21 October 2011

ఒకే ఒక్కసారి

నీపై దయయుంచిన కనులు

నీపై దయతో నిను తాకిన చేతులు
నీపై దయతో నీతో సాగిన పాదాలు

నీపై ప్రేమతో నీకై ఎగిరిన రొమ్ములు

నీపై ప్రేమతో నిను బంధించిన తన చెరసాలలు
నీపై ప్రేమతో నిను విన్న విసిగిన విన్నపాలు
నీపై ప్రేమతో నిను కన్న కన్నమ్మ భారాలు

నీపై సహనంతో అసహనమైన తనువులు

నీపై సహనంతో నిను వీడలేని గృహాలు
నీపై సహనంతో నిను హత్తుకునే పిల్లలు
నీపై సహనంతో నీపై ఓరిమితో
నిను వీడని వెళ్ళిపోయే తల్లితండ్రుల జాడలు

ఎవరివి ఇవి? ఎవరిచ్చారు ఇవి?
బహుమతిని అనుమతిగా నీకు
కళ్ళని నల్లని కన్నీళ్ళలో ముంచి?

సరస్సు లోతులో దాగిన
స్వర్ణ మీన నయనంలో ఉలిక్కిపడే ఆకాశం
నీ స్వనిర్ధేశిత విషాదం:

కారణమడగకు: కన్నీరుంకిన కరుణలో
రణమెందుకని అడగకు.
రుణాలు లేవు పదాలకు
ఊహలు లేవు చింతలకు:

బలహీనతలతోనో ఆధారాలతోనో
నీపై ఆధారపడో లోకంతో రాజీపడో

నిన్ను వొదులుకోలేకో
నిన్ను మార్చుకోలేకో

నిన్ను బంధించిన నిన్ను పరిమితించిన
నిన్ను నియంత్రించిన అనుమతించిన

దయయుంచిన ప్రేమించిన సహించిన

ఆ స్త్రీ తనువు నిలువెల్లా వొణికిపోతోంది
ఆ స్త్రీ మనస్సు నిలువునా కాలిపోతోంది

పాపవలె ఎవరూలేని అనాధవలె
బేలగా ఎదురుచూస్తోంది.
రోదనని మునిపంటిన నొక్కిపెట్టి
నీకై తపించిపోతోన్నది:

వెళ్ళవా ఇంటికి ఒక్కసారి అబద్ధంగానైనా
నిజంగా ఒక్కసారి? ఒకే ఒక్కసారీ?

No comments:

Post a Comment