10 October 2011

చూసావా

తరుముతూ వచ్చే గాలిలోకి
కళ్ళను
రాలిన పూలను చేసి
చినుకులను చేసి వదిలేసాను

కొంత రాత్రిని అంటించి
కొంత కాంతిని అంటించి: పంపాను జతగా
కొంత వెన్నెలను
కొంత మంచునూ తోడిచ్చి:

వేకువజామునే వచ్చాయి రెండు కపోతాలు
పరిపక్వం చెందిన వెచ్చగా పొదిగిన గూళ్ళతో
పూలు విచ్చుకుంటున్న మెత్తటి సవ్వడితో
చిన్నగా చిట్లుతున్న రెండు వెచ్చటి గుడ్లతో:

నేనిక ఈ దినం లోకంలోకి
లోకుల కాలాలలోకీ
చిన్ని చిన్ని రెక్కలతో
చిరుచిరు చూపులతో
బుడి బుడి నడకలతో
భూమిని ముక్కున కరచుకుని ఎగరవచ్చు

భయం లేదు. భంధించే
భాంధవ్యాలు లేవు.
నేత్ర విధి విలాపాలు లేవు.

రెక్కలు కింద తేలే గాలి
రెక్కల పైన వొంగే నింగి

ఏమీ వొద్దు. ఏమీ కావొద్దు
ఇక ఈ విదేహ దినానికి=

= నీ కిటికీ అంచున వాలి
కువకువలాడుతున్న
నన్ను చూసావా ఈ పూట
నీ యంత్ర కర్మాగారపు
మంత్ర తంత్ర ముఖ పరదా
వదన వ్యసనాలలోంచి?=

No comments:

Post a Comment