02 November 2011

వెళ్ళనా ఇక

నా ప్రియ శత్రువా, స్నేహితుడా

మోయలేను నిన్నూ కన్నీళ్లను
కన్నీళ్ళలో నిండిన తననూ తన
తనువునూ: చీకటయ్యింది

పక్షులు గూటికి చేరే వేళయ్యింది

పిల్లలని అక్కున చేర్చుకుని
వాళ్ళ చల్లటి అరచేతుల్లో
ముఖాన్ని దాచుకునే సమయమయ్యింది
హృదయంలో వాలిన నీడలు
పొడుగ్గా ఏటవాలుగా సాగే వేళయ్యింది

ఎవరో ఎక్కడో ఎందుకో
ఎదురుచూస్తూనే ఉంటారు నీ కొరకు
ఎవరో ఎక్కడో ఎందుకో
ఓపిక పట్టే నిలబడి ఉంటారు నా కొరకు

నా ప్రియ మిత్రుడా, సదా వెన్నంటే ఉండే
నా ప్రియ శత్రువా

మోయలేను నన్నూ నా కన్నీళ్లను
మోయలేను తననూ
తనువంతా నిండిన తన తనువునూ:

రాత్రంతా మనతో పదం
విసిగి వేసారిపోయింది:

వెళ్ళనా వెళ్ళవా ఇక ఇంటికి
ఒళ్లంతా నిండిన పదక్షతాలతో
చూపుల దంతాలు మిగిల్చిన
నిన్నటి పెదాల రక్తపు గాట్లతో?

No comments:

Post a Comment