06 October 2011

కృతజ్ఞతలు

నువ్వు వెళ్ళిన గురుతులే ఇవ్వన్నీ
నువ్వు లేనప్పుడు వచ్చి చూస్తాను

ఇల్లు సర్దుకుంటాను. అద్దాన్ని తుడిచి
ఒకసారి వదనాన్ని చూసుకుంటాను

రెండు నయనాల్లో రెండు నీడలు
నీరెండలై నీవై నేలని తాకలేని వెన్నెలై
రెండు నల్లటి నీడలు
ఎర్రగా మారిన తెల్లని కళ్ళల్లో:

పూలు పూసాయా
ఎప్పుడైనా ఇక్కడ?
చినుకులు రాలాయా
ఎప్పుడైనా ఇక్కడ?

చితి చింత: చితాభస్మం చెంత
హృదయ వింత.
ఎవరు కనుగొన్నారులే
నయన రహస్యాన్నీ
దాగుని దోచుకున్న
హృదయ విలాపాన్నీ?

కరుణనిమ్ము. నీ అరచేతులలో
నా ముఖాన్ని దాగనిమ్ము.
అంతదాకా అనంతందాకా

ఈ కృతజ్ఞతలు: నీ దర్పణ
విచిత్ర మాయా పదాలకు
ధన్యవాదాలు.

1 comment: