29 October 2012

చీకటి

ఒక అరచేత్తో నుదురు పట్టుకుని తల వంచుకుని 
మరో అరచేతిలో నెమ్మదిగా పేరుకుంటున్న 
చీకటిని చూసే నీ కళ్ళే గుర్తుకు వస్తున్నాయి 

ఆకస్మికంగా ఈ దినానంతాన:

తల ఎత్తలేవు, పాదం మోపలేవు. నిన్ను తాకలేక 
ఈ గాలి నిశ్శబ్దాన్ని నింపుకున్న చెట్లలోనే 
ఆగిపోతుంది.  ఎక్కడో ఏదో విరిగిపోతుంది. 
అలజడిగా ఒక పిట్ట  ఎగిరేపోతుంది. సరేలే 

తలను ఆసరాగా ఆన్చుకునే భుజమే ఉండుంటే 
ఎందుకు ఇదంతా? మోమును పొందికగా 
పొదివి పుచ్చుకునే నీ రెండు అరచేతులే 
ఉండుంటే ఎందుకు ఈ శోకమంతా? చూడు

అరచేతిలో చిట్లిన నుదురు ఎలా నిన్ను 
తలచుకుని చీకటితో కంపించిపోతుందో!   

1 comment:

  1. చాల బాగుంది. మట్టిని వదలక ఒక పాదం, దిగంతం మీద మరొకటి. నొప్పిని నొప్పిగానూ గొప్పగానూ చెప్పారు.

    ReplyDelete