానో?