16 October 2011

చూసారా మీరు

(నిన్ను ఏమీ కోరలేదు
నిన్ను ఏమీ కోరుకోలేదు)

నీ నుదిటిపై ఆనిన అరచేయి
అప్రతిహతంగా ఆవిరవ్వుతుంటే
ఏం చేస్తావు నువ్వు?

నిన్ను ఏమీ కోరలేదు
నిన్న ఏమీ కోరుకోలేదు

ఒక చేయి సర్పం కావొచ్చు. ఒక నాలిక బుసలు కొట్టవచ్చు.
ఒక చూపు ఒకే ఒక్క చూపు
నిన్ను విసిరికొట్టవచ్చు=

నిన్ను ఏమీ కోరుకోలేదు. నిన్ను ఎన్నడూ
ఏమీ ఆశించలేదు. లేదు లేదనక నిన్ను
ఎన్నడూ విడవలేదు

విచ్చుకునే పూల హృదయాల్లో మౌనం. దారిపక్కన వాలిన సీతాకోకచిలుకల్లో
నువ్వు ఎన్నడూ చూడని శోకం. గాలికీ కాంతికీ రాలే ఆకుల్లో
నువ్వు నిత్యం వినే శాపం. ఎవరిదీ విజ్ఞాన విష విలాపం? తెలుసు నీకు

నిన్ను ఏమీ కోరలేదు
నిన్న ఏమీ దాచలేదు

ఒక రాత్రి. ఒక భ్రాంతి.
ఒక నేత్రం ఒక శాంతి
ఇంతకు మించి

ఏమీ కోరలేదు నిన్ను
ఏమీ అడగలేదు నిన్ను

ఎక్కడికీ వెళ్ళలేదు నేను
ఎక్కడికీ వెళ్ళటం లేదు
నువ్వూ. దాచిన పదాలలో
దాగిన శాసనాలు:

స్మృతి లేదు ఇక . ఇతర
రాత లేదు ఇక . రాదిక.

ఇక వలయంలోకి
వలయమై వెళ్ళే
మధుమోహిత దారిదే ఇక.

పూలతో ముళ్ళతో పురుగులతో మృగాలతో
చేపలతో మొక్కలతో నిప్పుతో నీరుతో
నింగితో నేలతో కళ్ళ వెంబడి నీళ్ళతో

ఇటుగా వెళ్ళిన వాళ్ళని

ఎవర్నైనా చూసారా మీరు

ఎప్పుడైనా ఎక్కడైనా?

1 comment: