24 October 2011

కుబుసం

సర్పపాదాలు నీవి సర్ప గమనాలు నీవి

దూరాన్ని దూరం తగ్గించదు
దాహాన్ని దాహం తీర్చదు:
అరచేతులలో అచ్చంగా దాగినది
అ/మృతమో విషమో తెలియదు

సర్పాలు అల్లుకుని నవ్వే
తియ్యటి విషపెదాలు నీవి

శిధిలాలని శిధిలాలలతో నింపలేవు
మొదలుని చివరితోనూ
చివరిని మృతువుతోనూ

పూడ్చలేవు. పూరించలేవు

అరచేతుల మధ్య రేఖలలో
రాయబడినదీ రాసేదీ
ప్రేమో ద్వేషమో తెలియదు

సర్పనయనాలు నీవి
సర్పవాలు చూపు నీది

చేతులు చుట్టూ తెల్లటి సర్పాలు అల్లుకుని
మెడ చుట్టూ తెల్లటి సర్పాలు వంకీలు చుట్టుకుని
పెదాలని నాలికతో సర్పమైమరుపుతో
తడితడిగా మార్చే తెల్లటి సర్పాల పదాలు:

నాదస్వరం వినని
నాగస్వరం తెలీని
నాదైన స్వరం:
కాలకూట విషం
లలాట లిఖితం.

కుబుసం విప్పే విడిచే
సర్పవెన్నెల వేళల్లో
రహస్యం చెప్పేందుకు

నువ్వు ఎవరు? నేను ఎవరు?

సర్పజ్ఞాన చరిత్రలే అందరివి:
సర్ప పరిమళమే అందరిదీ:

కోరకు. ఆగకు.
అరవిచ్చిన వాక్యాన్ని
ఆదిలోనే ముడవకు

రక్తం నిండిన చేతులతో
పాపం నిండిన కనులతో
పవిత్రత నిండిన అపవిత్ర నినాదాలతో
అతడు వస్తాడు:

=ఇక ఆ తరువాత
దేవతల గురించి
ఎవరూ మాట్లాడరు:

ఒక నల్లటి శిల్పం మాత్రం
గాలికి ఊగే ఎర్ర గులాబీతో
అనంతం దాకా వేచి
ఉంటుంది నీకోసం:

ఇక ఎప్పుడూ ఇటు రాకు
ఇక ఎప్పుడూ ఇటు వైపుకు చూడకు=

శ్వేతసర్పాల ప్రాచీన నృత్యం
ఇప్పుడే మొదలయ్యింది:

మరి. మరియొకసారి. మరి
ఒక్కసారి.

No comments:

Post a Comment