09 October 2011

ఎవరూ లేరు

సర్వం సిద్ధం చేసుకుని
లేరు ఎవరూ ఇక్కడ

వెళ్లిపోయేందుకూ
తిరిగి వచ్చేందుకు:

గుడ్లని పొదిగి
గూటిని వొదిలి

ఎగిరి వెళ్ళిన ఎదిగిన శ్వేతకపోతం
తిరిగి వస్తుందో రాదో

మన నయనాలయ్యిన
తను పూర్తిగా పొదగని

గుడ్లు గూడు లేక గోడలపై రాలిపోతాయో
గోడలకి చిట్లి మన కళ్ళు పగిలిపోతాయో
మసక మసక వానగా మిగిలిపోతాయో

చూసేందుకు
చూపేందుకు

ఎవరూ లేరు
ఎవరూ రారు ఇక్కడ:

(= చర్మాన్ని వొదిలి
ఇంద్రియాలని వొదిలి

తన ఎముకల్ని గూడు కట్టుకుని
తనని తాను తానే పొదుపుకుని

పదునాలుగేళ్ళు
రెండు కళ్ళు సప్త కాలాలు
మూడు ద్రోహాలను

వొదిలి వొదిలి
తను వెళ్లి తిరిగి వచ్చింది:

ముందూ తరువాత
అతడు అందుకోలేక

అందరితో నిండి
అందరితో ఉండి

ఎవరూ రాక ఎవరికీ
ఏమీ కాక కాలేక
అతడు చనిపోయాడు.

ఇక ఒక శిలావిగ్రహం

శిలా శాసనమై వేయి నాలికలై
పలు అ/సత్యాలను సంగ్రహంగా
లిఖించింది తిరిగి వచ్చే
ప్రతి/ధ్వని స్వరంతో:

నీకా కధ తెలుసా?)

సర్వం వొదులుకుని
సర్వం వద్దనుకుని

ఎవరూ లేరు ఇక్కడ

వెళ్లిపోయేందుకైనా
వచ్చేందుకైనా:


1 comment:

  1. చాలా బాగా రాసారు.

    ReplyDelete