08 October 2012

ఆరిపోనివ్వకు

1.
ఈ రాత్రి ఒక పూవూ కాదు
     అలా అని ఒక ఇల్లూ కాదు. నీడల పొదలలోంచి
             సరసరా నీ వైపుకు పాకే సర్పంతో పోల్చనా దీనిని?

2.
ఉద్యానవనంలో రాలిన చందమామకి
      చీకటి ఆనవాలు తెలియలేదు. వెన్నెల నీళ్ళల్లో
               పాదం ఆడిస్తూ కూర్చున్న నీకు, పరిసరాల్లో దాగిన
సర్ప నాలిక కదలికలు తెలియలేదు.

తొలి అడుగులు వేసే పసిపాప ఈ గాలి
       కొద్దిగా జాగ్రత్తగా పుచ్చుకో తన వేలిని-
                 నిన్ను వొదిలి ఏ వానో లాక్కు వెళ్లిపోగలదు తనని.

3.
సరే. తెలిసింది కదా నీకు.

ఈ రాత్రి ఒక పూవూ కాదు, పసి నవ్వూ కాదు.
     గాడాంధకారం నింపుకున్న మబ్బులు తీవ్రతతో
           భూమి పైకి ఒంగి నిన్ను పరిహసించే కాళ రాత్రి.

బాటసారీ, దేహధారీ

4.
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-

5.
ఇక
ఆరిపోనివ్వకు.
నీ హృదయాన్ని.      
        

2 comments:

  1. శ్రీకాంత్‍, పద్యం చాల బాగుంది. పొద్దున్నే చాల సంతోషమిచ్చింది, కొంచెం భరోసా కూడా.

    ReplyDelete