నీ ముందు మోకరిల్లిన మోము ముందు
నువ్వు నిస్సహాయుడివి
నిన్ను స్వీకరించిన చేతుల ముందు
నువ్వు దారి మరిచిన బాలుడివి
నిన్ను తాకిన కనుల ముందు నిన్ను
రక్షించిన చూపుల ముందు
దారీ తీరం లేని నావికుడివి
ఎంతకాలం పట్టిందీ గూడు అల్లుకోడానికి?
తిరిగి తిరిగే ఆ నల్లటి మట్టి పక్షులని
తిరిగి తిరిగి వచ్చే నదులు నిండిన ఆ
రెక్కల్నీ చూసానా నేను ఎపుడైనా?
ఏమని పిలవాలి? ఎవరిని రమ్మనాలి?
హృదయం పై హృదయం
ఒక వింత కాలకూట విషం
పెదవి పై పెదవి మాట పై మాట
అంతా వింత చితాభస్మం
నువ్వు తాకిన తను తన తనువు
అంతా ఒక వింత వి/స్మృతి మౌనం
ఎవరిని పిలువను?
ఏమని రమ్మనను?
నీ ముందు కన్నీళ్ళతో మోకరిల్లిన
దిగులు మోము ముందు
నువ్వు అనాధవీ నిస్సహాయుడివీ:
చేతులు ముకుళించి తల వంచి
సర్వాన్నీ ప్రేమించి, ఏమీ ఆశించక
నీడల్ని కిరణాలతో అల్లే మనిషికి
ఇక నవ్వడమెలాగో
ఇక ఉండటమెలాగో
నువ్వే చెప్పు. నువ్వే నేర్పించు.
కిరణాల అల్లిక తెలిసిన మనిషికి
ReplyDeleteనవ్వడం,ఉండడం ఒకరు చెప్పాలా...