18 October 2012

దారి

ఆగకుండా ఒక నాదం వినిపిస్తుంది నీలో
     లేత గాలిలో దూరంగా తళతళలాడుతూ ఎగిరే
     సీతాకోకచిలుకల రెక్కల సవ్వడీ నీటి కలకలం
     ఒక మెత్తని శబ్దం నీలో. కనిపించని ఒక సూక్ష్మ

బిందువు వద్ద నుండి ఒక కాంతి జల మొదలయ్యి
     నింపాదిగా శరీరమంతా వ్యాపిస్తోన్న ఒక మహా
     ప్రేమ: అరచేతులతో నీ ముఖాన్ని ఎవరో మహా
     రహస్యంగా పుచ్చుకుని నీ కళ్ళలోకి తీరుబడిగా
     కరుణగా చూసే ఒక మహా కాలం. ఇక

తెలుస్తుంది నీకు నెమ్మది నెమ్మదిగా
     ఈ వేణువుని నీ శ్వాసతో ఊదడం ఎలాగో
     ఈ విశ్వపు వెన్నెల నీ శరీరమై నక్షత్రాలై
     పూలై వానై ధూళై ఎలా ఓ పరవశత్వంతో
     నిన్ను గానం చేస్తుందో: చూడు

సాంధ్యవేళ విరిసిన ఒక చల్లని కాంతిలో నేను.
నేనులో మేను.

ఇక దారి తప్పేది లేదు.   

1 comment:

  1. ఉపయోగించిన పదాలు, ఆ భావం...చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది.

    ReplyDelete