20 October 2012

ఎలా?

1
నిన్ను ఒకసారి చూడాలని ఉంది
     వొదులుకున్న వాళ్ళని, తిరిగి
     ఒకసారి చూడటం ఎలా?
2
స్వప్నానంతాన దిగ్గున లేచి
     గుండె ఉగ్గ పట్టుకుని, వొళ్ళంతా
     వణికితే, కళ్ళలోకి కటిక చీకటి-
3
దాహం వేసిన పెదాలకి ఇంత తడీ
     రాత్రిలో వెదుక్కునే చేతులకి
     ఒక నీటి పాత్రా దొరకదు. ఎందుకంటే
4
కత్తి అంచుతో చీరిన నాలికపై నీ రుచి.
     రెండు వేళ్ళ మధ్య శ్వాసను చిదిమి
     ఆరిన దీపపు ధూపం చూసే
     మహా వేడుక ఇది. చెప్పానా నీకు
5
అరచేతులలో అల్లుకున్న గూడు
     ఆఖరి గడ్డి పరక దొరకక అసంపూర్ణంగా
     మిగిలేపోతుందనీ
     అది నువ్వేననీ? ఇక
6.
నువ్వు ఎక్కడో నీ నిద్రలో, నీ మెలుకువలో
     తప్పక కదులుతావు
     నీ కలలో రాలిపడిన
     ఒక అశ్రువు తడికి. ఆది నా
     వాసన వేస్తుంది- చూడు
7
నన్ను ఒకే ఒక్కసారి
     చూసుకోవాలని ఉంది
     వదిలేసుకున్నవాళ్ళని
     తిరిగి ఒకసారి
     చూడటం ఎలా?            

2 comments:

  1. అశ్రువు తడిలో చదివిన వారి వాసనా కూడా తెలుస్తుందేమో!!!!

    ReplyDelete
  2. *అరచేతులలో అల్లుకున్న గూడు
    ఆఖరి గడ్డి పరక దొరకక అసంపూర్ణంగా
    మిగిలేపోతుందనీ
    అది నువ్వేననీ?*
    height of love.. and its incompletness..
    A great feel in reading these lines.. kudos to the writer

    ReplyDelete