28 September 2012

కొత్తిమిరకపాయ్


రైతులు లేని రైతుబజారు నుండి ప్లాస్టిక్ సంచిలో తెచ్చుకుంటాము బహుభద్రంగా, నేనూ నా కొడుకూ కూరగాయలు. టమాటాలు, బెండకాయలూ, దోసకాయలూ, ఆలుగడ్డలూ, చిలుకడ దుంపలూ, ఇంత పాలకూరా, పచ్చి మిరపకాయలూ కొంత కొత్తిమీరా- నేనైతే చూసాను

ఒకప్పుడు, నా కొడుకంత వయసులో ఇంటి పెరటులో నాన్న చేసిన పాదులో ఏడు రంగుల్లా వికసించి నింగికి సాగిన  బీరకాయ, పొట్లకాయ లతలనూ వాటికి తళుక్కుమని మెరిసే కాయలనూ, నేలలో మట్టిని కావలించుకుని నిదురించే పల్లీలనూ దుంపలనూ - అక్కడే పక్కగా ఎంచక్కగా ఎదిగి వొంగిన జామచెట్టునూ దాని కింద నీడలలో కదిలే చిన్ని పిట్టలనూ.

నగ్నమైన వీపుతో నాన్న అక్కడ మట్టిలో ఉంటే వెనుకగా నేను నాన్న తెంచి ఇచ్చిన కనకాంబరపు పూలనూ దవనాన్నీ అమ్మకి ఇచ్చి చూసేవాడిని ఇంద్రజాలంలాంటి ఆ కాంతిలో అమ్మ వేళ్ళ అల్లికలో పూలు హారమై అమ్మ శిరస్సులో మళ్ళీ నాటుకుని ఎలా పచ్చగా వికసించేవో - రాత్రికి

పెరటిలో తెంపుకున్న నాలుగు టమాటాలు పెరుగుతో కూరగా నాలుగు మాటలుగా ఆనక నాన్న చెప్పే వ్యవసాయపు కథలుగా చల్లటి అమ్మ చుట్టూ వెచ్చని నిదురుగా ఎలా మారేవో. మరి ఇప్పుడు అంటాడు

నా నాలుగేళ్ల పిల్లవాడు, కూరగాయ మొక్కలని ఎన్నడూ చూడని వాడు, నలు చదరపు గదులలో పెరడు లేని వాడు - " నాన్నా కొత్తిమిరకపాయలు తీసుకున్నావా?" అని. ఏమో తీసుకున్నానేమో మరి, కానీ 

కురియలేదు అప్పుడు కురిసిన వర్షం 
ఇక ఏ మాత్రం ఇక్కడ:ఎప్పటికీ.నాకూ 
నా పిల్లవాడికీ-

25 September 2012

దినచర్య


ఉదయాన్నే లేచి, నిదురలో హాయిగా తేలుతున్న పిల్లల ముఖాలని చూసుకుంటాను.  ఒక పురాతన పుష్పపు పరిమళమేదో చుట్టుకుంటుంది. నెమ్మదిగా కదిలి బాల్కొనిలో పక్షులు అల్లుకున్న గూడుని చూసుకుంటాను. 

చెమ్మగిల్లిన కాంతి, చల్లని నీడా కలగలసి తిరుగుతాయి గోడపై. ఎదురుగా గాలికి ఊగే పచ్చని చెట్లపై వేకువజామున రాలిన ఓ మంచు శబ్దాన్ని వినేందుకు ప్రయత్నిస్తానుఅరచేతిలో వెచ్చగా ఒదిగిన కప్పు తేనీరుతో-

లోపల గదిలో, కాగితాల అలికిడి వంటి నా తల్లి మాటలు. నలిగిన పుస్తకంలో దాగి ఉంటాయి తన వృద్ధాప్యపు లేఖలు. ఆ ముసలి అరచేతుల మధ్య ఒకప్పుడు ఎన్ని ముఖాలు ఒదిగాయో ప్రేమగాఇప్పుడు పసిడి మడతలు పడిన తనలో ఒక మహా శూన్యం.

వంట గదిలో నీళ్ళ సవ్వడి. పాత్రల అలజడి. నిప్పు వెలిగి శుభ్రమయ్యే నిత్య దైనందిన జీవన శ్రుతి. కూరగాయలు తరుక్కుని, కడుక్కుని ఈ భూమి దయతో అందించిన బియ్యపు గింజలు వండుకుని, డబ్బాలో కట్టుకుని స్నానం చేసి అలా దిన వారీ పనులు చేసుకునేందుకు లోకంలోకి కదిలే ఒక పవిత్రమైన పని. ఏమీ లేదు ఉదయాన్నే లేచి, ఇదిగో ఇలాంటి

నాలుగు వాక్యాలని రాసుకునేందుకే బ్రతికి ఉంటాను. యిక తలుపు తీసి బయట అడుగిడితే ఎదురుగా అలసటగా నా పిల్లల్ని చూసేందుకు వచ్చే నా ముదుసలి తండ్రి. ఎక్కడో నల్లటి మట్టి చిట్లి, నల్లటి మేఘం పిగిలి ఓ వర్షం మొదలవుతుంది. కాలం వలయమై, చిన్నగా చల్లగా కురిసే వర్షం.

ఇద్దరం ఎదురెదురు పడి, ఇద్దరి కళ్ళు మిళితమై, నుదిటిని ఆనుకున్న నా భార్య అరచేయ్యై, సాగుతాం ఇద్దరం అందరితో - యిక ఈ రోజుకి ఇలా ఉండటం మంచిదే. ఈ నాలుగు వాక్యాలు రాసుకోవడం మంచిదే. ఇంతా చదివి, ఇదేమిటని మీరు అడిగితే, యిక నేను ఏమీ చెప్పలేను, నిండుగా సజలమైన ఈ నా మీ హృదయంలో మీ చేయి జార్చి ఒక అద్దాన్ని వెలికి తీసి మిమ్మల్ని మీరు చూసుకోమని చెప్పడం తప్ప.    

