04 October 2012

చివరికి.

ఒక పొగమంచుని శ్వాసించాను
      గుండెలోకి గుప్పెడు గులాబీలను హత్తుకున్నాను
                      చీకటి తొలిగి వెలుగు నిన్ను తాకే వేళకి

ఏదీ ఏదీ కాదని తెలుసుకున్నాను
      నీ చేతివేళ్ళ మధ్య నా జీవితాన్ని ఉంచుకున్నాను
                        చిరునవ్వుతో లోకంతో దాగుడుమూతలు

ఆడటం ఎలాగో నేర్చుకున్నాను
      ఒక తేలికైన శ్వాసను లయగా పీల్చడం తెలుసుకున్నాను
      ఇక్కడే ఎక్కడో ఒకచోట, ఉన్నచోట ఉండటం అభ్యసించాను

ఒక పొగమంచునీ, నీ శరీరాన్నీ శ్వాసించాను
నీటి తుంపరలు రాలి నీ కనులు తడిచే వేళల్లో
రెక్కలు మొలుచుకువచ్చి

నీడలతో కడిగిన నేలపైని గూటిలోంచి
తిరిగి నీ వద్దకే ఎగిరిపోయాను!          చివరికి.
              

1 comment: