(ఇలాగే. ఏనాడూ ఎన్నడూ
కాదు అని ఊహించకు
పోదు అని విశ్వసించకు:)
పూలల్లో దారం అల్లుకుంటూ తను తనే
కళ్ళలో చూపులు అల్లుకుంటూ
ఇక నేను ఏమాత్రం నేను కాదు: పూలల్లో
వెన్నెల్లో వానహారమై పిల్లలు
ఇల్లంతా కదను తొక్కే వేళ
ఇల్లంతా కథను చేసే వేళ, కథల్లో
పురాతన గాధలలో
నిన్ను పాడే ఆత్మలు ఎవరు?
నిన్ను వీచే చిరుగాలి
పద పరిమళం ఎవరు?
ఎక్కడ ఉన్నావు
ఎక్కడ నుంచి వచ్చావు
ఎక్కడికి వెళ్ళిపోతావు
ఎలా వెళ్ళిపోతావు?
(రాత్రంతా నేలపైకి నక్షత్రాలు కురియగా
చెలమలోకి చందమామ జారిపడింది.
మిణుగురులు మిగిలాయి
మిడతలు విశ్రామించాయి
గులకరాళ్ళ తడి మీద కళ్ళను ఆన్చి
అతడు రాత్రిని దాటాడా?
అక్కడే మిగిలిపోయాడా?)
= దారాన్ని అల్లుకున్న పూలు
పూలను అల్లుకున్న పిల్లలు
పిల్లలని పుచ్చుకున్న స్త్రీలు
స్త్రీలని విడనాడిన తూలనాడిన
ప్రధమ పురుషులు
ప్రధమ ప్రేమలూ: శాంతీ కాంతీ?
అడగకు: ఓదార్పుకోసం=
(ఎన్నడూ ఆశించకు
ఎన్నడూ ఎవరినీ
పలుకరించకు:
పలువరించకు
కలువరించకు.)
ఇది కవిత్వం అని
ఎవరు చెప్పారు నీకు?
ఒక చేతితో
ఒక ఛాతితో
ఒక దాత్రితో
చాలిక సప్త లోకాలు
చాలిక సప్త కాలాలు
చాలిక సప్త జననాలు
=ఒకే ఒక్క పునర్జన్మ పరిమళం
వెంటాడుతోంది రేపటికి
అప్పటికి సీతాకోకచిలుకలు ఉంటాయో
ఏమౌతాయో ఎందరికి తెలుసు? =
No comments:
Post a Comment