19 October 2011

ప్రార్ధన

౧.
ఎవరు నీ కొరకు అమ్ముకొనుటకు
భూమిని చదరపు ముక్కలుగా చేసెనో
ఎవరు నీ కొరకు ఆకాశమును
ప్రాంతములుగా విభుజించి
నక్షత్ర ప్రసారంగా మార్చేనో
ఎవరు నీ కొరకు నీటిని
రూకలుగా మార్చి టిన్నులలో అమ్మెనో
ఎవరు నీ కొరకు వదనాన్ని
తెరలపై వ్యసనంగా మార్చేనో
ఎవరు నీ కొరకు రక్తప్రీతితో
చమురు దాహంతో యుద్ధాన్ని క్రీడగా
ప్రసార మాధ్యమ వేడుకగా మార్చేనో

అట్టి వానికి స/మానవులు నెవ్వరూ లేరు
అట్టి వానిని ఎన్నడూ విశ్వసించకు

***
రాయలేను నిన్ను నిన్నులాగా

కొలనులోంచి జాబిలి
కొమ్మలలోకీ కలలలోకీ కదిలే వేళ
పలుకలేను నిన్ను నీలాగా:

దుస్తులు వేసుకో
నేత్రాలని కప్పుకో
ఇతరున్ని తప్పుకో

నిన్ను నిన్నులా రాయని నిన్నటి
రేపటి నీవైన చేతులు సాగుతాయి
నీ రొమ్ముల దాకా
నీ పాదాల దాకా=

పసి పాదాలు పెంచిన
దారీ దూరం ఏదీ లేదు

ప్రాచీన భాండాగారాలలో
నువ్వు జోక్యం చేసుకున్న
సత్యమేమీ లేదు

చూపులని చూపులతో తప్ప
వెనుతిరిగి చూసే కాలం లేదు
కనుమరుగు కాని తీరం లేదు

పాలు నిండిన కన్నీళ్లు
కన్నీళ్లు నిండిన పదాలు
పదాలు నిండిన పెదాలు

సౌమిత్రీ స్మృతీ విస్మృతీ

నీ అ/శరీరం ఎక్కడ?
నీ పర/మ/పద
మాతృ నేత్రం ఎక్కడ?
నీ నేత్ర నాట్యం ఎక్కడ?

స్మృతీ విస్మృతీ ధరిత్రీ

రాయలేను నిన్ను నీలాగా
కనీసం నాలాగా
కనీసం నలుగురి లాగా:

ఏడవకు: ఏడ్చే అరచేతులకు
నువ్వు తప్ప ఎవరున్నారు?
నవ్వే నవ్య వదన బింబాన్ని
నువ్వు తప్ప ఎవరు తాకారు?
రాత్రిలో పూచిన పూవును
నువ్వు తప్ప ఎవరు చూసారు?

కౌగలించుకో తల్లీ తల్లులనీ
తల్లులు లేని తండ్రులనీ
తండ్రులు లేని పిల్లలనీ
వాళ్ళ ఆదిమ ఆర్తిహస్తాలనీ

ఒడిలో గర్భబడిలో దాచుకో
మదిలో మరువక ఉంచుకో
నీవైన నిన్ను హత్తుకున్న
పసి కథలనీ పసి కనులనీ:

జాబిలిలోని కొలను
నింగిలోకీ నీడలలోకీ కదిలే వేళ
రాసుకుంటావు నువ్వు

నిన్ను నీలాగా నిన్నులాగా:

పవిత్ర పాపంతో కదిలే లోకంలో
దారి తప్పిని దారిలో
తిరుగాడే తిరిగిరాని సంచారిలో

శిధిలాలలో శిలలలో
కడలిలో అర్థకూడలిలో
స్థంబించిన పదాలతో

నీకేమి సంబంధం ?
నీకేమి అనుబంధం?

***

చీకటికి వెలుగూ వెలుగుకి చీకటీ
కడలికి భూమీ నీటికి నేలా అని
పేరు పెట్టినది ఎవ్వరు?

అంతర్జాతీయంగా అమ్ముకొనుటకు
ఎవరు నిన్ను భూమిగా మార్చేనో
చీల్చుటకు ఎవరు నిన్ను
నిత్యప్రసారంగా చేసెనో చీకట్లలో ముంచెనో
ఎవరు నిన్ను లోహపు రహదారులలోకీ
చదరపు గదులలోకీ
శరీరాలులేని అంగాలలోకీ రూపాంతరం
రూప అంతరం కావించెనో

అట్టివానికి స/మానవులేవ్వరూ లేరు
అట్టి వానిని ఎన్నడూ బ్రతుకనివ్వకు

***

(ఆమెన్: ధన్యవాదములు. ఇచ్చిన
మృత్యు బహుమతి శిధిలాలు

ఏకసార్వబౌమ కథనాలు నెవ్వరివో
ఇంకన్నూ చెప్పవలయునా?)

No comments:

Post a Comment