16 November 2011

ఎవరు?/క్షుద్ర...

నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ

చీకట్లో మర్రిచెట్లల్లో దాగున్నదీ
రాత్రుళ్ళలో స్మశానాలల్లో
సమాధుల పక్కన చింతించేదీ
నువ్వే అని వేరే చెప్పాలా?

నరుడా భాస్కరుడా హంతకుడా
కపాల చరిత్రలను కప్పుకోకుండా
విప్పెదీ చెప్పేదీ కప్పెదీ నువ్వే అని
విరివిగా వేరేగా చెప్పాలా?

తోడేళ్ళు తిరుగాడే దారులలో
నక్కలు ఎదురుచూసే వేళల్లో
నిప్పులతో నింగికి భూమిని చూపించేది నువ్వే
చితాభస్మాలలో అరకాలిన ఎముకలతో
వృక్షాలలో దాగిన వానకు ఆహ్వానం పలికేదీ నువ్వే
కలలతో తిరిగిరాని జాడలతో, నువ్వు కాని పదాలతో
ఆదిమ ఆర్తనాదాలతో శవాన్ని చేసేదీ నువ్వే
శవమయ్యేదీ శవాన్ని మోసుకుపోయేదీ నువ్వే

ఆహారమయ్యావా నువ్వు
నలుదిక్కులకూ పంచభూతాలకూ?
దాహార్తిని తీర్చావా నువ్వు
నిండైన గ్రహంకూ నిండు జాబిలికూ?

నువ్వు దహించివేసిన నువ్వు
యంత్రలిఖితం చేసిన నువ్వు
లోహపూరితం చేసిన నువ్వు
విషతుల్యం చేసిన సరస్సులలో
నీ ముఖాన్ని చూసుకున్నావా
తొలిసారిగా నువ్వు? తొలకరి కాలేని
తొడిమలను తెంపివేసిన నువ్వు?

నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ

శరీర వాహక పాపాలను
వాహకం లేని దోషాలను:

నువ్వు జన్మించావు నువ్వు మరణించావు

ఈ మధ్యలో కొంతమందిని చెరిచావు
ఈ మధ్యలో కొంతమందిని వలచావు
ఈ మధ్యలో కొంతమందిని
హింసించావు వొదిలివేసావు. ఈ మధ్యలో
నీ జననం మరణం అయిన స్త్రీలను
పరిపరి వాచకాలలో ప్రతిష్టించావు
పారిపోయావు ఓడిపోయావు పోయావు
నిలువెత్తు కట్టడాలను నిలువునా నిర్మించి
అంతర్ముఖ ఇతరునికి ఇతరుడివి

ఆయ్యావు నువ్వు. పోయావు నువ్వు

నవ్వలేదు ఎన్నడూ చూడలేదు ఎన్నడూ
నవ్వలేదు ఎవరూ చూడలేదు ఎవరూ:

లోహహస్తాలతో లోహపు చూపులతో
భూమిని తవ్వుకుని లోహ భాషతో
భూస్థాపితం భూద్రోహం అయ్యినది ఎవరు?

No comments:

Post a Comment