ఒక మహారాత్రి జలపాతన్నీ ఒక చీకటినీ వింటావు నువ్వు
ఒక్కడివే - ఎవరితోనూ ఉండలేక, నీతో ఎవరూ ఇమడలేక
తారు రహదారుల పక్కగా మెరిసే మధుశాలలలో
అలసిన మనుషుల ఉరుముల ధ్వనులతో, ఆ
అరచేతులు ప్రాణప్రదంగా పోదివి పుచ్చుకునే-
వానకు తడిచిన సూర్యరశ్మితో నిండిన- పాత్రలలో.
వెలిగిపోతారు వాళ్ళు, ఆ గరకు గడ్డాల మనుషులూ
నలిగిన స్త్రీలూ, గాలికి అల్లాడే ఆకులతో ఆ కొద్ది
క్షణాలలో దివ్య జ్ఞానంతో, దివ్యకాంతి లోకాలలో
మమేకమై ఉంటారు పూర్తిగా వాళ్ళు పశువులతో
పక్షులతో, పురుగులతో, కుక్కలతో, కప్పలతో
మట్టి అంటుకున్న పవిత్రమైన దుస్తులతో, నేలలో
వెలిగిన చెట్లలో గాలిలో దీపాలలో. సరే సరే ఇదేమీ
పెద్ద విషయం కాదు కానీ, నువ్వొకసారి ఆ చీకటి
పాదాలకి ప్రణమిల్లి అంటావు కదా ఆ జనులతో:
"చుక్కలని పిండి, వెన్నెలని చిలికి
ఇచ్చిన మధుపాత్ర కదా ఈ జీవితం.
మరి త్రాగడం ఎలా దీనిని? నేను అనే
నువ్వైన మగ్గిన ఈ ద్రాక్షా సారాయిని-?"
ఇక అంటారు వాళ్ళు తమలపాకులతో
ఎర్రబారిన దంతాలతో, తెల్లని కనులతో-
"...................................................
....................................................
....................................................
....................................................
ఇక ఆలోచించకు, తాగింది చాలు ఇక
వెళ్ళు ఇంటికి. చూస్తుంటారు నీకోసం
నీ తల్లో నీ పిల్లల్లో నీ భార్యో, బంధువో
శత్రువో మిత్రుడో.నిరాశపరచక వెళ్ళు-
వెళ్ళిపోవడమే అంతిమం ధర్మం యిక్కడ-"
మరి
తెలుసా నీకు ఆ రాత్రి నేను
ఆ చీకటి నీళ్ళల్లో కురుస్తూ
ఎక్కడికి వెళ్ళానో?
No comments:
Post a Comment