14 November 2011

ఈ ఉదయం

ఈ ఉదయం ఒక మంచుపూల వృక్షం

ఛాతిపై వెచ్చగా చేయి ఒకటి ఉండాలి
ఇక్కడే ఎక్కడో మెడ చుట్టూ సాగుతూ

ఈ ఉదయం ఒక మంచుపూల పాలవాన

ఇల్లంతా ఎగురుతూ కువకువలాడుతూ
వానలో మంచువనాలలో సవ్వడి చేసే
రెండు పిచ్చుకలు ఉండి ఉండాలి
ఇక్కడే ఎక్కడో ఈ పూట తోటన:

ఈ ఉదయహృదయం ఎవరూ తాకని
మంచు మొక్కలు చిగుర్చిన మట్టిదారి

గదిలోకీ మదిలోకీ సూర్యస్వప్నం
మదిలోకీ గదిలోకీ కాంతి పవనం
గదిలోకీ మదిలోకీ శాంతి సదనం

తనువులోకీ తనలోకీ కాల జలం
తనువులోకీ నాలోకీ ఇంద్రజాలం

ఈ ఉదయం ఈ హృదయం ఈ నయనం
మంచువృక్షాలలో మంచుకోయిల పాడే
పచ్చని మంచుపాట ఈ పూట: చూడు

నువ్వు చదువుకునే పుస్తకం వద్ద
మంచు చినుకులు నిండిన
మంచుకాంతితో మెరుస్తోన్న

ఎర్రని రోజు రోజాపూవుని
ఉంచి వెళ్ళినది ఎవరు=?

No comments:

Post a Comment