ఉంచుకునేందుకు నువ్వు గుర్తు
ఉంచుకునేందుకు నువ్వు
సరళంగా సరళత్వంతో సరళమైన దానిని
ఏదైనా ఇవ్వాలనుకున్నాను నీకు ఈ రోజు:
ఏమై ఉండవచ్చు అది? ఎటు వంటి పేరుని
కలిగి ఉండవచ్చు అది? కలిగి ఉన్నదానికి
కలిగిందానికి ఎటువంటి పేరునూ ఎటువంటి
బహుమతినీ బహుమతి కాక ఇవ్వవచ్చు?
పూలను ఇద్దామనుకున్నాను.
పక్షులను ఇద్దామనుకున్నాను
వదనాన్ని పసిపిల్లల చేతులతో
అల్లుకునే సాయంత్రపు గాలినీ
వొంటిని చలిమంటై చుట్టుకునే
చలికాలం నూగు సూర్యరశ్మినీ
గాజులకాంతై తాకే చల్లటి నీటినీ
కొంత వెన్నెలనీ కొంత చీకటినీ
నీకు ఇద్దామనే అనుకున్నాను
కొత్త రంగులనీ కొత్త పదాలనీ నీ పెదాలకి
అందిద్దామనుకున్నాను. నువ్వు చూడని
రాత్రినీ ధాత్రినీ తేలే ఎ/మరుపు మబ్బుల్నీ
ఆకులపై రాలే ఎండిన ఆకుల సవ్వడులనీ
నీకు వినిపిద్దామనే అనుకున్నాను
నీకు చూపిద్దామనే అనుకున్నాను
ఎవరు చూసారు ఇవన్నీ? ఎవరు
చూపించారు ఇవి ఇవన్నీ? అన్నీ
అడగవు నువ్వు చెప్పలేను నేను
సీతాకోకచిలుకలు వాలిన భూమి ఏది?
చినుకులు రాలిన నీ చెంపలని నిమిరిన
చేతులు ఏవి? నీ కన్నీళ్ళని ముద్దాడిన
పెదాలు ఏవి? నీ అరచేతిని పుచ్చుకుని
నిన్ను నడిపించిన చేతులు ఏవి?
అడగవు నువ్వు ఇవన్నీ చెప్పను
చెప్పలేను నేను ఇవన్నీ ఎప్పటికీ
సరళంగా సరళత్వంతో
సరళమైన బహుమతిని
ఇవ్వాలనుకున్నాను నేను ఒక రోజురోజాను
నీకు ఈ బహుమతి రోజు:
కొంత శాంతి కొంత కాంతి
కొంత భద్రత కొంత పవిత్రత
కొంత నిద్ర కొంత మెలుకువ
కొంత కరుణ కొంత నిబద్ధత
ఇవేమీ ఇవ్వలేక ఇవేమీ తీసుకోలేక
సరళత్వం కాలేక సరళంగా నీ వద్దకు
రాలేక సరళత్వాన్నితేలేక తెచ్చాను
వడలిపోయిన రెండు రెమ్మలను
సరస్సులు దాగిన కనురెప్పలను
లోయలు దాగిన కనుబొమ్మలను
తీసుకో: ఉంచుకో: దాచుకో
పూలపాత్రలో అలంకరించుకో
ఊరూ పేరు లేని
రంగూ రుచీ లేని
నీ సహచరుడిని నిశాచరుడిని
నిశ్శబ్ధపాదాచారిని
అరవిచ్చిన నీ లేత ఎరుపు కనులలో
పచ్చటి గడ్డి నీటిలో కదులాడే
నీ గోరువెచ్చని బాహువులలో:
ఆ తరువాత ఎలాగూ నీ పిల్లలు చెబుతారు
తండ్రి కాలేని తనయుడి గురించి
ప్రియురాలు కాలేని భార్య గురించి
శిధిలాలలోంచి శిధిలాలకి మరలే
జననమరణాల రహస్యాల గురించీ
తమ రక్తంతో తమ తనువులతో
మన రక్తంలో మన తనువులలో
సంతకాలు చేస్తో మనకి
స్వసంతర్పణలు ఘటిస్తో
కలలోంచి కలలోకి సాగిపోతో
ఇంకా కలలై మిగిలి రాలిపోతో:
నువ్వేమైనా చూసావా ఈపూట
గూళ్ళ వద్దకు పాకుతున్న నీలి
కుబుసాల నల్లని సర్పాలని?
(ఇక ఇక్కడ ఆగిపోతాను
ఇక ఇక్కడ విరిగిపోతాను
ఇక ఇంకా ఇక్కడ నేను
విశేషణంలేని క్రియనై
ఆగి సాగిపోతాను)
బాగుందండి!
ReplyDeletenaalo kaliginchin enno bhava prakampanalaku ee roju neevu karanamayyavani elaa cheppatam....matale rani danni.....love j
ReplyDelete