31 October 2011

అద్దంలో చిన్నపిల్ల

అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది
చిన్న పిల్ల: ఏమి కనిపిస్తుందో ఏమో మరి

ప్రతిబింబంలో! నవ్వుకుంటోంది తనలో తాను
మాట్లాడుకుంటోంది తనతో తాను
రెండు జడలని భుజాలపైగా వేసుకుని
మురిసిపోతుంది తనలో తాను

నుదుట బొట్టు బుగ్గన చుక్క
పరికిణీ గౌనూ జడలో పూలు

ఏం జరిగిందో ఏమో మరి అద్దంతో చిన్నపిల్ల

అద్దం వద్ద నుంచి ఆవరణలోకి
ఆవరణలోంచి వీధిలోకీ మళ్ళా

వీధిలోంచి ఇంటిలోకీ హడావిడిగా
పరిగెడుతుంది: చేతికి చిక్కకుండా
చిన్ని చుక్క చక్కగా పారిపోతుంది

తన పాదాల వెంట పిచ్చుకలు
తన స్వరం వెంట కోకిలకిలలు

తన చూపు వెంట విరిసిన పూవులు
తన తనువు వెంట
నువ్వు ఇంతకాలం సాగిన దారులు

ఏం కనిపిస్తుందో ఏం వినిపిస్తుందో
ఏం మరిపిస్తుందో మరి

నిన్ను ఒక అద్దాన్ని చేసి తన ముఖాన్ని
అందులో చూసుకుంటుంది

అంతలోనే నీ చుట్టూతా గెంతుతుంది
అంతలోనే నీ చుట్టూతా ఆడుతుంది
అంతలోనే పదాల జల్లై నీ చుట్టూతా

హాయిగా
జారి రాలిపడుతుంది
అంతలోనే నీ వొళ్ళో చతికిలబడి
మెడ చుట్తో చేతులు వేసి
కలువ పూవుల హారమై

నిన్ను అల్లుకుపోతుంది

నీలో మురిసిపోతుంది గారాలుపోతోంది
నీకు అందని గగనమైపోతోంది

అద్దంలో
తన ముఖాన్ని చూసుకుంటుంది
చిన్న పిల్ల: ఏమి కనిపిస్తుందో ఏమో మరీ

నీకు తన ప్రతిబింబంలో
తనకు నీ ప్రతిబింబంలో

ఆగి ఆగి నవ్వుతోంది
ఆగి ఆగి కరిగిపోతోంది
అద్దంలోకి మాయమౌతోంది

ఒంటరిగా ఒక్కతే
అద్దంలో అద్దంతో చిన్నపిల్ల.

No comments:

Post a Comment