అతడొక్కడే*

హృదయంలో ఒక దీపాన్ని దాచుకుని
లోకానికి చీకటి ముఖాన్ని చూయిస్తూ
రిక్త అరచేతులతో, నిండు నయనాలతో

రాలే కాలాన్ని చూసే,  ఏమీ లేక
అన్నిటినీ పొందిన మనిషి ఒక్కడే
ఈ నాలుగు దారుల రద్దీ కూడలిలో

వస్త్రాలని వదిలి, దేహాన్ని విడిచి
ఈ ఉదయపు ఎర్రటి కాంతిలో
నిలకడగా నిలబడి చేతులు చాచిన
మనిషి ఒక్కడే ఇక్కడ.

మౌనం ఒక మహా సంగీతమేమో.
ఉండటం ఊరికే అలా, ఇక్కడ ఒక
మహా ఉపాసనేమో, ఒక మహా కళేమో.

నాకు సాధ్యం కాని నిరాపేక్ష ఉనికిగా
తారు ధూళిలో, వాహనపు పోగలలో
అతడొక్కడే మనిషి

శిరోజాలు వంకీలై పీలికలైన అంగవస్త్రమై
ఈ దినంపై సృష్టి అద్దిన వెలిగే నిశ్శబ్ధమై
అతడొక్కడే మనిషి,    నా హృదయంలో.

ఇక స్కూలుకి వెడుతూ వెడుతూ
పిల్లలే చాచిన అతని అరచేతిలోకి
అతని కన్నులలోకీ

తాము తీసుకు వెళ్ళే పుష్పగుచ్చాలనీ
అర తెరిచిన డబ్బాలలోంచి, తమ
అల్పాహారాన్నీ పదిలంగా ఉంచుతారు

హృదయంలోని దీపాలని మరచిన
ఎదిగిన ఇతరులు, యిక ఎప్పటికీ
తాము నిండలేకా, తమని తాము
ఎప్పటికీ నింపుకోలేకా, ఇక ఇక్కడే

ఈ యంత్ర మోహిత
నల్లటి ధూపాలలోనే
లోహాలలానే నక్షత్రాలు పూయలేని
ఆకాశంలానే

ఆకాశం అంటతా అంటిన
చీకటిలానే ఇక ఇప్పటికే
ఇక ఎప్పటికీ-
_________________________________________________________________
*ఒక మునుపటి వాచకం. స్థలం: విద్యానగర్ చౌరస్తా. ఒక సోకాల్డ్ 'పిచ్చివాడు' రోజంతా అక్కడ చేయి చాచి గంటలు తరబడి ప్రసన్నమైన వదనంతో నిలబడి ఉండేవాడు. అప్పటిలో, అతడిని చూసి కొంత అబ్బురం కొంత అయోమయం కొంత ఆలోచనానూ. మరి అతడు ఇప్పుడు ఎక్కడో తెలియదు. 

24 September 2012

నువ్వే చెప్పు

సర్వత్రా వెలిగే సన్నటి కాంతి తీగవి నువ్వు
హృదయంలోంచి వ్యాపించి, సాగి
ఆత్మలో స్థిరపడే పరిమళం నువ్వు.

అలా అని నేనైతే తరిమి వెయ్యలేను
అలా అని నేనైతే ఉంచుకోనూ లేను-
ఈ వానలోకి, చీకటి గాలిలోకీ,గూటిలో

ఒదిగిన రెండు ఊదారంగు పిట్టలని.
ఒక నువ్వు ఒక నేను అనే
పిచ్చుకలనీ, వాటి పిల్లలనీ-

అరచేతుల్లోకి ఒదిగిన
దీపపు కాంతినీ, మన ముఖాలనీ
ఆరిపోకుండా చూసుకోవడం ఎంత

కష్టమో ఇక
నువ్వే చెప్పు.     

23 September 2012

ఊహించు

ఊహించు, నిప్పు అంటుకుని గాలికి రేగే ఒక వెన్నలని
నిలువ నీడ లేక ఒరిగిన ఒక మనిషిని - ఎవరో 
తీసుకువచ్చి ఈ అపరచిత లోకంలో కాలంలో వదిలివేసి 
వెళ్ళిపోయిన ఒక పురాతన ఉనికిని. 

ఊహించు, దోసిళ్ళలోంచి జారిపోయిన ఒక ముఖాన్ని
ఊహించు, ఒక ప్రియమైన వ్యక్తిని తాకబోతూ 
అర్థాంతరంగా తెగి ఆగిపోయిన ఒక అరచేయిని

ఊహించు, చీకటిలోకి కనుమరుగయ్యే ఒక కాంతిని
ఊహించు, నీటిలో నిమగ్నమయిన ఒక నయనాన్ని
ఊహించు, చివరకి - నన్ను.

22 September 2012

గూడు

ఎక్కడి నుంచో వచ్చిన పసుపు పచ్చని పిట్టలు
పచ్చి గడ్డిపరకలతో గూడు కట్టుకుంటుంటే
చూస్తారు పిల్లలు అబ్బురం నిండిన కళ్ళతో

చెబుతావు నీవు విడమర్చి కొన్ని విశ్వసత్యాలని వాళ్లకి
ఆ గూటిని చూపిస్తో, నీకు నువ్వు చెప్పుకుంటో, 'రెండు
కావాలి ఒక్కటిని చూసేందుకు ఒక్కటి అయ్యేందుకు
కట్టుకుంటారు మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక

గూడును, నిర్విరామంగా నిర్మించుకుంటూ
తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు, గూడు
ఇక్కడిది కాదని గూడు ఎప్పటికీ ఉండదనీ
అయినా తిరిగి కట్టుకోవడం ఆపకూదదనీ-".

మరిక నిన్ను తొలిసారిగా విస్మయంగా చూసే
కాంతి విరిసే పిల్లల కళ్ళలోకి చూసినప్పుడు
అదే కదా తెలిసేది అందరికీ: తిరుగుతోంది ఈ
జగం ఒక వేణు గానంతో పసి పాదాల నృత్యంతో

తన చుట్టూతా తానై సర్వం చుట్టూతా తిరుగుతూ
విశ్వ వృక్షానికి వెలిగే నక్షత్రాల కొమ్మల్లో
ఒక గూటి దీపమై వెలుగుతో అల్లుకుంటో: చూడు

ఇక రాత్రంతా ఇద్దరు పిల్లలు చీకటి పాత్రలో ఒక
వెన్నెల రొజాని ఉంచి తమ శ్వాసలను జల్లి ఎలా
నీ ఛాతిపై చెరోవైపు కళల గూళ్ళు అల్లుకుంటూ

నిశ్చింతగా ఎలా నిదురోతారో! నువ్వు నిశ్చింతగా
తొలిసారి ఎలా మెలుకువలోకి మేల్కొంటావో-

జీవితం

నింపాదిగా తాగుతూ నింపాదిగా ఒక పూవును 
రేకు రేకుగా తెంపుతూ - రాత్రి ఇలాగే ఉంటుంది 
నువ్వు వెలిగించి ఎవరో 
ఆర్పివేస్తున్న దీపంలా.

మరి అందుకే
చీకటిని నీ చుట్టూతా చుట్టుకుని
కళ్ళని కోల్పోయి నిన్ను నువ్వు
ఆసరాగా తీసుకొని

లేచి, పడి, పడి, లేచి - నీ తల ఎత్తి
సర్పవలయాలైన ఆకాశాన్ని చూస్తో
మట్టిలోకీ తారురహదారుల్లోకీ ఇంకే
నీ పాదాల

మరొకరి శబ్దాల అలజడిని వింటూ 
సాగుతావు కదా కన్నయ్యా 
ఆ మల్లెపూల గూళ్ళ 

నిను గన్న ఆ కన్నమ్మ ఇంటికి

ఇక తన వాకిట్లో పడి ఉంటాయి
నువ్వు నిన్న తెంపిన
పసిడి పూల రేకులు

తన ముగ్గుల కన్నీళ్ళతో
ఆ కన్నీళ్ళపై రాలిపడిన
నువ్వు కురిసిన నెత్తురు వాంతితో.

ఇక జీవితం ఎలా ఉందంటే, కన్నయ్యా
ఏం చెప్పేది నీకు ఏం చూపించేది నీకు? 

నువ్వేం చేయగలవ్

ఎవరో తమ రెండు మునివేళ్ళతో
నీ ముఖంపై వాలిన గాలి తెరను  
అలవోకగా అలా పుచ్చుకుని నీ
శ్వాసను తమతో

వడలిన సంధ్యాకాంతిలోంచి
చెమ్మగిల్లుతున్న చీకట్లలోకి
తేలికగా తీసుకువెడుతుంటే

ఇక

నువ్వేం చేయగలవ్ వణికే
అరచేతులతో వేడుకోవడం
తప్ప?       

17 September 2012

తూనీగలు

మా మత్తుగా పెరిగిన పిచ్చి మొక్కల మైదానం మీదుగా
ఎగురుతాయి గుంపులుగా తూనీగలు
ఎర్రటి మధ్యాహ్నపు  అద్దపు కాంతిలో-

ఆ పచ్చి పిచ్చిమొక్కలని  పీకి యిక  ఆ
ఇద్దరు పిల్లలు ఒకటే పరుగు వాటి వెంట

శివాలు ఎక్కి రౌద్రంగా కొరడాలు జుళిపించినట్టు
అన్నం తిన్నాక మళ్లీ మోగే ఒక అరగంటలోపు
ఎన్ని తూనీగలు రాలేవో గాలిలో మా చేతులలో 

చచ్చి కొన్ని చితికి కొన్ని ముక్కలై కొన్ని
రెక్కలు తెగి కొన్ని, ఎగరలేక  కొన్ని
నేలపై భారంగా ఈదులాడుతూ పడి
ఉన్న కొన్నిటిని  రెండు వేళ్ళ మధ్య
ఇరుకించుకుని ముఖానికి దగ్గరగా లాక్కుని వాటి కళ్ళలోకి చూస్తే

మిణుకు మిణుకుమంటూ కనిపించేవి
ఏవో ప్రపంచాలు లోతుగా చీకటిగా
జిగటగా, నాన్న కొట్టాక తెగి కారుతున్న
నెత్తురంటిన అమ్మ పెదాలలాగా.

శరీరం జలదరించి వాటిని వదిలివేసి
పరిగెత్తాడు వాళ్ళల్లో ఒక పిల్లవాడు
మరొకడు ఆ తూనీగలని కాళ్ళ కిందేసి తొక్కి పిచ్చిగా నవ్వుతుండగా-

ఇకా తరువాత దట్టంగా మబ్బు పట్టి
వాన కురిసింది దడగా పిచ్చిపిచ్చిగా
ఆ మసక మధ్యాహ్నమంతా - మరి

వాలేపోయాయి ఆ పచ్చని పిచ్చిమొక్కలు
తడిచిపోయి, వొణుకుతున్న అతడి
హృదయం నిండా, శరీరం నిండా-ఇకా రాత్రీ

అప్పుడూ ఇప్పుడూ, తెగిన తెల్లని రెక్కలతో
దిగి వస్తాయి తూనీగలు, నేను నరికిన పిచ్చి
కళ్ళ లేత తూనీగలు, జ్వరపీడిత కాలాలలో
చిత్తుగా నానిన ఆ పచ్చిమొక్కల వాసనతో

నేను వెళ్ళలేని మైదానాలై నేను  చేజార్చుకున్న
స్త్రీలై, ఏ జన్మలోనో వెలిగించిన  దీపపు ధూపమై
ఈ జన్మకీ సాగే హృదయాన్ని కబళించే ఓ అజగరమై చేయి జారి తొలికిన నీళ్ళలాంటి
కనులై, వేర్లు వెలుపలకి వచ్చి వొరిగిన ఆ పిచ్చిమొక్కలై

దారి తప్పి ఓ గదిలో చిక్కుకుపోయి
విద్యుత్ కాంతి అంటుకుని రెక్కలు
నెమ్మదిగా కాలిపోతూ అల్లాడుతున్న ఒకే ఒక్క ఒంటరి తూనిగై-         

ఈ ఉదయం

వానకి  ముందు మబ్బులు కమ్ముకుని
బలమైన గాలి వీచి రహదారి పొడుగూతా
కొట్టుకుపోతుంది కదా
తెరలు తెరలుగా మట్టి

అక్కడక్కడా పడి ఉన్న కాగితాలని
దిశ లేకుండా తనతో లాక్కెడుతూ
తిప్పితిప్పి ఆకాశంలోకి విసిరివేస్తూ

మరి ఇవాళ ఉదయం
దారీ తెన్నూ లేకుండా
కొట్టుకుపోయింది నా శరీరం, హృదయం
నిన్ను తలచుకుని -

అనుకున్నాను ఇన్నాళ్ళూ
వాన రావడం ఆహ్లాదమే
అని కానీ - ధూళి రేగి, కళ్ళు చెదిరి
కమ్ముకున్న మబ్బులు
కళ్ళలోనే  కురుస్తాయని

రాసుకున్న కాగితం చిరిగిపోయి
అక్షరాలు చెరిగిపోయి
నీళ్లపై తేలిపోతాయని
ఇక నీకు చెప్పేదెవరు?          

16 September 2012

ఒక సాయంత్రం

కూర్చుంటావు నీలో నువ్వు నిశ్శబ్దంగా
అలలు లేని సరస్సులో- నీలో నువ్వే- నింపాదిగా విచ్చుకునే
సూర్యరశ్మిలాంటి ఒక పొద్దుతిరుగుడు పూవుని చూస్తూ: అవే

పసుపు రాసుకుని తిరిగే
పచ్చి వాన వాసన వేసే తన చేతులలాంటి పూలరేకులను.
చూడు: సరిగ్గా అప్పుడే, నిశ్శబ్ధదీపం వెలిగించుకుని ఉన్న
ఆ కాంతి కాలాలలోనే, సరిగ్గా

అప్పుడే ఎవరో నీ పరిసరాల్లో గాలై రెపరెపలాడతారు. ఇక
గాలికి దీపం, కాంతికి గాలీ గాలికి శరీరం తోడయ్యిన
మసక సాయంత్రాన చల్లటి చీకటిగా మారెదెవరో నేను నీకు

వేరేగా చెప్పాలా?  

14 September 2012

స్థభ్దత

నీ ముఖం ఎందుకో స్తబ్ధమయ్యింది. 

బహుశా ఎవరూ ఎత్తుకోలేదు ఇవాళ  నీ  ముఖాన్ని  తమ అరచేతులతో. అందుకే  బహుశా ఈ మధ్యాహ్నం నీ గదిలో ఒక మూలగా కూర్చుని ఉంది నీ నీడ. అప్పుడు 

ఇక నువ్వు నీ కనురెప్పలని బరువుగా లేపినప్పుడు కనిపిస్తాయి రెండు ఊదా రంగు పిట్టలు, కిటికీకి చుట్టిన కేబుల్ తీగలపై  పచ్చటి గడ్డి పరకలతో ఒక గూడుని అల్లుకుంటో: ఎవరో తమ రెండు అరచేతులని ప్రార్ధనకై జోడించి ఆకాశాన్ని వేడుకుంటున్నట్టున్న  గూడు.  

ఇక ఒక నిట్టూర్పుతో కదులుతావు నువ్వు. నేను లేని ఇంట్లో నేను రాసిన కాగితాలపై ఉన్న అక్షరాలని నీటి రంగులతో చెరిపివేస్తూ ఆడుకునే నీ పసిబాలుడు ఇక నిన్ను చూస్తూ అంటాడు కదా: 'అమ్మా, ఇవాళ  నేను నీ కళ్ళల్లో నిదురపోతాను.'
ఆనక ఏ రాత్రో వచ్చి

ఒక  చీకటి  కన్నీటి గూటిలో ముడుచుకుని 
ఒక అశ్రువుని కౌగలించుకుని నిదురోతున్న 
మరొక అశ్రువుని చూసి   

నా ముఖం ఎందుకో స్తబ్ధమయ్యింది. 

పాప పరిహారం

పాపం శమించు గాక. ఎందుకు రాసితినో నాలుగు వాక్యములు నీ గురించి మరి ఎందులకు ప్రచురించితినో నాలుగు కాని ఆ వాక్యములను నాలుగు దిక్కులా నువ్వు చూడని ఆ నలుగురు నాలుగింతల వ్యాఖ్యనాలై నను పరి పరి విధముల వేధించుటకు, అయినను వెళ్లి రావలయును రౌరవ నరకములకు ఈ అర్థముల అంగడి యందున్న ఏకార్ద ఏక ముఖ పత్నీ వ్రతులను పిలిచినందుకు, ఏక సత్య మహా పతివ్రతులను ధిక్కరించినందులకూ - పాపం శమించు గాక. మరి ఎపుడైనా చేసేదనా ఇటువంటి నేరము బొందిలో ప్రాణము యుండగా మరి ఎపుడైనా రాసెదనా నీ మేనును నిష్కర్షగా? యుండెదను నాలో నేను-ఇక- చిక్కగా నిను మైమరపు మోహపు

                                      పూలతో  వెన్నెలతో
                                      సీతాకోక చిలుకలతో
                                      నదులతో కలలలతో
                                      ధరిత్రితో ఆకాశాలతో  

తారకలతో తీరాలతో వానతో సరస్సులతో అంతిమ సత్యములతో పోలుస్తో 
నిన్ను వాటితోనే ప్రతిష్టించి సమాధి చేస్తో -   విన్నావా ఎన్నడైనా  నువ్వు
నీ వేలితో నీ కన్నే పొడుచుకునేటట్టు చేయుట అను మహా  సూత్రమును?  

13 September 2012

నీ వదనమే

చీకట్లో అయితే

ఒక దీపం వెలిగించుకుని కూర్చోవచ్చు
కానీ పట్టపగలు నీ వదనమే ఒక దీపమై
తన కాంతితో

ఒక మనిషి కళ్ళును  పెరికివేసి
అతడి లోకాన్ని చీకటి చేస్తే ఇక
నేను వెళ్లి

ఎవరితో మొర పెట్టుకోను?

వాస్తవం

నీవు లేని చోటు లేదు. అందుకనే  దాక్కున్నాను నేను నీ లోపలే.
చూడు. ఇక నువ్వు కనుగొనలేవు నన్ను. ఎన్నటికీ.

12 September 2012

చెదపకు

చెదపకు ఆ గూడును

నీ చూపు తెగిపోయినా హృదయంలోకి ఒక
చీకటి చొచ్చుకువచ్చినా
కదపకు ఆ రంగుల రేకుల ఈకల గూడును

అది ఒక పిట్టధైనా లేదా
తన చిన్న లోకానిధైనా
ఎందుకంటే స్నేహితుడా

ఈ విశ్వపు అంతిమ భారమంతా
దాని లేత అంచులపైనే
నిలిచి ఉండి ఉండవచ్చు.   

ఏమిటిది?

అర్థాల దీపాలు వెలిగించి కూర్చున్నానా ఇక్కడ  నేనేమైనా
     ఆ పరమ దివ్యకాంతిలో నీకు అంతిమ సత్యాన్ని భోధించేందుకు?
         పూలహారాలు కావివి, నీకు తెలిసిన శారీరిక ధర్మాలు కావివి - నెత్తురు

అద్ది దిద్దుకున్న మృత్యుదారులు ఇవి. ఇవే, ఈ పదాలు
       నీకు అర్థం కాని వాచకాలు. ఇద్దరు ముగ్గురయ్యి, ముగ్గురు అనేకమయ్యి
              చివరికి ఒంటరిగా మిగిలిపోయే పరిమిత పదాలు.

బిందువు నుంచి బిందువుకి మధ్య సాగే ఒక వలయంలో ఉండే
       బిందువులెన్ని? చూడూ, నవ్వుతున్న పాపలూ, దారి పక్కన ఉచ్ఛతో
               విశ్వపు ఆదిమ రంగవల్లులను అలికే పిల్లలూ, రోదించే తల్లులూ
               నిరాకర పురుషులూ దారి లేని ఆత్మలూ దేహ దేశ ద్రిమ్మరులూ

అర్థం కాని అర్థాలు: తల వంచుకుని
        వృక్షాల కింద వానలో వంటరిగా వెళ్ళే
                    నైరాశ్యపు శక్తులను చూసి నవ్వకు
                                    కదలించకు - చూడు. ఏమో

నువ్వూ నడుస్తావేమో,  ఒక కాలం అనంతరం
        ఈ వలయ వివశిత విషాద మోహపు ఛితాభస్మపు దారులను. రా
             ఇక్కడికి, పేగు తెగని నీ గీతాలని వదిలివేసి, దాగిన నీ ప్రతిబింబపు

దర్పణ సమాధుల వద్దకి!
మొదలు పెడదాం మనం
ఇక ఒక కొత్త మరణాన్ని- (నీతోనే)  

11 September 2012

సూత్రం

నిలువెత్తు వస్తుమహళ్ళలో, వ్యాపార దర్పణాలలో
      నిండుగా పొందికగా జత కట్టి నియంత్రించిన, తళతళలాడే
           నియాన్ దీపకాంతులతో మెరిసే ఆ ఆకుల అల్లికల పుష్పగుచ్చాల
నియమిత సౌందర్యమే కానవసరం లేదు.

సాయంత్రాలలో మట్టిదారి పక్కగా రాలిపడిన
     ఒక గడ్డి పూవు చాలు. ఒంటరి శ్వేతరాత్రుళ్ళలో
           వెన్నెల ఊరి చలికి తొణికిసలాడే ఒక నల్లని గులకరాయి చాలు-

నిండుగా నీ శ్వాస ఊయలలూగే
        చెమ్మగిల్లిన ఒక పదం చాలు. కానీ వెళ్ళు వాళ్ళ వద్దకి.
                   నీ వాళ్ళు కాని వాళ్ళ వద్దకి. చూడు కాగి, అలసి, కమిలి

ముకుళితమైన ఆ వదనాలు, చల్లటి చినుకులను తాకి
          ఎంత హాయిగా విప్పరుతాయో! పరవాలేదు. పోయేదేమీ లేదు.

