గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతోంది నీ పాప
పరిగెడతావు తన వెనుక తను
ఎక్కడ చేజారిపోతుందా అని:
గాలిలో వానలో ఎండలో నీడలో
చినుకులని కురుల అంచులతో విసిరివేస్తూ
రివ్వున దూసుకుపోతుంది నీ పాప
అవి తన తెల్లని పాదాలా గాలికి తేలికగా
సాగిపోయే మేఘాలా తెలియదు నీకు
పూవుకి సీతాకోకచిలుక రెక్కలొచ్చినట్టు
సీతాకోకచిలుకకి పూపరిమళం అద్దినట్టు
ముత్యాలు వెదజల్లినట్టు నవ్వుతో
అందకుండా ఆగకుండా చూడెలా
తూనీగలా చేపలా గాలిలో నీటిలో
నేలపై నింగిలో ఎలా తేలిపోతోందో:
మనమెలాగూ తారజువ్వలని పట్టుకుని
నక్షత్రాల పందిరిలోకి వెళ్ళలేం ఇక
మనమెలాగూ కాకరపువ్వొత్తులని
అరచేతుల్లో వెలిగించుకుని
రాలే రంగుల గుత్తులం కాలేం ఇక
మనది కాని ఆనందం అది
మనం వొదిలివేసుకున్న లోకం తనది
మనం గుర్తుకు మాత్రమే తెచ్చుకోగల
సమయం సందర్భం తనది
ఇక ఈ పూట తూనిగలకు దారం కట్టొద్దు
ఒక ఈ పూట చిలుకలను
పంజరాల్లో ఉంచొద్దు. ఇక
ఈ పూట పూవులను గాజుపాత్రలలో
అలంకరణగా మార్చొద్దు:
తన వెనుక పరిగెడుతున్న నీ వంక
తలతిప్పి చూస్తో చేయి చాపి పిలుస్తో
నువ్వు అత్యంత ప్రియంగా రాసుకున్న
నీ వేళ్ళ మధ్య నుంచి జారిపోయిన
గాలిలోకి కొట్టుకుపోయిన కాగితంలా
ఎగిరిపోతో ఆటలోకి పారిపోతో నీ పాప
నవ్వుతోంది. తనవెంట రమ్మంటోంది:
వెళ్లగలమా మిత్రుడా నువ్వూ నేనూ
తన వెంట తన పాదాల వెంట
తన పసి పసిడి పదాల వెంటా?
పూవుకి సీతాకోకచిలుక రెక్కలోచ్చినట్టు
ReplyDeleteసీతాకోకచిలుకకి పూపరిమళం అద్దినట్టు
మనది కాని ఆనందం అది
మనం వొదిలివేసుకున్న లోకం తనది
మనం గుర్తుకు మాత్రమే తెచ్చుకోగల
సమయం సందర్భం తనది
విషాదం ఎంత ఆర్థ్రమోనండీ.. గుండె బరువయ్యింది చదివాక..
ఎగిరిపోతో ఆటలోకి పారిపోతో నీ పాప
ReplyDeleteనవ్వుతోంది. తనవెంట రమ్మంటోంది:
నేను సరిగా అక్కడే ఆగిపోయాను. మీరు చెప్పింది చూస్తూ..మీరు వెళ్ళగలరనే అనిపిస్తుంది.నేను వెళ్ళగలనో లేదో తెలియట్లేదు.
Nice .. Keepit up ..
ReplyDelete