వెళ్లిపోదామనే అనుకున్నాను నేను
అయితే నీ ముఖమే ఒక ఇంద్రధనుస్సై
లాగింది నన్ను నీ వైపు
ఎవరు ఆపగలరు ఎవరు ఓపగలరు
చీకట్లో వెలిగించిన ప్రమిదెను
ప్రమిదెలో వెలిగిన తనువును
తనువులో రగిలిన మంటను
నీలినీడలలో కదిలే పక్షులను
రెక్కల్లో వొదిగిన వక్షోజాలను
పెదాలపై నెత్తుటి గాటునూ
క్షతాలలో ఊరిన కన్నీళ్లను?
అయితే ఇదంతా వేరే కథ: అందుకే
ఇక నీకు నేను మరొక కథ
ఎన్నడూ చెప్పను: చూడకు
అరవిచ్చిన చంద్రబింబం వంటి
నీ శ్వేతకమల వదనం నుంచి
మరలిపోదామనే అనుకున్నాను నేను=
(ఏడు రోజుల విలాపం తరువాత
ఏడు రంగులుగా విచ్చిన
తన తనువును తను
అతని దర్పణంలో రచించింది:
పదాలు అద్ధమైన పదాలు
అడ్డుకున్నాయి ఈ పదాలను:
అయితే ముందుగా
మాట్లాడింది ఎవరు?)
No comments:
Post a Comment