18 October 2011

ఈ దిన/చర్య

ఇంకేం చేయను? ఇంకేం కాను?
౧.
దరికి చేరిన దారిలేని పూవును
దరికిరాని మునుపు లేని
ముందు చూపునూ కలిసాను.

పలికిన పలుకుల వెనుక
ఉన్నదెవరు? పలుకని
పదాల అర్థం చెప్పేదెవరు?

౨.

దారి లేదు. దరిదాపులో
శాంతి లేదు. భీమా
ఎటూ లేదు ఎవరికీ రాదు.

దారం మార్గం లేని ప్రాణంకి
ఒక ఆధార అధరం
కాగితంపై చివికే చిరిగే చిహ్నం

ఎవరికో ఎందుకో
ఎవ్వరూ ఎవ్వారికీ
ఎన్నటికీ ఎప్పటికీ

చెప్పరు. కాక కాలేక
కాకుండా చెప్పరు
కాక చెప్పరు. ఎవరూ:

౩.
ఒంటికాలితో జ్ఞానసరస్సులో
ఒక్క కన్నుతో
ఒక్క కాలంతో

ఏక వాక్యమైన అను అ/నేక
ఏకవాక్యానికి సాధన చేసాను:

తను ఎందుకు ఏడ్చిందో
తను ఎందుకు తననూ
తన బిడ్డనూ చంపుకుందో

జ్ఞానమైన పరకూడలి
వాక్యమేదీ చెప్పలేదు
రహస్యమూ విప్పలేదు

తన కన్నీళ్ళే ధారగా
దూరంగా దరిచేరి
రాలుతున్నాయి
అనాదినుంచి:

పసిశిశువుకి పాలిచ్చేదెవ్వరు?
పాపకు కథలు చెప్పి
నిద్ర పుచ్చే దెవ్వరు?

౪.

స్నేహితులగురించి యోచించాను
రాత్రుళ్ళ గురించి తర్కించాను:
నీడలైన స్త్రీల గురించీ, జాడలైన
తండ్రుల గురించీ వివరించాను

వదనాల గురించీ
వ్యసనాల గురించీ

స్మృతులలో సంచరించాను
మృతలలో తరించి, చెందని
మృతి వి/స్మృతి వంటిదని

విస్మరించి నెత్తురు గులాబీని
ఛాతిలో ధరించాను
రాళ్ళను కళ్ళల్లో చెలమలతో
ముళ్ళతో నిర్మించాను

కొన్ని చిత్రాలను రచించి
కొన్ని శిలలను మోహించి
కొన్ని కలలను చీల్చి చీల్చి

పై పదాలను పదాలతో
పెదాల మధ్య ఇమడని
అన/ర్థాలతో పూరించాను.

౫.
ఇంకేం కాను? ఇంకేం చేయను?

ఇంకేం చేయనూ ఇంకేం కానూ
అను/కుంటో రాత్రిని మింగిన
రాత్రిఆకులలోకి వాన చినుకై

జారి చేజారి పడ్డాను
మరియొకసారి. మరి
ఒక్కసారి.

No comments:

Post a Comment