చివరికి అందరమూ
చుక్కలని కప్పుకుని
      చీకటిలోకి మట్టిలోకీ తలవంచుకుని
            ఏకాంత ప్రార్ధనతో వెళ్ళిపోయేవాళ్ళమే. ఎప్పుడూ ఏమీ లేనివాళ్ళమే.
   
వెళ్ళు. ఇక్కడినుంచి వాళ్ళ వద్దకి. నీ వాళ్ళు కాని వాళ్ళ వద్దకు.
కొంత నీ ప్రేమతో కొంత శాంతితో. కొంత
అవగాహనతో కొంత అంతిమ ఎరుకతో.

దూరం

ఒక
దూరం ఇంకొక దూరం

ఒక అశ్రువు నుంచి ఇంకొక అశ్రువు దాకా
మరొక  అశ్రువు ఎంత దూరం?
అశ్రువు నుంచి అశ్రువు దాకా
           నువ్వు ఎంత దూరం?
నా అశ్రువులో ఉండే నీకు నేను ఎంత దూరం?

దూరం దూరం. నిలకడ లేని
    నువ్వు ఒక మహా మాయా తీరం. లోతులేని
ప్రతిబింబించలేని      
ఒక ద్రవ దర్పణం.     

చూడిక. నీ నిశ్శబ్దం దూరమయ్యి
నన్ను ఎలా మూగవాడిని చేసిందో:

తాకకు ఇక నన్ను
దూరం నుంచి
దూరం దాకా-!   

09 September 2012

నీకై 17.

నువ్వొక కరుణ నిండిన పాత్రవని
దాహం తీర్చే చెలమవనీ వచ్చానీ
పూలవనం వద్దకు

కానీ, ఏం తెలుసు పాపం ఫిరోజ్ కు
నీ శరీరంలో, తనని నరికివేసే
వధశాలలు
ఉంటాయనీ

వెన్నెల వలలతో, అలలతో
బాహువుల లతలతో పూచే
చక్కని నీ ప్రియ వదనంలో
తనని దహించివేసే
ఆ సర్పాగ్నికీలలు
దాగి ఉంటాయనీ?

చూడు ఫరీదా, ఇక
ఇంతకంటే ఎక్కువ
చెప్పడం నిషిద్ధం-

ఎందుకంటే
అశ్రువులు నిప్పులై
ఓ మనిషిని నిండుగా
తగలబెట్టగలవని

ఫిరోజ్ కి తెలిసింది
ఇప్పుడే. 

08 September 2012

దాహం

నీ ఛాయలో నేను.

కావిడి కుండలైన కళ్ళతో 
నీ చెట్టు కింద ఆగి, ఒరిగి 

రాత్రి పక్షుల రహస్య నాదం వింటూ 
చెమ్మగిల్లిన హృదయంతో 
నిదురోయింది నేనే.

మళ్ళా వచ్చాను 
యిన్నాళ్ళకు నీ  
పరిమళం వద్దకు 
నెత్తురోడే నాలికతో.

కొద్దిగా 
నీ నీటి నీడలతో  
ఈనా పెదాలను
తడిపి వెళ్ళు. 

07 September 2012

ఒక క్షణం

నీళ్ళు లేని, అంచులు లేని
అరచేతుల్లోకి

ఈ తల తెగి
ప్రతిబింబం లేని ముఖంతో
రాలిపడింది.

ఇక నా పెదాలు
ఎక్కడా అని
ఇకెన్నడూ ఎవరినీ అడగకు. 

రహస్యం

నువ్వు అన్నావని కాదు కానీ
ఈ రహస్యం నీకే చెబుతున్నా-

గోడవారగా సాగే నల్లని చీమలు
తమ ఇళ్ళల్లోకి చేరుకున్నాక నీ
గురించే మాట్లాడుకున్నాయవి

ఒక తెల్లని కళ్ళ పావురం రాత్రంతా
వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చిందోనని
కానీ

ఈలోగా మందహాసంతో ఒక సర్పం
పూలగుచ్చంతో నీ దరిచేరడం అవి
చూడనే లేదు మరి ఇప్పటికీ

నేను నిన్ను చుట్టుకుని కాటు వేసి
క్షమాపణలు చెప్పే
ఈ సమయానికీ!   

ప్రాధమిక ప్రశ్న

నువ్వొక తెల్లని సీతాకోకచిలుకవి
పగటిపై అద్దిన కాంతివి
రాత్రిలో మెరిసే తారకవి
రావిచెట్ల కింద గలగలలాడే
నీరెండ నీడల
ఆకుల గాలివి.

మరి
నల్లటి దారులతో
నల్లటి దారులలో
తిరిగే  ఈ వలయాకారుడితో ఇక నీకేం పని? 

06 September 2012

ఇలాగే బావుంది

పోనీలే ఇలాగే బావుంది

గులాబీలు రాలిన చోట
ఒక సమాధిని నిర్మించుకోవడమే బావుంది
పోనీలే: చీకట్లు కమ్ముకున్న దినాలలో వచ్చి
ఒక దీపం వెలిగించిపో ఇక్కడ

నీ నామపు శిలాపలకం కింద
నీ స్మృతితో నిదురిస్తున్న ఒక
మనిషి మరణించిన చోట-

05 September 2012

అర్థం

అర్థం రాలి పొరలుగా
అదురుతోంది చూపు

ఇక అరచేతులని బలంగా రుద్ది
అద్దాలి  వేడిమితో
ఒంటరైన కన్నుని.

సరే.ఇక అడుగుతాను
నీ చూపులకి ఏమైనా
కళ్ళు  వచ్చాయోనని

కానీ, నానీ
దారి మధ్యలో
ప్రేమ గురించి
మాట్లాడకు ఒక మహా ద్వేషంతో

నీ అద్దంలో అర్థంగా
మారి అర్థాంతరంగా
మిగిలి / పోతాను-!

