11 October 2012

వంట చేసిన ఆ అరచేతులు

ఏ రహదారుల్లోనో తప్పిపోయి
    గుండెను చించుకుని, మధుశాలల్లోంచి ఇంటికి
         వస్తావు కదా నువ్వు, చీకటి గుమ్మానికి అనుకుని
                   ఎదురుచూస్తూ కూర్చుని ఉంటుంది నీ తల్లి

ఖాళీ కళ్ళతో నక్షత్రాలని లెక్కిస్తూ:
     సంజాయిషీ చెప్పుకోవాలనుకుంటావు నువ్వు
          నీ ఖాళీ చేతులని చూపిస్తో: నిను వారిస్తో

గడప వద్దనుంచి గుమ్మాన్ని పుచ్చుకుని
    అతి కష్టంగా లేచి, వొణుకుతున్న చేతులతో కదులుతూ
         తను అంటుంది కదా నీతో: 'పొద్దుపోయింది
వెళ్లు.  వెళ్లి  ఇంత అన్నం తిను.
ఖాళీ కడుపుతో పడుకోకు' అని

ఇక మొదలవుతుంది అప్పుడు

అప్పుటి దాకా ఆగిన గాలి
రాత్రితో రాళ్ళతో నీ కళ్ళలో:

దూరాన నుంచి
     ఇక వినపడుతుంది ఎక్కడో వేల ఆకులు రాలే సవ్వడి.
           నీళ్ళు పారే ఒరవడి. లోపల కొంత చిత్తడి. ఇక ఆ రాత్రి

తొలిసారిగా ఏడుస్తావు నువ్వు వెక్కి వెక్కి
అన్నం వండిన తన వొంటరి అరచేతులు
నీ నిదురలో వొణుకుతూ, తెల్లబడిపోతూ
కనుమరుగవ్వుతుండగా, కన్నీళ్లయ్యి నీ
అరచేతులూ చల్లబడి కంపిస్తుండగా

ఆకస్మికంగా తెలుస్తుంది నీకు

వంట చేసీ చేసీ వడలిపోయిన పగిలిపోయిన తన
      వృద్ధాప్యపు అరచేతులని ఇంతకు మునుపు
       నువ్వెప్పుడూ చూడలేదనీ, కనీసం
       ఓరిమిగానైనా తాకలేదనీ-

మరి
చూసారా మీరైనా ఎన్నడైనా ఎప్పుడైనా
కమిలిన తన అరచేతులనీ, ఎవరూ లేని
అన్నం మెతుకులనీ?      

No comments:

Post a Comment