09 November 2010

నీ రోజు ఇది

నీ రోజు ఇది
నీతో
నీ నీతో, నీవైన
నాతో
నీ ముంగిట్లో
కరగాల్సిన సమయమిది
లోకమిది=

నీదైన
నా రోజు కూడా ఇది
నా నాతో, నీవైన
అందరితో
నీ పదాల ముందు
మోకరిల్ల వలసిన
ప్రవాసపు
మహా దూరమే ఇది=

దూరం గురించే
ఇదంతా
దగ్గరితనం గురించే
ఇదంతా
ఇదంతా
దూరం అవుతున్న
దగ్గరతనం గురించీ
దగ్గరవుతున్న
దూరం గురించే
ఇదంతా= ఇదంతా
దగ్గరా
దూరం కాలేని
కన్నీళ్ళ రాళ్ళ కలల
గురించే ఇది అంతా
ఆది అంతా
అనంతం అంతా=

((చూస్తుండవచ్చు నువ్వు. ఒక పుష్ప గుచ్చాన్ని కళ్ళలో పదాలతో పుచ్చుకుని
ఎదురు చూస్తుండవచ్చు నువ్వు
ఊరికే అలా, ఈ రాత్రిలో, ఎప్పటికీ రాని తిరిగి వచ్చే ఆ రాత్రిలో, ఒక నిశ్శబ్దంలో
నిశ్శబ్దం కాని ఒక పదమై, రణరంగంలో కోల్పోయిన
ఒక ఇనుప ప్రతిబింబమై, నువ్వు అలా, ఊరికే అలా, ఎవరికీ చెందని కలలా,
నువ్వు ఎదురు చూస్తుండవచ్చు.))

((నేను వస్తానా? వస్తే, ఎప్పటికైనా నీ వదనాన్ని తిరిగి తెస్తే, వచ్చేదీ తిరిగి తెచ్చేదీ
ఎవరూ లేని ఒక ఒంటరి పదాన్నా? లేక
ఎవరూ చెప్పలేని ఒక సమూహపు, కళకళలాడే కన్నీటితో తళతళలాడే హత్యనా?))

నీ రోజు ఇది
నీతో నువ్వు కూడా
గడపలేని
నీవైన నాతో కూడా
పంచుకోలేని
పరమ కాళ రాత్రి ఇది
వైవాహిక
జీవితమిది=

మహా దూరమే ఇది
మహా దుర్మార్గమే ఇది
కాంచి
ఎవరూ పలుకలేని
మహా నైరాస్యమే ఇది
ఎప్పటికీ వివరించలేని
ఇద్దరి
విధ్వంసమే ఇది=

కాబట్టి
అంతం ఒకటి ఉండాలి
కాబట్టి
ఇలా, ఈ ఇలలో, నీదీ
నాదైన కలలో
ఇలా అంతం చేస్తాను

((నేను ఎక్కడా లేను
నేను ఎక్కడా ఉండను.))

2 comments: