26 December 2011

ఏమిటిది?

పొందగలిగేదీ ఏదో చెప్పు వనమాలీ, కోల్పోయేది ఏదో చెప్పు సుమమాలీ

తాకీ తాకగానే నెత్తురు చిందే నీ గుణం ఎవరిది?

ఒక మాట, ఎన్నాళ్ళుగానో దాచుకుని మాట్లాడాలనుకున్న
ఒక మాట దూరమై అపరిచితమై దీపం వెలుతురు అంచున
రెపరెపలాడుతుంది ఇక్కడ

ఏదో చెప్పాలనీ, ఏదో పొందాలనీ తిరిగి తిరిగి
తిరిగి వస్తాడు అతడు ఆ రెండు గదుల ఇంటికి

ఇళ్ళు పసి వదనాలు కావు ఇళ్ళు పసి చేతులు కావు
ఇళ్ళు పసి నవ్వులు కాక, స్మశానాలు అయ్యి
చాలా కాలం అయ్యిందని తెలియక అతడొక్కడే
తిరిగి వస్తాడు ఆ రెండు గదుల చెరసాలకి

అల్లాడతాయి చుక్కలు నిండిన నీడలు అతని ముఖంలో
రాలిపోతాయి తాను పెంచుకున్న పూలు
ముడతలు పడిన అతడి కనులలో: శరీరాలు చలించే చలి
కాలంలో, ఎండిపోయిన పుల్లలూ పాలిపోయిన వేపాకులూ

విరిగిపడతాయి ఎవరూ లేని అతడి హృదయ ఆవరణలో=

ఎవరూ లేరు ఇక్కడ ఇప్పుడు, తిరిగివచ్చే పెదాలకి
ఎవరూ రారు ఇక్కడ ఇప్పుడు: రీరానంతాన, తన
వద్దకు తానే తిరిగి వచ్చే బిందువంత కాలాన

ఇంతకాలం నడిచీ నడిచీ, ఇంతకాలం సాగీ సాగీ, ఇంతకాలం
రాసీ రాసీ, పోషించీ ఇతరుల చుట్టూ పరిభ్రమించీ
చివరికి అన్నింటా నువ్వే అయ్యి మిగిలి నువ్వే అంతటా ప్రతిబింబించీ

తాకీ తాకగానే నెత్తురు చిందుతూ, కన్నీరవుతూ
నువ్వు పొందినదేదో చెప్పు వనవాసమాలీ
నువ్వు కోల్పోయినదేదో చెప్పు అశ్రుమాలీ!

No comments:

Post a Comment