23 November 2011

తెలియదు

ఏం చేస్తున్నావో తెలియదు

చూసేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
చల్లటి కాంతి చిక్కటి చీకటిగా
మారుతున్న వేళల్లో నిన్నెవరూ వినరు కనరు

తెల్లటి కాగితంపై ముద్రితమౌతున్న
నీ వదనపు అంచులను తాకుతూ నేను
నీలిగులాబీలను హృదయ సమాధిపై

ఉంచుతాను, తాకుతాను, వింటాను

ఏం చేస్తున్నానో తెలియదు

ఊహించని నవ్వులాగా ఎదురుపడే నువ్వు
ఊహించని వానలాగా రాలిపడే నువ్వు
ఊహించని గాలిలాగా సుతిమెత్తగా తాకి
కనులపై నుంచి కలవలే వెళ్ళిపోయే నువ్వు

ఏం చేస్తున్నావో తెలియదు. వస్తావో రావో తెలియదు
పదమై పలుకరిస్తావో లేదో తెలియదు
అనుకోకుండా ఎదురుపడతావో లేదో తెలియదు:

తెలియని తనం నీ తనువుగా మారిన తరుణంలో
ఇక నువ్వెలా ఉంటావో ఉన్నావో తెలియదు

ఏం చేస్తున్నామో తెలియదు

హత్తుకునేందుకు ఎవరూ లేరు, ఎవరూ రారు
తెల్లటి కాంతి నల్లటి నుసిగా మారే వేళల్లో
నిదురను ఇచ్చేందుకు ఎవరూ రారు, రాలేరు:

ఇంతా చేసి బావున్నావా అని అడిగితే
ఎవరైనా ఏం చెబుతారు? ఎవరైనా ఎలా
మామూలుగా ఉండగలుగుతారు?

No comments:

Post a Comment