21 October 2012

నత్తలు


వంకీలు తిరిగిన ఆకుల కింద నత్తలు
     నీడలు గాలులతో వీచే వేళ్ళల్లో- ఎలా అంటే

ఎవరో అతి నింపాదిగా మట్టికుండలోంచి
     మంచి నీళ్ళు ముంచి, నెమ్మదిగా
     నీ అరచేతుల్లోకి కరుణతో వొంపితే
 
     సూర్యకాంతి తాకిన ఆ నీళ్ళను
     నీ పెదాలు తాకి,  ఆత్మ చలించి

తొలిసారిగా నీకు ఎవరో ఒక శబ్ధంలోంచి
     నిశబ్దాన్ని బహుకరించినట్టూ
     మూగవాడికి ఒక పిల్లన గ్రోవి
     దొరికినట్టూ, ఒక మౌన సంగీతం వీస్తుంది

ఆకులు రాలిన నీ దగ్ధ శరీరంలోంచీ
     ఆ లేత నత్త పాదాల కింది భూమిలోంచీ
     నిన్ను హత్తుకునే  రెండు చేతులలోంచీ:

కదలకు ఇక: ఎందుకంటే
     మట్టి కుండలోంచి తను, చెమ్మగిల్లిన గాలినీ
     వెన్నెలనీ నక్షత్రాలనీ రాత్రినీ ధూళినీ పూలనీ
 
     ఒక పురాతన ఆకాశాన్నీ ఒక ఆదిమ విశ్వాన్నీ
     నీకు తను తన శరీరంతో నిండుగా ముంచి ఇచ్చే

అనంతమైన చిన్ని ప్రేమ కాలం
ఆసన్నం అయ్యింది. మరవకు.

No comments:

Post a Comment