నిర్నిద్ర

పలకలుగా పలకలుగా
     మంచు రాలిన నేలపై పూసే పూల రేణువులలో నువ్వు.
           నీలో నువ్వు ఎంతకూ చేరుకోలేని వెదురు వనాల ప్రార్ధనాలయం.

ధూప గీతాలు సర్పహాసాలై
     విశ్వపు అంచులను తాకే మహా రెక్కలని విప్పుతాయి
          చీకటి వ్యధశాలలలోకి ఎర్రని కనులతో సాగుతూ నీకై నీకే

ఒక ఖగోళ సమాధి. కన్నీళ్ల చూపు లేని శ్వాస. చూడు
      తెగుతుంది ఇక నీ నిదుర అద్ధం మధ్యగా పుష్పిస్తూ. ఏమంటావు
           దానిని నువ్వు? దానినే, నువ్వు 'నువ్వు' అని పిలిచే ప్రతి

ప్రతిబింబపు కలనే? నలుగు పెట్టి రాయలేని
ఆ నాలుగు మహా వాక్యాల అంతిమ దారినే.

ఇక ఆ తరువాత
     తన గర్భంలోంచి ఒక దేవతా శిల్పం
            నూనుగు రెక్కలతో నిన్ను కౌగలించుకుని
                           నిను ఖననం కావించి నిను బ్రతికిస్తుంది. అందుకే ఉండు

ఉంటూ ఇక్కడే. ఇక్కడే. నా- నీ

ఈ వాచకాంతపు శిఖర
వలయ అంచుల పైనే!   

చేపకళ్ళు

అమ్మాయి కూర్చుంది గుమ్మంపై
కళ్ళని చక్రాల్లా తిప్పుతూ-

ఎదురుగా ఎవరో దీవించిన చెట్లూ
నింపాదిగా రాలే ఆకులూ కొంత
నీటి అంచులాంటి సూర్య కాంతి.

ఎండా నీడా పెనవేసుకున్న
నా అరచేతుల్లో ఆగిన సప్త

రంగుల నింగి బంతిని చూస్తూ
అడుగుతుంది కదా అమ్మాయి
తన కళ్ళని చేపపిల్లల్లా ఆడిస్తూ-

"అది నా బంతి. నాకివ్వు
నీకేం కావాలి?"

ఇక చక్కగా నేను
సూర్య బింబాన్నీ
చంద్రవలయాన్నీ తనకే ఇచ్చి
చక్కా పోయాను
చేపల కళ్ళు లేని
చీకటి లోకాలలోకి

"నాకేం కావాలి ఇంతకూ"
అనుకుంటూ.

04 September 2012

శలభం

గాలి వీచిన శరీరంలో వెలిగే
     రెండు దీపాల కళ్ళతో నువ్వు.

ఊయలలూగే గాలికీ
ఊగిసలాడే మంటకీ
నీకూ నాకూ ఒక్కటే సంబంధం.

నువ్వొక పుస్తకాన్ని
    తెరిచినప్పుడు తెలుస్తుంది
    నీకు, మొదలూ లేదనీ
చివరా లేదనీ

ఆదినుంచి అనంతం దాకా
వ్యాపించిన తెల్లటి పుస్తక
పుటలలో, వాచకాల

గాలి వీచిన దీపపు శరీరంతో
     అర్థాలను అచ్చొత్తేది
     నువ్వేనని. 'నేను' అని.

ఇక రాత్రంతా ఆ శలభం
నీ చుట్టూతానే గిర గిరా
గిర గిరా, గిరగిరా-మరి

వెళ్లి రానా
నేను ఇక?           

చప్పట్లు

 రెండు అరిపాదాలు తాకిన నేల ఇది.
     హృదయాన్ని వొత్తిన మట్టి బరువులోంచి నింగికి ఎగురుతాయి
           రెండు నయనాలు. చుట్టుకుంటాయి నింపాదిగానే రెండు చేతులు  నిన్ను  

శరీరంలోంచి తొలచుకు వెళ్ళిపోయే రెండు దూరాలై, దయగల బాహువులై.
     ఇక ఎదురుచూసే నీ రెండు చూపుల్లోంచి వెళ్ళేపోతాయి
           రెండు అరచేతులు, రెండు చప్పట్లుగా రెండు కన్నీటి చుక్కలుగా. చూడు

 ఎవరో వొదిలివేసి వెళ్ళిపోయిన చివరి ఇంటిలో

     శిధిలమైన కుండీలలో వొంటరిగా ఊగే లేత పూలమొక్కలనూ
               నీ అంత దగ్గరై, నీ మరోవైపై ఆ అవతలివైపున తెగి, గాలికి
                      ఊగిసలాడే పూలపాత్రానూ దుమ్ము పట్టిన అద్దాన్నీ నిన్నూ కోసే

కనురెప్పలు లేని ఎర్రటి ధూళి ఈ మధ్యాహ్నపు రాత్రిలో.

భగవంతుడా: ఇక అరచేతుల్లోని ముఖాన్ని నీళ్ళకు వొదిలి
     ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిన, 'నువ్వు' అనే అంతిమ క్షణం ఇదే.

