01 October 2011

... అను ఏక/వచనం

ఎంతో చేసానని అనుకుంటావ్ ఒక్కడివే ఒక్కడిలో ఒక్కడితో:

ఒక్కడికి ఇంతకన్నా ఎంత సాధ్యం అని యోచిస్తావ్. పిల్లలైతే ఆడుకుంటారు శ్రమ లేకుండా శ్రమ కాకుండా నేరాపరాధన లేకుండా కాని శ్రమ లేని శ్రమ లేకుండా క్షమ లేకుండా నువ్వెలా ఉండగలవ్
ఎదలో నిప్పు లేకుండా ఎద ఎడారి కాకుండా ఎడారిలో కన్నీళ్ళతో రాలకుండా?

ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నట్టుగా లేదని రోదిస్తావ్. నిర్మలమైన నిర్ముఖ భయమేదో నిన్ను తాకగా
విలవిల లాడిపోతావ్. నిలువెల్లా కరిగిపోతావ్. నిన్నే, నిన్ను కన్న పిల్లల గురించే ఇదంతా.
వాళ్ళైతే నవ్వుతారు ఎలాగో భయం లేకుండా విశ్వాన్ని సూర్యనయనంతో చూస్తో
వర్షపు వేళ్ళతో వెన్నెలని నీ ముఖంపై చిలుకరిస్తో వాళ్ళైతే నవ్వుతారు ఎలాగో అలాగా దిగులు లేకుండా:
నువ్వే ఎలా ఉండగలవ్ వీటన్నిటితో నీ భ్రాంతి వ్యసన వదనంతో లాభ నష్టాల వ్యాపారంతో?

కూడబెట్టుకున్నావ్ చిరునవ్వలేని పేదరికాన్ని. జాగ్రత్తగా జాగురూకతతో నిర్మించుకున్నావ్
చూపు లేని ఆకాశ హర్మ్యాల చదరపు రాతి గదులని యంత్ర మనుషులని రాతి మదులనీ.

వినరు వాళ్ళు నీ మాటలని. కనరు వాళ్ళు నీ స్వప్నాల్ని.
నమ్మరు వాళ్ళు నీ ముసలి మీసాలని
నీ మొసలి కన్నీళ్ళనీ నీ పద పదవుల
నీ పరాన్న భుక్కుల కీర్తి ఆకాంక్షలనీ.

పూలు పూసే కళ్ళు. కళ్ళని తాకే పొదరిళ్ళు
శాంతి ఇళ్ళు. అశాంతి లేని కాంతి శరీరాలు

ఇదే భూమి ఇదే నేల ఇదే వాన

ఇవే చెట్లు ఇవే పిట్టలు
ఇవే నీడలు ఇవే స్నేహాలు
ఇదే అమృతం ఇదే విషం
ఇదే శాపం ఇదే మోక్షం


రాత్రి కలువై నింగి నీళ్ళలో కదిలే జాబిలి. ఏటి ఒడ్డున ఎదిగిన వెదురు వొడిన దాగిన కడలి.
వీచే గాలి. వాలే గడ్డి. గడ్డిపై రాలే నక్షత్రాల సీతాకోకచిలుకల కాంతి.

ఎదురుచూస్తున్నాయి కప్పలు ఎగిరిపోయే మిడతలకై మిణుగురులకై: జారిపోతున్నాయి
సర్పాలు ఎవరివో గూళ్ళకై. నిదురించే పావురాళ్ళని చూసావా నువ్వు ఎప్పుడైనా? బతికిన
నయనాలతో ఉన్న శిల్పాలని చూసావా నువ్వు ఎక్కడైనా?

కొంత ఇష్టం కొంత కష్టం
కొంత ప్రేమ కొంత ద్వేషం
కొంత నలుపు
కొంత తెలుపు

కొంత 'కొంతలు' వద్దు వాళ్లకి
సర్వం సత్యం సౌందర్యం
సర్వం ధ్వంసం రహస్యం

రాచరికం లేని రాచముద్రిక
రాచముద్రిక లేని ముద్రిత వచనం
పునర్ ముద్రితం కాని వాచకం

మరొక లోకం
మరొక కాలం:

ఇవే ఇవే కావాలి వాళ్లకి
ఇవే ఇవే కావాలి పిల్లలకి
ఎదిగిన లిఖితాలు
వినిర్మాణ శతకాలైన వాళ్లకి

ఎంతో చేసానని అనుకున్న ఒక్కడే ఆ ఒక్కడే వొద్దు వాళ్లకి

ఎందుకున్నావ్ ఇంకా ఇక్కడే పారిపోకుండా వెళ్ళిపోకుండా
తిరిగొచ్చే తిరిగిరాని తిరిగే పదాలలోకి మరలి పోకుండా?

వెళ్ళిపో. తిరిగి రాకుండా వాళ్ళు వచ్చేదాకా
వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళిపోయేదాకా వెళ్ళిపో:

ఎదురుచూస్తుంది ఒక నలుపు శిలా స్మృతి చిహ్నం
నీకొరకు: ఇక ఎప్పుడూ ఎవర్నీ
ఎందుకు అని అడగకు.

No comments:

Post a Comment