05 October 2012

అయోమయం

రంగులు మారే చక్రాల్లాగా ఉంటాయి తన కళ్ళు. గుండ్రంగా తిప్పితే
     మరి గిరగిరా తిరిగి నీ తల నిలువలేవు ఒక చోట .ఇక తనువంటావా. మరి
               చిలికి తీసుకోవచ్చు తన వొంటిలోంచి వెన్ననీ తెల్లని మబ్బులనీ. అయితే ఉంచలేవు

తన శరీరంపై కుదురుగా నీ వేలిని ఒక చోట. సర్రున జారే పోతుంది. అది
                సరే కానీ, తన జుత్తులోంచి కుంకుడు వాసన. అది కాకపోతే                  
                         చల్లటి నీళ్ళు ప్రవహిస్తున్న పొలాల పక్కన వీచే
                         కొబ్బరి తోటల పరిమళం తన తలలో నుంచి - (కేరళా కుట్టి తను)
                       
మరే, ఉన్నపళంగా
స్పృహ తప్పటమంటే ఏమిటో తెలుస్తుంది
     తను నిన్ను ఆమాంతం కావలించుకుని ముద్దుపెట్టుకున్నప్పుడు
              తెగిన నీ పెదాలకి తెలుస్తుంది, ఒక వసంతం తన దంత క్షతాలతో
               నీకు ఒక మండు వేసవి గాలిని ఎలా పరిచయం చేయవచ్చో.

ఇక తను మొహంతో నిను చుట్టుకుని
       వదలకుండా నిను గాట్టిగా పెనవేసుకున్న సంగతి అంటావా
                కొండచిలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక

ఆ తరువాత ఏమిటంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు
                  బ్రతికుండగానే నిను వీడి నీ ప్రాణం తనతో
                  దైవం వద్దకు మిరుమిట్లు గొలిపే కాంతితో
                  గన్నేరుపూల మత్తుతో వెళ్లిపోవడం తెలుస్తుంది- ఇంతా చేసి

ఆనక తీరికగా అంటుంది కదా తను:
'మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ
      కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా'  అని. మూర్ఖుడిని అందుకే మరి

ఇంతకాలం అందుకే నాస్తికుడని మరి. ఇక      అందుకే                    
మరి ఇదిగో రాస్తున్నానీ నాలుగు పదాలు ఈ ఉదయం
ఈ కాలపు ఆలయపు మండపంలో ఇలా జ్ఞానోదయమై

చిరునవ్వుతో కూర్చుని, మరి అంతలోనే ఏమీ తెలియని అయోమయంతో.       

1 comment:

  1. Sreekanth garu... Goppa prema, abhivyakthi mee maatallo... Love ur each and every word..thanks -bobby nee

    ReplyDelete