29 October 2011

అసూయ

ఎలాగూ చెప్పలేవు ఎలాగూ విప్పలేవు

నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళే దారులు
ఎప్పుడూ ఎక్కడా లేవు

హృదయాన్ని చీల్చి లాగిన అక్షరాలే
ఉంటాయి నీతోటి నీ బాటలో:
నువ్వే ఉంటావు వాటి నీడలో

వాటితోనే ఏడుస్తావు వాటితోనే నవ్వుతావు
వాటితోనే ప్రేమిస్తావు వాటితోనే ద్వేషిస్తావు
వాటితోనే పడుకుంటావు వాటినే కలగంటావు
వాటినే నటిస్తావు వాటినే ధరిస్తావు

అటు తిరిగిన పదాన్ని ఇటు తిప్పి
ఒక కొత్త భాషను కనుగొన్నట్టు సంబరపడతావు
మెలుకువలో కొంత స్వప్నావస్థలో కొంత
కొన్ని రంగులను అద్దాలకు అంటించి
ఒక కొత్త ప్రతిబింబాన్ని సృష్టించినట్టు ఊగిపోతావు

వాటినే మోహించాలి వాటినే రమించాలి
వాటినే నమ్మాలి వాటినే అమ్ముకోవాలి
మట్టిలా వాటినే తలపై పోసుకుని
సప్తలోకాలలోకి దూసుకుపోవాలి

ఇది వినా ఇంత కన్నా మరో దారి లేదు
ఇది వినా ఇంత కన్నా మరో దీపం లేదు

నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళే దారులు
ఎప్పుడూ ఎటూ లేవు
నువ్వెటూ వెళ్ళలేవు

వేసుకున్న ముసుగుల గురించి
అడిగింది ఎవరు? వేచి ఉన్న
మృత్యువును చూసింది ఎవరు?

చూడు. చూస్తూ రా ఇటు.

ఈ వాక్యం అంచున దాగి ఉన్న
పద సమాధి మన ఇద్దరిదే:

No comments:

Post a Comment