14 October 2011

ప్రధమ నేరం

ఇది నీ ప్రధమ నేరం కాదు
నాదీ కాదనలేను

తెల్లని గాజుగోళీలలో విశ్వమంత
కాంతిరహిత విసుగు లోకాలు

ఇది నీ కనుల ద్వితీయ నేరం కాదు
నా ప్రధమ శిక్ష కాదు

మనం మనతో విసిగిపోయాం
మనం మనతో

మనకి మనం దొరకనంత
దూరంగా జరిగిపోయాం:

జారిపోయిందీ ముఖాల్ని
అరచేతులలో కప్పుకుని
పారిపోయినదీ
విరిగిపోయినదీ

ఎవరూ అని అడగకు
ఎందుకు అని ఆశించకు
ఊహించకు చర్చించకు

పదం పదంతో విసిగి
శబ్ధం శబ్ధంతో పగిలి

మిగిలిన మహా నిశ్శబ్ధాన్ని
పూరించేది ఎవరు?

= మూర్ఖుడా! ముందే పలికిన
పదాన్నీ దాని జాడనీ
పరిహసించకు.
పరుల పాపాల్ని కీర్తించకు.

దిక్కులు దద్దరిల్లే చోట
పూలు వికసించే చోట
పసిపాదాలు నడిచే చోట
నవ్వులు నవ్వే చోట

నువ్వు ఉండకూడదు:

విలాపానికి లేని మిత్రుల
రూపాలలో విలపించిందీ
వలయమై మిగిలిందీ నువ్వే:

రాత్రిలో ప్రమిదె ఒక్కటే
వెలుగుతోంది ఒకటిగా:

ఇక చీకటికి తోడుగా
నీడలకి నీడగా

రాత్రంతా కరిగేదీ
రాత్రంతా మిగేలేదీ
రాత్రంతా రగిలేదీ

నువ్వే: వెళ్లిపోయేందుకు
భయం ఎందుకు?

No comments:

Post a Comment