09 October 2011

స్వప్నజ్ఞానం

రాసావా నువ్వొక వాక్యాన్ని? అంచున

అలల అంచున చినుకులు

చినుకుల చివర్న కనులు
కనులు కోల్పోయే చోట
కన్నీళ్లు రాసే నల్లని పదాలు

మౌనం ఎవరిది? మౌనశోకం ఎందరిది?

నువ్వు విరమించుకున్న చోట
నేలపై రెక్కల్లో నీడలు:
నీడలలో జాడలు. ఆటలాడే చోటే
ఆటలాడే పిల్లలు: స్త్రీలూ

ఆ ఆనందం నీది కాదు
అనుభవం నీది కాదు: ఏకాంతంలో
ఏక అంతంలో అ/జ్ఞానం
అది నీదేనా? అది నీ దాహానిదేనా?

రాసావా నిన్ను రచించే ఒక వాక్యాన్ని
ఎపుడైనా ఎక్కడైనా?
ఎందుకైనా ఎవరికైనా?

ముద్దలు పెట్టె తల్లిని తండ్రి ఎక్కడా అని అడగకు. కడుపులో కత్తి దించిన మిత్రుడిని
నయనాలను తుడిచిన చేతులెక్కడా అని అడగకు. మరణించిన వాళ్ళను మళ్ళా
హత్య చేయకు. ప్రశ్నలే పరమావధిగా ఉన్న లోకంలో సమాధానాలు వెదకకు. వెళ్లి
పోయిన వాళ్ళను తిరిగి, తిరిగి తిరిగి రమ్మని పిలవకు.

చినుకుల అంచున చిట్లే చిగురాకులు
ఆకుల మధ్య గూడు కట్టే పురుగుల పాదాలు: అవి కాంతి పంజరాలు. రాలే గాలి
వీచే నీరు. ఎగిసే భూమి కుంగే నింగి.
నవ్వుతో నవ్వుతో నిను వీడే నీలాగ్ని.

పొదుపుకోలేవు. మరచిపోలేవు. పరమమోహిత వలయామృత విష కౌగిళ్ళను
వొదుల్చుకోలేవు విడమర్చలేవు. విప్పి కప్పి ఎవరికీ చూపించలేవు. ఒకే ఒక
వాక్యాన్ని వాక్యంత ఆరంభాన్ని రాయలేవు. ఆపివేయలేవు.

ఏం కావాలి నీకు? నిత్య శాపమోహితుడా సత్య ద్వేష ప్రేమికుడా? తీసుకో రెండు
సమాధులని నీ కనులలోకి కొత్తగా: అంతకుమించి

మిగిలిందీ ఏమీ లేదు. రాయగలిగించీ రాయగాలినదీ రాళ్ళు వేయగలిగినదీ ఏమీ
లేదు. లేదు. లేదు. ఆమెన్:

No comments:

Post a Comment