విరమణ:
నీకు ఎప్పటికీ తెలియదు
ఇక్కడికి ఎందుకు తీసుకు రాబడ్డావో
ఎవరు ఎందుకు తెచ్చారో:
దీపమొక్కటే వెలుగుతోంది
పరదేహంలో అర్థంలేని పరమార్ధంతో.
చూసావా నువ్వు?
౧.
చీకట్లోంచి నింగిలోని పిల్లలకి
నేలపైని నక్షత్రాలని చూపించాను
ఆనక పిల్లలెవరో
నక్షత్రాలేవరో తెలియక
తికమక పడ్డాను
కొంత బ్రతికాను.
గదంతా సీతాకోచిలుకల
గులాబీల పరిమళం అల్లుకోగా
వాళ్ళ రెక్కల కింద దాగుని
రేపటినుంచి వచ్చే
నిన్నటి స్మృతి గాధలను
విన్నాను. నిద్రించాను
మధుపాలను త్రాగి
నిన్ను మరచి మరొకరిని తలచి:
నీకు తెలియదు ఇది.
౨.
ఉద్యానవనంలోకి వాళ్ళని
తోడ్కోనిపోయాను
కొంత దూరం వాళ్ళతో నడిచాను.
కొంత వాళ్ళ కధనాలని విన్నాను
సంధ్యాకాంతి ఆకులలోంచి దూసుకురాగా
చివరికంటా వాళ్ళతో నడవలేనని తెలిసి
మధ్యలో ఆగిపోయాను.
తల్లులు తండ్రులు: ఎవరు వెళ్ళగలరు
చివరిదాకా వారితోటి?
ప్రియులు ప్రియురాళ్ళు: ఎవరు నిర్మించగలరు
వారు వి/నిర్మించిన శిధిలాలని
వ్యామోహ గగనాలనీ
గత ప్రాచీన పరిమళపు వైభవాన్నీ?
౩.
రాత్రి మళ్ళా స్నేహిత సర్పాలను
సర్ప శిలల కలలను కలిసాను:
పూవులు లేక చినుకులు లేక
వెన్నెల లేక కృష్ణపక్షపు గీతం లేక
చికిలించిన కన్నులను కాంచాను
ధూళికి దొర్లే కాగితాలలో
అలసిన వదనాలను చూసాను
కన్నీటి మరకలలు రాసాను.
హృదయానికి హత్తుకుని
కొంత ఏడ్చాను
కొంత నవ్వాను:
ఉన్నారా స్నే/హితులు ఎప్పుడైనా
ఎక్కడైనా ఎవరికైనా?
కళ్ళను తాకని కాంతీ
కాంతిని వీడని చీకటీ
చీకటిని చీల్చే స్వరజావళీ
నీ పద అందియల రవళి
కావాలి ఎవరికీ?
శ్మశాన శాంతిలో
సాగర తీరంలో దూరానికి దూరంలో
వెలుగుతుందోక దీపం
దేహానికి దగ్గరలో దాహపు సామీప్యంతో:
ఓ స్త్రీ రేపు రా: విదేహ విషం
చిల్లుతుంది చాతిలోంచి
తడిభస్మమై చింతయై అంతటా
తానొక్కంతియై
ఇక నిన్ను స్మరించగలిగేది
విస్మరించగలిగేది ఎవరు?
(ఎందరు?)
విరమణ:
ప్రమిదె ఒక్కటే వెలగడం లేదు
పదంతో పరమార్ధంతో
పరమాత్మతో పర ఆత్మతో:
వేళ్ళకొసలకి అంటిన కన్నీటి
కారడవుల తడి నీదేనా?
No comments:
Post a Comment