పద ఇక.  వెళ్ళు ఇక
నీ అంతట నీవు
నీ కాంతి దహన
సంస్కారానికి---  

ఉందాం

ఇన్ని రకాల
గుత్తుల గుత్తుల చీకట్లలో
రేణువంత నిప్పును రాజేసి
రెండు అరచేతుల మధ్య

నుదిటిపై తిలకంలాంటి
ఆ సన్నటి జ్వాలను
పదిలంగా దాచుకోవడం

ఆ లిప్త కాంతిలో
మనల్ని మనం
చూసుకుంటూ
బ్రతకడం కొద్దిగా కష్టమే.
అయినా ఉందాం మనం

గదిలో రాలే వానలలో
ఈ గాలిలో ఆ వెన్నెల్లో
సాగరపూల నిశ్శబ్ధంలో

ఈ కత్తుల రాపిడిలో
ఆ లోహ తెరలలో
విష రహదారులలో
ఉందాం మనం ఇక

నా చేతుల్లో నువ్వూ
నీ అరచేతుల్లో నేనూ
దూరంగా పొడిచిన
ఒక తారక తీరాన్ని

చెమర్చిన మన కళ్ళల్లో
భద్రంగా దాచుకుని
బ్రతికించుకుంటూ-

ఉంటూ. మనం.  

03 September 2012

రక్త పిపాసి

చుక్కల పూలు నిండుగా పూచి
తడచిన భూమి నిండుగా వొణికి
పచ్చి బురద వాసన వేసే వేళల్లో

చీకటి ఇళ్ళల్లో మెత్తటి పొరల్లో  
నీ శరీరమంతటి రాత్రిలో
నా శరీరమంతటి పాత్రతో

ఇచ్చాను నేను నీకు సంపూర్ణంగా

నా గుండెను నిండుగా చీల్చుకుని
నీ కంటి నిండుగా నా కన్నీళ్ళూ
నీ ఒంటి నిండుగా నా నెత్తురూ-

రా. రా. రా. త్వరగా.
తాగు ఇక ఒక అమర ప్రేమతో
చివరి చినుకు వరకూ నా
చర్మాన్నీ ఎముకలనీ రక్తాన్నీ

నీ మృత్యుంజయ మహా
మొహంతో తమకంతో మన
శరీరాలంతంటి మహాదీపపు
పునరపి కాంతితో కరుణతో-    

కరుణ

మోసుకుపోతోంది వాన నీరు ఎక్కడికో
తనపై రాలిన ఆకాశాన్నీ ఆకునీ:

మబ్బుల్లేని కళ్ళతో చూస్తున్నాను కానీ
అలాగా ఉండలేకేనేమో
మన ఇరుకు అవస్థంతా-

ఓ నాలుగు చినుకులు రాలి
లోపలంతా చెమ్మగిల్లితే కానీ
తెలియదు, నీకైనా -నాకైనా-

అశ్రువువలె, ఆకాశాన్ని నింపుకున్న
సముద్రమంత చినుకువలె, పసి పసి
కనుల వలె, ప్రతిఘటించక తేలిపోయే
పండి రాలిన, రావి ఆకువలె

ఉండే ఆ ఒక మహాక్షణమే
అనంతమైన శాశ్వతమని.

ఇక కాంతి తాకిన కరుణ ఇచ్చిన ఆ కాలంలో
నువ్వు ఎవరు అంటే
నేనేమి చెప్పేది నీకు
నేనేమి ఇచ్చేది నీకు? 

అడిగినది

చల్లటి పల్చటి పరదా దాల్చిన
ఈ తడిచిన ఉదయాన్ని, ఇక 
దగ్గరగా తీసుకుని  మేలి ముసుగు తొలగించి చూద్దును కదా

పూవు కింద విచ్చుకున్న
రెండు రెమ్మలపై రాలిన
రెండు చినుకుల వలె నీ ముఖం నిండా విషాదం, ఇన్ని కన్నీళ్లు.

తనని దీనంగా కౌగలించుకున్న
ఆ మొండిచేతుల కరకు శిలను
ఓదార్పుగా నిమురుతూ తను
ఏమీ మాట్లాడలేదు, కానీ నేనే
అన్నాను ఇలా:

"ఎక్కడ దాచుకున్నావు యింత
కాలం ఇంత హాలాహలం
నాకు మాత్రం ఇన్నేళ్ళూ
నీ అమృత దేహాన్ని యిస్తో?"

01 September 2012

ఏమైనా కానీ

ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే
వచ్చేది తొలుచుకుని
పూవైనా రాయైనా సూర్యుడైనా చంద్రుడైనా నువ్వైనా:

నెత్తురైనా కానీ నిప్పైనా కానీ
మొండి గోడల మీదా కానీ
నిండు గుండెల మీదా కానీ
మిగలకుండా రాయాలి నీ అంతిమ వాక్యాన్నీ

లోకపు నల్లటి నుదిటి పలకపై
నీ తెల్లటి బలపంతో -ఎర్రని
మహాఆగ్రహంతో- ఎందుకంటే

ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే, నువ్వు
ఇంకా ఒపలేనప్పుడే, వాళ్ళు
ఇంకా నిను ఆపాలని
ప్రయత్నించినప్పుడే

నీ నాభి నుంచి, నీ కళ్ళ నుంచి
నలుదిశలూ పిక్కుటిల్లేలా
పిగుల్చుకుని వచ్చేది ఆ

తలలు బాదుకుని రోదించి
గుండెలు చరుచుకుని అరిచే
సర్వాన్నీ సవాలు చేసే ఓ
అనాది అంతిమ పొలికేక.

విన్నావా నువ్వు
అరిచావా నువ్వు
దహించుకుపోయే

అటువంటి ఆఖరి
యుద్ధ ప్రకటనను
ఇంతకు ముందు

ఎన్నడైనా
ఎక్కడైనా?     

ఎవరు?

రాత్రి బావి వద్ద కూర్చున్నాను
రాత్రంతా చీకటి కప్పల, బెక
బెకలు వింటూ. అయితే ఇక

నీతో, నీటితో విసుగు చెంది - తటాలున-
రాత్రి బావిలోకి విసురుగా ఒక
వెన్నెల గులకరాయిని విసిరి

బుడుంగున మునిగి
-నీ వేకువ జామున-
వెళ్లిపోయింది ఎవరు?